Share News

భక్తిశ్రద్ధలతో వరుణ యాగం

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:18 AM

వర్షాలు విరివిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో స్థానిక శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, పద్మావతి దంపతులు వరుణ యాగం నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో వరుణ యాగం
శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో వరుణ యాగం చేస్తున్న స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, పద్మావతి దంపతులు

వర్షాలు విరివిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో నిర్వహణ

నర్సీపట్నం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): వర్షాలు విరివిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో స్థానిక శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, పద్మావతి దంపతులు వరుణ యాగం నిర్వహించారు. మంగళవారం ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో తాగునీటి కరువు రాకుండా భూగర్భ జలాలను పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వరుణ యాగం తలపెట్టిందని తెలిపారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యంగా పడడంతో రైతులు ఇబ్బంది పడ్డారన్నారు. 70 శాతం వరినాట్లు పూర్తి కాగా, మిగిలిన 30 శాతం ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. తీవ్ర వాయుగుండం కారణంగా కురిసిన భారీ వర్షాలతో కరువు గండం నుంచి బయటపడినప్పటికీ శాస్త్రవేత్తలు ఇచ్చిన సూచనల మేరకు భూగర్భ జలాలు పెంపొందించడం ఎంతో అవసరమని ఆయన అన్నారు. దశాబ్దాల నాటి కల అయిన పోలవరం గోదావరి జలాలు అనకాపల్లికి చేరుకోవడం శుభపరిణామమన్నారు. నర్సీపట్నం ప్రాంతంలో భూగర్భ జలాలు పెంపొందించేందుకు, తాగునీటి సమస్య పరిష్కారం కోసం భూగర్భ పైప్‌లైన్‌ ద్వారా రవాణాపల్లికి నీరు తరలించే పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ విభాగం అధ్యక్షుడు చింతకాయల రాజేశ్‌, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 12:18 AM