Share News

బురదలో కూరుకుపోయిన వాహనాలు

ABN , Publish Date - Sep 12 , 2026 | 11:29 PM

ల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఏవోబీలో పిల్లిగెడ్డ వంతెన అప్రోచ్‌ రోడ్డు బురదమయంగా మారింది.

బురదలో కూరుకుపోయిన వాహనాలు
వర్షానికి కొట్టుకుపోయిన గంగవరం కల్వర్టు

ఆంధ్రా-ఒడిశాకు నిలిచిన రాకపోకలు

నాలుగు గంటలపాటు ప్రయాణికులకు ఇబ్బందులు

సీలేరు, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఏవోబీలో పిల్లిగెడ్డ వంతెన అప్రోచ్‌ రోడ్డు బురదమయంగా మారింది. శనివారం ఆ బురదలో రెండు వాహనాలు కూరుకుపోయాయి. దీంతో ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రెండేళ్ల క్రితం పెను తుఫాన్‌కు పిల్లిగెడ్డ పాత వంతెన కొట్టుకుపోయింది. అప్పటికే కొత్త వంతెన నిర్మించడంతో అప్రోచ్‌ రోడ్డుకు బీటీ వేయకుండా ఎర్రమట్టి వేసి వదిలేశారు. శనివారం ఉదయం కూడా రెండు వాహనాలు అప్రోచ్‌ రోడ్డు బురదలో దిగబడిపోవడంతో నాలుగు గంటలకు పైగా రాకపోకలు నిలిచిపోయి, ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్నం వర్షం తెరిపివ్వడంతో వాహనాలను తీయడంతో రాకపోకలు కొనసాగాయి.

కొట్టుకుపోయిన గంగవరం కల్వర్టు

ధారకొండ పంచాయతీ పరిధిలోని గంగవరం కల్వర్టు వరద ఉధృతికి శనివారం కొట్టుకుపోయింది. దీంతో చిన్నగంగవరం, పెద్దగంవరం, రోలుగుంట, పేట్రాయి తదితర 10 గ్రామాలతోపాటు సరిహద్దులోని ఒడిశా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలిసిన వెంటనే సీలేరు ఎస్‌ఐ యాసిన్‌ హుటాహుటిన సంఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. శాశ్వత వంతెన నిర్మాణానికి ఎస్పీ దృష్టికి తీసుకువెళతానని ఎస్‌ఐ గిరిజనులకు హామీ ఇచ్చారు.

ఉధృతంగా ప్రవహిస్తున్న బత్తునూరు కాలువ

జీకేవీధి మండలం గాలికొండ పంచాయతీ పరిధిలో బత్తునూరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో బత్తునూరు, లేతమర్రి, మైనకోట, బుగ్గిరాయి, పాత్రునిగుంట మరికొన్ని గ్రామాల ప్రజలు నిత్యావసర సరుకులు కావాలన్నా, అత్యవసరంగా గర్భిణులు, ఇతరులకు వైద్య సేవలు పొందాలన్నా ఈ కాలువ దాటి సప్పర్ల గ్రామానికి రావాల్సి ఉంటుంది. అలాగే సీలేరు-ధారకొండ రహదారిలో దుప్పులవాడ సమీపంలో శనివారం ఉదయం భారీ చెట్టు పడిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సీలేరు ఎస్‌ఐ యాసిన్‌ వెళ్లి దుప్పులవాడ గ్రామస్థుల సహకారంతో చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.

Updated Date - Sep 12 , 2026 | 11:29 PM