నేటి నుంచి వీబీ జీరామ్‌జీ
ABN , Publish Date - Jun 30 , 2026 | 11:50 PM
సుమారు రెండు దశాబ్దాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పిస్తున్న ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ తెరమరుగైంది. దీనిస్థానంలో పలు మార్పులు, చేర్పులతో కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, ఆజీవిక మిషన్ గ్రామీణ్ (వీబీ జీరామ్‌జీ)ను తీసుకొచ్చింది. ఈ పథకం జూలై ఒకటి నుంచి అమల్లోకి రానున్నది.
మహాత్మా గాంధీ ఎన్‌ఆర్‌ఈజీఎస్ పేరు, విధివిధానాల్లో మార్పులు
ప్రతి కుటుంబానికి ఏడాదిలో 125 పని దినాలు
15 రోజుల్లో కూలీలకు చెల్లింపులు
నిధుల వ్యయంలో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం
పాత పథకంతో పోలిస్తే రాష్ట్రాలపై 30 శాతం అదనపు భారం
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
సుమారు రెండు దశాబ్దాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పిస్తున్న ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ తెరమరుగైంది. దీనిస్థానంలో పలు మార్పులు, చేర్పులతో కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, ఆజీవిక మిషన్ గ్రామీణ్ (వీబీ జీరామ్‌జీ)ను తీసుకొచ్చింది. ఈ పథకం జూలై ఒకటి నుంచి అమల్లోకి రానున్నది.
గ్రామీణ ప్రాంతాల్లో ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు వ్యవసాయ పనులు అంతగా వుండవు. దీంతో వ్యవసాయ కూలీలు ఉపాధి నిమిత్తం వలస పోతుంటారు. ఈ పరిస్థితిని నివారించడానికి సుమారు రెండు దశాబ్దాల క్రితం అప్పటి యూపీఏ ప్రభుత్వం ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ను 2006 ఫిబ్రవరిలో ప్రారంభించింది. గ్రామాల్లో వ్యవసాయ కూలీల కుటుంబాలకు స్థానికంగా ఉన్న సాగునీటి చెరువులు, పంట కాలువల్లో పూడికతీత పనులు చేయించడం ద్వారా ఉపాధి కల్పించాలన్నది ఈ పథకం ప్రధాన ఉద్దేశం. మూడేళ్ల తరువాత ఈ పథకం పేరుకు ముందు జాతిపిత మహాత్మా గాంధీ పేరును చేర్చారు. ప్రతి కుటుంబంలో ఏడాదికి వంద రోజులపాటు పనులు కల్పించాలన్నది లక్ష్యం. ఇందుకు అయ్యే వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు పది శాతం భరిస్తున్నాయి. అయితే రెండు దశాబ్దాల తరువాత కేంద్ర ప్రభుత్వం ఈ పథకం పేరును మార్చడంతోపాటు పలు అంశాల్లో మార్పులు, చేర్పులు చేసింది. దీనికి ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, ఆజీవిక మిషన్ గ్రామీణ్ (వీబీ జీరామ్‌జీ)’ అని పేరు పెట్టింది. వాస్తవంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దీనిని అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తరువాత రెండుసార్లు వాయిదా వేసింది. చివరకు జూలై నుంచి అమలు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో ఈ పథకం అమలుకు డ్వామా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జాబ్‌కార్డు వున్న ప్రతి కుటుంబానికి ఏటా 125 రోజులపాటు పని కల్పిస్తారు. డ్వామా అధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలో 2,67,363 జాబ్ కార్డులకు సంబంధించి 4,15,869 మంది ఉపాధి కూలీలు వున్నారు. వీరికి ప్రతి 15 రోజులకు ఒకసారి వేతనాలు అందుతాయి. సాగునీటి వనరుల్లో పూడిక తీత, తుప్పలు తొలగింపు, కొండవాలు ప్రదేశాల్లో ట్రెంచ్‌ల తవ్వకం, గ్రామాల్లో పచ్చదనం పెంపుకోసం ఖాళీ స్థలాల్లో మొక్కల పెంపకం వంటి పనులు చేస్తారు. మెటీరియల్ కాంపోనెంట్ కింద సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపడతారు. అయితే ఇప్పటి వరకు ఉపాధి పనులకు అయ్యే వ్యయంలో కేంద్రం 90 శాతం, రాష్ట్రాలు 10 శాతం భరిస్తున్నాయి. కొత్త పథకంలో కేంద్రం వాటా 60 శాతంకాగా, మిగిలిన 40 శాతం నిధులను రాష్ట్రాలు భరించాల్సి వుంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా భారమనే చెప్పాలి.