Share News

వేదాంత ధిక్కారం!

ABN , Publish Date - Jul 10 , 2026 | 01:03 AM

విశాఖ పోర్టునుంచి కార్యకలాపాలు నిర్వహించే వేదాంత కంపెనీ పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తోందని వన్‌టౌన్‌ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు.

వేదాంత ధిక్కారం!

భారీ గాలుల సమయంలో బాక్సైట్‌ దిగుమతి

విపరీతంగా వెలువడుతున్న కాలుష్యం

గతంలో జరిమాన విధించినా మారని తీరు

తాజా ఘటనపై పీసీబీ నోటీస్‌

విశాఖపట్నం, జూలై 9 (ఆంధ్రజ్యోతి):

విశాఖ పోర్టునుంచి కార్యకలాపాలు నిర్వహించే వేదాంత కంపెనీ పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తోందని వన్‌టౌన్‌ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. గత ఏడాది డిసెంబరులో కంపెనీకి కాలుష్యనియంత్రణ మండలి రూ. ఆరు లక్షల జరిమానా విధించింది. అయినప్పటికీ కంపెనీ తీరుమారలేదంటున్నారు.

ఈనెల తొలివారంలో వేదాంత బెర్తు నుంచి బాక్సైట్‌ దిగుమతి సమయంలో వచ్చిన ధూళితో వన్‌టౌన్‌లో అనేక వీధులు ఉక్కిరిబిక్కిరయ్యాయి. ఈనెల తొలివారంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి, దానికి ఆనుకున్న ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భారీ గాలులు వీచాయి. ఈ సమయంలో విశాఖ పోర్టులో వేదాంత కంపెనీకి కేటాయించిన బెర్తు నుంచి వారం రోజులపాటు బాక్సైట్‌ను దిగుమతి చేశారు. కోటవీధి వెనుకనున్న వెంకటేశ్వర దేవాలయానికి తూర్పుగా ఉన్న బెర్తులో బాక్సైట్‌ దిగుమతి చేస్తుండగా ఎర్రటి బాక్సైట్‌ ధూళి వ్యాపించింది. గత నెల 29న ప్రారంభించిన బాక్సైట్‌ దిగుమతి ఈనెల ఏడోతేదీ వరకు కొనసాగింది. అదే సమయంలో జ్ఞానాపురం నుంచి ఇనుముఖనిజం పోర్టుకు రవాణాచేశారు. ఈనెల రెండోతేదీ నుంచి ఏడోతేదీ వరకు కొనసాగిన గాలుల ఉధృతితో ఎర్రటి ధూళి కోట వీధి నుంచి చిలకపేట, బెల్టు కింది ప్రాంతం, పరిసరాల్లో ధూళి వ్యాపించి ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ముఖ్యంగా కోటవీధి, చిలకపేట తదితర ప్రాంతాల్లో కాలుష్యం తీవ్రత మరింత ఎక్కువగా ఉండడంతో జిల్లా యంత్రాంగానికి, కాలుష్య నియంత్రణమండలికి ఫిర్యాదు చేశారు.

నిబంధనలున్నా...

సాధారణంగా ధూళి ప్రభావం ఎక్కువగా ఉన్న ముడిసరుకు (బాక్సైట్‌, ఇనుము, ఇతర గనులు) ఎగుమతి, దిగుమతులకు కొన్ని నిబంధనలున్నాయి. గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ఇటువంటి సరుకుల ఎగుమతి, దిగుమతి ప్రక్రియను నిలిపివేయాలి. గాలుల వేగం తక్కువగా ఉన్నప్పుడు కార్యకలాపాలు నిర్వహించాలి. అయితే వేదాంత కంపెనీ అవేవీ పట్టించుకోకుండానే బెర్తు నుంచి బాక్సైట్‌ను దిగుమతి చేసిందని కోటవీధికి చెందిన పలువురు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదుచేశారు. వారం రోజుల పాటు బాక్సైట్‌ను దిగుమతి చేయడంతో ఎర్రని ధూళి కమ్మేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రెండురోజులేగా మొబైల్‌ యాంబియంట్‌ ఎయిర్‌ క్వాలిటీ యంత్రంతో తనిఖీలుచేశారు. నిర్దిష్ట ప్రమాణాల కంటే ఎక్కువగా పీఎం 10, పీఎం 2.5 నమోదైందని గుర్తించారు. బాక్సైట్‌ దిగుమతి సమయంలో నిబంధనలు పాటించకుండా పర్యావరణానికి హాని కలిగించినట్టు గుర్తించి తాజాగా వేదాంత కంపెనీకి నోటీస్‌ జారీచేశారు.

గత ఏడాదే జరిమానా

గత ఏడాది డిసెంబరులో వేదాంత కంపెనీకి రూ.6 లక్షల జరిమానా విధించామని పీసీబీ ఈఈ పీవీ ముకుందరావు తెలిపారు. మరో వారంలో ఇంకో బాక్సైట్‌ నౌక విశాఖ పోర్టుకు రానున్నదని పోర్టు వర్గాలు చెబుతున్నాయని కోట వీధికి చెందిన కొందరు వెల్లడించారు. ఈ పర్యాయం బెర్తులో బాక్సైట్‌ దిగుమతిని అడ్డుకుంటామని హెచ్చరించారు. పర్యావరణానికి ఇబ్బందిలేకుండా దిగుమతి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Jul 10 , 2026 | 01:03 AM