వృక్ష విలాపం
ABN , Publish Date - May 28 , 2026 | 01:25 AM
నగరంలో పచ్చదనం పెంపుపై జీవీఎంసీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రహదారుల పక్కన, సెంటర్ మీడియన్లలో నాటిన మొక్కలకు నిత్యం నీరు పోయాల్సిన కాంట్రాక్టర్లు తమ బాధ్యతను విస్మరిస్తున్నా అధికారులు చూసీచూడనట్టు ఊరుకుంటున్నారు. దాంతో ఎండల తీవ్రతకు చెట్లు, మొక్కలు ఎండిపోతున్నాయి.
నీరు పోయకపోవడంతో ఎండిపోతున్న చెట్లు
పచ్చదనంపై జీవీఎంసీ నిర్లక్ష్యం
కాంట్రాక్టర్లతో పనిచేయించడంలో హార్టికల్చర్ విభాగం విఫలం
కొత్త కాంట్రాక్టర్ల ఎంపిక జాప్యం జరిగిందంటున్న అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో పచ్చదనం పెంపుపై జీవీఎంసీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రహదారుల పక్కన, సెంటర్ మీడియన్లలో నాటిన మొక్కలకు నిత్యం నీరు పోయాల్సిన కాంట్రాక్టర్లు తమ బాధ్యతను విస్మరిస్తున్నా అధికారులు చూసీచూడనట్టు ఊరుకుంటున్నారు. దాంతో ఎండల తీవ్రతకు చెట్లు, మొక్కలు ఎండిపోతున్నాయి.
హుద్‌హుద్ తుఫాన్‌కు నగరంలో వేలాది చెట్లు కూలిపోయాయి. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబునాయుడు నగరం తిరిగి పచ్చదనంతో కళకళలాడేలా మొక్కలు నాటించాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు భారీగా మొక్కలు నాటారు. ఆ సమయంలోనే మద్దిలపాలెం జంక్షన్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు జాతీయ రహదారి పొడవునా సెంటర్ మీడియన్ (డివైడర్)లో ఆకర్షణీయంగా ఉండే చెట్లను ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి నాటించారు. ఆ తరువాత పలు సందర్భాల్లో బీచ్‌రోడ్డుతోపాటు వివిధ పార్కుల్లో పచ్చిక (లాన్) పరిచారు. వీటన్నింటినీ నిర్వహించే బాధ్యతను జీవీఎంసీ హార్టికల్చర్ విభాగానికి అప్పగించారు. ఆ విభాగం అధికారులు నగర పరిధిని విభజించి చెట్లు, పచ్చదనం నిర్వహణను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. సాధారణ రోజుల్లో అడపాదడపా వర్షాలు కురుస్తుంటాయి కాబట్టి పెద్దగా నీరు పోయాల్సిన అవసరం ఉండదు. కానీ వేసవి సీజన్‌లో మాత్రం తప్పనిసరిగా రోజువిడిచిరోజు మొక్కలు, చెట్లు, లాన్‌కు నీరు పెట్టాల్సిందే. లేనిపక్షంలో చనిపోతాయి. కాబట్టి కాంట్రాక్టర్లతో పక్కాగా నీళ్లు పెట్టించేలా హార్టికల్చర్ విభాగం అధికారులు చూడాల్సి ఉంటుంది. కానీ నగర పరిధిలో గత రెండు నెలలుగా సరిగా నీరు పోయకపోవడంతో మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. మద్దిలపాలెం జంక్షన్ నుంచి తాటిచెట్లపాలెం జంక్షన్ వరకు జాతీయరహదారి సెంటర్ మీడియన్‌లో ఉన్న చెట్లు పూర్తిగా ఎండిపోయాయి. అలాగే బీచ్‌రోడ్డులో పది నెలల కిందట యోగా మెమోరియల్ బోర్డు వద్ద ఏర్పాటుచేసిన పచ్చిక నిర్వహణ లేకపోవడంతో ఎండిపోయింది. ఈ విషయం జీవీఎంసీ హార్టికల్చర్ ఏడీ వాసుకి వద్ద ప్రస్తావించగా కొత్త కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించడంలో జాప్యం జరిగిందని, అందువల్లనే జాతీయ రహదారిపై చెట్లు ఎండిపోయాయన్నారు. కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ముడసర్లోవ రిజర్వాయర్ నుంచి నీటిని ట్యాంకర్లతో తీసుకువెళ్లి మొక్కలకు పోయాలని ఆదేశించారన్నారు.