Share News

అత్యంత పారదర్శకంగా సర్‌

ABN , Publish Date - Jul 12 , 2026 | 11:22 PM

ప్రత్యేక ఓటరు జాబితాల సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియను జిల్లాలో అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు.

అత్యంత పారదర్శకంగా సర్‌
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ టి.నిషాంతి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ టి.నిషాంతి

కొత్తగా 30 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు

పాడేరు, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక ఓటరు జాబితాల సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియను జిల్లాలో అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఆర్‌వో ఎంవీఎస్‌.లోకేశ్వరరావులతో కలిసి సర్‌ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆదివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓటర్లకు అందించిన ఎన్యూమరేషన్‌ ఫారాలను తిరిగి స్వీకరించి డిజిటలైజేషన్‌ ప్రక్రియను సైతం శాతశాతం పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తగిన సహకారం అందించారన్నారు. అర్హులైన అందరికీ ఓటు హక్కు కల్పించేలా పక్కాగా చర్యలు చేపట్టామని, అలాగే స్థానికంగా లేకుండా, రెండు చోట్ల ఓట్లున్న, మృతి చెందిన వారి పేర్లను పక్కాగా పరిశీలించి మాత్రమే జాబితాల నుంచి తొలగించేలా చర్యలు చేపట్టామన్నారు. సర్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేశామని, గడువు నాటికి శతశాతం పూర్తవుతుందన్నారు. జిల్లాలో ముంచంగిపుట్టు, అరకులోయ, పాడేరు, చింతపల్లి మండలాల్లోని పెండింగ్‌లో ఉన్న ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ పనులు సోమవారం నాటికి పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. అలాగే 1,200 మంది ఓటర్లు ఉన్న పోలింగ్‌ కేంద్రాలు, గ్రామాలకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి మరో 30 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు చేస్తామన్నారు. జిల్లాలోని అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది నిరంతర శ్రమ, ప్రణాళికాబద్ధమైన పనితనంతో శతశాతం సర్‌ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు ఎటువంటి దోషాలు లేని ఓటరు జాబితాలను రూపొందించగలుగుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఎం.భుజంగరావు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక అకాడమీ చైర్మన్‌ వంపూరు గంగులయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స, బీజేపీ నేత సల్లా రామకష్ణ, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

99.18 శాతం ఎన్యూమరేషన్‌ ఫారాలు డిజిటలైజేషన్‌

పాడేరు, జూలై 12(ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియలో భాగంగా జిల్లాలో ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియ 99,18 శాతం పూర్తయింది. జిల్లాలో పదకొండు మండలాల్లో 4 లక్షల 99 వేల 752 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపిణీ చేసి, వాటిలో ఆదివారం నాటికి 4 లక్షల 95 వేల 676 మంది ఫారాలను డిజిటలైజేషన్‌ చేశారు. దీంతో ఆదివారం నాటికి జిల్లాలో 99.18 శాతం డిజిటలైజేషన్‌ జరిగినట్టు ఎన్నికల కమిషన్‌ గుర్తించింది. మంగళవారం నాటికి గడువు ముగుస్తుండడంతో ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నారు.

Updated Date - Jul 12 , 2026 | 11:22 PM