నేటి నుంచి ఉపమాకలో వెంకన్న బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Sep 14 , 2026 | 01:08 AM
ఉపమాక క్షేత్రంలో సోమవారం వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి.
- టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి
నక్కపల్లి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఉపమాక క్షేత్రంలో సోమవారం వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఆలయ సంప్రదాయాల ప్రకారం 14వ తేదీ ఉదయం అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల ప్రసాదాచార్యులు తెలిపారు. పది రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భక్తులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయం బయట టెంట్లు, ఆలయం లోపల పెండాల్స్ ఏర్పాటు చేశారు. 15వ తేదీన ధ్వజారోహణం, 20న వసంతోత్సవం, 21న తిరువీధి సేవ, 22న మృగవేట, 23న మహాపూర్ణాహుతి, వినోద ఉత్సవం, చక్రవారి స్నానం, ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.