మహా దారుణం
ABN , Publish Date - May 15 , 2026 | 01:32 AM
జీవీఎంసీ పారిశుధ్య విభాగం సిబ్బంది, సంబంధిత పనులు చేసే కొంతమంది కాంట్రాక్టర్లు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. యంత్రాలు అందుబాటులో ఉన్నా గెడ్డల్లో పూడికతీత, యూజీడీ (అండర్ గ్రౌండ్ డ్రైనేజీ) మ్యాన్‌హోల్స్ క్లీనింగ్ వంటి పనులను ఇంకా మనుషులతోనే చేయిస్తున్నారు. కొన్నేళ్ల కిందట కంచరపాలెం వద్ద ఇద్దరు, సిరిపురం జంక్షన్ వద్ద ఒకరు యూజీడీ మ్యాన్‌హోల్‌లో దిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఆయా పనులను యంత్రాలతో చేపడతామని అప్పట్లో అధికారులు ప్రకటించారు.
స్మార్ట్ సిటీలో బతుకులు దుర్భరం
యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ
మురుగు కాలువల్లో పూడికతీత పనులను
మనుషులతో చేయిస్తున్న కాంట్రాక్టర్లు
కానరాని భద్రతాచర్యలు
విశాఖపట్నం, మే 14 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ పారిశుధ్య విభాగం సిబ్బంది, సంబంధిత పనులు చేసే కొంతమంది కాంట్రాక్టర్లు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. యంత్రాలు అందుబాటులో ఉన్నా గెడ్డల్లో పూడికతీత, యూజీడీ (అండర్ గ్రౌండ్ డ్రైనేజీ) మ్యాన్‌హోల్స్ క్లీనింగ్ వంటి పనులను ఇంకా మనుషులతోనే చేయిస్తున్నారు. కొన్నేళ్ల కిందట కంచరపాలెం వద్ద ఇద్దరు, సిరిపురం జంక్షన్ వద్ద ఒకరు యూజీడీ మ్యాన్‌హోల్‌లో దిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఆయా పనులను యంత్రాలతో చేపడతామని అప్పట్లో అధికారులు ప్రకటించారు. యంత్రాలతోనే పూడికతీత, యూజీడీ నిర్వహణ పనులు చేపట్టేలా టెండర్లు పిలుస్తున్నారు. అయితే కొంతమంది కాంట్రాక్టర్లు మాత్రం ఈ రెండు పనులకు మనుషులనే ఉపయోగిస్తున్నారు. అలాంటి పనులకు పురమాయించినప్పుడు సూదులు, గాజుపెంకులు, ఇనుప వస్తువులు గుచ్చుకోకుండా చేతికి గ్లౌజ్‌లు, కాలికి మోకాలి వరకు కవర్ చేసే బూట్లు, ముఖానికి మాస్క్‌లు, తలకు దెబ్బ తలగకుండా మెటల్ టోపీలు, గెడ్డలు, యూజీడీ మ్యాన్‌హోల్స్‌లో దిగినప్పుడు ఆక్సిజన్ సరఫరా జరిగేలా ప్రత్యేక మాస్క్‌లను తప్పనిసరిగా అందజేయాలి. కానీ అవేవీ లేకుండానే గెడ్డల్లోనూ, యూజీడీ మ్యాన్‌హోల్స్‌లోను దింపి పనులు చేయిస్తున్నారు. బాధ్యులైన కాంట్రాక్టర్లు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఆర్కే బీచ్‌రోడ్డులో కోస్టల్ బ్యాటరీ ఎదురుగా ఫుట్‌పాత్ కింద ఉన్న గెడ్డలో వ్యర్థాలు భారీగా పేరుకుపోవడంతో ప్రవాహానికి ఆటంకం కలుగుతోంది. అయితే గెడ్డలోని వ్యర్థాలను తొలగించేందుకు ప్రజారోగ్య విభాగం అధికారులు ఫుట్‌పాత్‌పై ఉన్న మ్యాన్‌హోల్స్ పైకప్పులను తొలగించి యంత్రాలతో పూడికను బయటకు తీయాల్సి ఉండగా, ఖర్చు తగ్గుతుందనే భావనతో మనుషులను దింపారు. పూడికను బకెట్లతో బయటకు తోడించారు. మ్యాన్‌హోల్‌లో దిగిన కార్మికులు బకెట్‌తో పూడికతీసి పైన ఉన్న కార్మికుడికి అందజేస్తే అతను బయట కుప్పగా వేశాడు. ఈ క్రమంలో మ్యాన్‌హోల్‌లో ఉన్న కార్మికులు పీకల్లోతున మురికినీటిలో మునిగిపోయారు. బీచ్‌రోడ్డులో అటుగా వచ్చిపోయేవారంతా ఆ దృశ్యాలను చూసి చలించిపోయారు.