Share News

కరుణించిన వరుణుడు

ABN , Publish Date - Aug 04 , 2026 | 01:46 AM

జిల్లాలో సోమవారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీక్షణంగా కాసింది.

కరుణించిన వరుణుడు

పలు మండలాల్లో ఈదురు గాలులతో భారీ వర్షం

మిగిలినచోట్ల మోస్తరు వాన

ఈదురుగాలులతో విరిగిన చెట్ల కొమ్మలు

కొంతసేపు నిలిచిన విద్యుత్‌ సరఫరా

ఎం.అలమండలో పిడుగుపడి రైతు మృతి

అనకాపల్లి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి- న్యూస్‌ నెట్‌వర్క్‌):

జిల్లాలో సోమవారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీక్షణంగా కాసింది. మధ్యాహ్నం తరువాత ఆకాశం మేఘావృతమై కొన్ని మండలాల్లో భారీగా, మరికొన్ని మండలాల్లో మోస్తరుగా వర్షం కురిసింది. ఇదే సమయంలో ఈదురుగాలులు వీచడంతో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఈ వర్షం వరి నారుమడులకు, అపరాల పంటలకు దోహపడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఉపశమనం చెందారు. కాగా దేవరాపల్లి మండలం ఎం.అలమండలో పిడుగు పడడంతో రైతు మృతిచెందాడు.

అనకాపల్లి పట్టణంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి సుమారు అర్ధగంటపాటు చిరుజల్లులు పడ్డాయి. .బుచ్చెయ్యపేట మండలంలోని పలు గ్రామాల్లో మోస్తరు వర్షం పడింది. ఆకాశంలో దట్టంగా కమ్ముకున్న మేఘాలను చూసి భారీ వర్షం కురుస్తుందనుకున్న రైతులు నిరాశ చెందారు. చోడవరం మండలంలో మధ్యాహ్నం మూడు గంటల తరువాత. ఉరుములతో మోస్తరు వర్షం కురిసింది. రావికమతం మండలంలో మోస్తరు వర్షం కురిసింది.

పాయకరావుపేట పట్టణంతోపాటు మండల వ్యాప్తంగా సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో భారీ వర్షం పడింది. పట్టణంలో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. కరణంగారివీధిలో చెట్టు కూలి విద్యుత్‌ తీగలపై పడడంతో కరెంటు స్తంభం విరిగిపోయింది. అంతకు ముందే విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. సుమారు మూడు గంటల తరువాత విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. ఎస్‌.రాయవరం మండలంలోని పలు గ్రామాల్లో సాయంత్రం తరువాత సుమారు గంటపాటు భారీ వర్షం కురిసింది. వరిఆకుమడులు పోసిన రైతులు ఆనందం వ్యక్తం చేశారు. నక్కపల్లి మండలంలోని నక్కపల్లి, కాగిత, ఉపమాక, బోదిగల్లం, జానకయ్యపేట, సీహెచ్‌ఎల్‌పురం, పెదతీనార్ల, దొండవాక, రాజయ్యపేట, బోయపాడు తదితర గ్రామాల్లో సాయంత్రం గంటన్నరసేపు భారీ వర్షం కురిసింది. ఇదే సమయంలో గాలులు వీచడంతో రెండు గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కోటవురట్ల మండంలో సాయంత్రం తరువాత మోస్తరు వర్షం కురిసింది.

మాడుగుల మండలంలో కారుమబ్బులు కుమ్ముకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షం పడలేదు. ఉరుములు, పిడుగులు, ఈదురు గాలులతో మోస్తరు వర్షం కురిసింది. కె.కోటపాడు మండలంలోని పలు గ్రామాల్లో సుమారు గంటసేపు వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. దేవరాపల్లి మండలంలో మధ్యాహ్నం ఉరుములు, పిడుగులతో వర్షం పడింది. కూరగాయల పంటలకు, వరినారు మడులకు ఊపిరి పోసింది. కాగా మండలంలోని ఎం.అలమండలో పొలం పనులు చేస్తున్న సిరపారపు నాయుడు (50)కు సమీపంలో పిడుగు పడడంతో స్పృహ కోల్పోయాడు. స్థానిక రైతులు కె.కోటపాడు సీహెచ్‌సీకి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన ఆళ్ల సన్యాసినాయుడుకు గాయాలయ్యాయి. చీడికాడ మండలంలోని పలు గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది.

ఎలమంచిలి పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో సాయంత్రం ఉరుములతో వర్షం కురిసింది. పరవాడ మండలం లంకెలపాలెం, పరిసర ప్రాంతాల్లో సుమారు గంటపాటు భారీ వర్షం కురిసింది.

Updated Date - Aug 04 , 2026 | 01:46 AM