Share News

వైభవంగా వేల్పులవీధి గౌరీ పరమేశ్వరుల ఉత్సవం ప్రారంభం

ABN , Publish Date - Jan 25 , 2026 | 12:55 AM

ప్రఖ్యాతిగాంచిన స్థానిక వేల్పులవీధి గౌరీ పరమేశ్వరుల ఉత్సవం శనివారం వైభవంగా ప్రారంభమైంది. తెల్లవారుజామున అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవంలో గౌరీ పరమేశ్వరులను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

వైభవంగా వేల్పులవీధి గౌరీ పరమేశ్వరుల ఉత్సవం ప్రారంభం
ఉత్సవం సందర్భంగా జనంతో కిక్కిరిసిన ఎన్టీఆర్‌ జంక్షన్‌

- పురవీధుల గుండా స్వామివారి రథం ఊరేగింపు

- భక్తులతో కిటకిటలాడిన రహదారులు

అనకాపల్లి టౌన్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : ప్రఖ్యాతిగాంచిన స్థానిక వేల్పులవీధి గౌరీ పరమేశ్వరుల ఉత్సవం శనివారం వైభవంగా ప్రారంభమైంది. తెల్లవారుజామున అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవంలో గౌరీ పరమేశ్వరులను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై ఉత్సవమూర్తులను ఏర్పాటు చేశారు. ఊరేగింపును ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రారంభించి ఉత్సవానికి శ్రీకారం చుట్టారు. గౌరీ పరమేశ్వరుల రథం ఊరేగింపు పురవీధుల గుండా సాగింది. సాయంత్రం కోల్‌కతా కాళీవేషం, విశాఖపట్నం పులివేషాలు, మామిడివానిపాలెం కళాకారుల కోలాటాలు, తప్పెటగుళ్లు, రాజమహేంద్రవరం కళాకారుల పొడుగు కాళ్ల మనుషుల డ్యాన్స్‌, తాడేపల్లిగూడెం వారి అమ్మవారి శిరస్సుల సెట్‌ వంటి నేలవేషాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కన్యకాపరమేశ్వరి ఆలయం జంక్షన్‌ నుంచి మెయిన్‌రోడ్డు మీదుగా నెహ్రూచౌక్‌, అక్కడ నుంచి చోడవరం రోడ్డు, అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉత్సవాన్ని తిలకించడానికి వచ్చిన జనంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి ఆధ్వర్యంలో సీఐలు జి. ప్రేమ్‌కుమార్‌, ఎం. వెంకటనారాయణ సిబ్బందితో పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు. రాత్రి పలుచోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

Updated Date - Jan 25 , 2026 | 12:55 AM