Share News

కూరగాయాలు

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:34 AM

ఎల్‌నినో ప్రభావం నిత్యావసర సరుకులతో కూరగాయల ధరలపైనా తీవ్రంగా పడింది. నిత్యావసర సరుకుల ధరలు ఇప్పటికే పెరిగిపోగా.. కూరగాయల ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. ఖరీఫ్‌లో వేసిన పలు రకాల కూరగాయ పంటలు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతినడంతో మార్కెట్‌కు సరుకు రాక తగ్గిపోయింది.

కూరగాయాలు
కూరగాయలు

మండుతున్న ధరలతో వినియోగదారులు బెంబేలు

ఇటీవల కురిసిన వర్షాలతో దెబ్బతిన్న పంటలు

మార్కెట్‌కు తగ్గిన కూరగాయల రాక

ఎన్‌నినో ప్రభావంతో ఇప్పటికే బాగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు

20 శాతం మేర పెరిగిన నెలవారీ కుటుంబ ఖర్చులు

ఎడాపెడా ధరల మోతతో సామాన్యుల ఆందోళన

అనకాపల్లి టౌన్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం నిత్యావసర సరుకులతో కూరగాయల ధరలపైనా తీవ్రంగా పడింది. నిత్యావసర సరుకుల ధరలు ఇప్పటికే పెరిగిపోగా.. కూరగాయల ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. ఖరీఫ్‌లో వేసిన పలు రకాల కూరగాయ పంటలు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతినడంతో మార్కెట్‌కు సరుకు రాక తగ్గిపోయింది. దీంతో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఎడాపెడా ధరల మోతతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నెల వారీ ఇంటి ఖర్చులు 20 శాతం వరకు పెరిగాయని చెబుతున్నారు.

తీవ్రవాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో అత్యధిక శాతం మంది రైతులు సంతోషం చెందారు. అయతే అధిక వర్షాల కారణంగా కూరగాయ పంటలు.. ముఖ్యంగా బీర, బెండ, దొండ, వంగ, గోరుచిక్కుడు పంటలతోపాటు ఆకు కూరల తోటలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నాలుగైదు రోజులపాటు పూర్తిగా నీట మునిగిన పొలాల్లో ఆయా కూరగాయ పంటల మొక్కలు ఉరకెత్తి వడలిపోతున్నాయి. దీంతో మార్కెట్‌కు వివిధ రకాల కూరగాయల రాక తగ్గుతున్నది. స్థానిక అవసరాలకు సరిపడ కూరగాయలు రాకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. గత వారంతో పోల్చితే కూరగాయల ధరలు 20 నుంచి 50 శాతం వరకు పెరిగాయని చిరు వ్యాపారులు చెబుతున్నారు. స్థానిక రైతులు పండించే కూరగాయలతోపాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే ఉల్లిపాయలు, ఇతర కూరగాయల ధరలు పెరిగిపోతుండడం వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నది.

అనకాపల్లి పట్టణంలోని గాంధీ కూరగాయల మార్కెట్‌లో ఉల్లిపాయలు కిలో రూ. 50-60కి విక్రయిస్తున్నారు. నెల రోజుల క్రితం కిలో రూ.30 వున్న ఉల్లిపాయల ధర ఇప్పుడు రెట్టింపు అయ్యింది. గత వారం కిలో రూ.40 పలికిన బీరకాయలు ప్రస్తుతం రూ.60కి పెరిగాయి. బెండకాయలు రూ.30 నుంచి రూ.70కి, దొండకాయలు రూ.20 నుంచి 40కి, మిర్చి రూ.40 నుంచి రూ.60కి, క్యారెట్‌ రూ.30 నుంచి రూ.50కి, బీట్‌రూట్‌ రూ.30 నుంచి రూ.50కి, చిక్కుడు రూ.50 నుంచి రూ.80కి, గోరుచిక్కుడు రూ.30 నుంచి రూ.50కి, దోసకాయలు రూ.20 నుంచి రూ.50కి, తెల్ల వంకాయలు రూ.30 నుంచి రూ. 50కి, నల్ల వంకాయలు రూ.30 నుంచి రూ.40కి, టొమేటో రూ.30 నుంచి రూ.45కి, బీన్స్‌ రూ.60 నుంచి రూ.90కి, మునగకాడలు రూ.30 నుంచి రూ.50కి పెరిగాయి.

కాగా రైతుబజారులో కూరగాయల ధరలు ఒకింత తక్కువగానే వున్నాయి. ఉల్లిపాయలు కిలో రూ.54, టొమేటో రూ.40, పచ్చిమిర్చి రూ.52, క్యారెట్‌ రూ.40, బీట్‌రూట్‌ రూ.36, మునగకాడలు రూ.52, తెల్ల వంకాయలు రూ.38, నల్ల వంకాయలు రూ.50, బెండకాయలు రూ.40, దొండకాయలు రూ.40, బీరకాయలు రూ.42కి అందుబాటులో ఉన్నాయి. అయితే కొద్ది రకాల కూరగాయలు.. అవి కూడా అరకొరగా వస్తుండడంతో త్వరగా అయిపోతున్నాయి. దీనికితోడు గాంధీ మార్కెట్‌ కన్నా రైతుబజారు ఎక్కువ దూరం కావడంతో వినియోగదారులు గాంధీ మార్కెట్‌లోనే కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు.

Updated Date - Sep 30 , 2026 | 12:34 AM