Share News

జడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా వంతాల శాంతి

ABN , Publish Date - Nov 13 , 2026 | 01:07 AM

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పెదబయలు జడ్పీటీసీ సభ్యురాలు వంతాల శాంతి పేరును వైసీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. అలాగే వైస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా పాడేరు జడ్పీటీసీ సభ్యుడు సీదరి రాంబాబు పేరుగా ఖరారు చేసినట్టు ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి.

జడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా వంతాల శాంతి
వంతాల శాంతి

- పెదబయలు జడ్పీటీసీ సభ్యురాలి పేరును ఖరారు చేసిన వైసీపీ అధిష్ఠానం

- అనూహ్య పరిణామాల నేపథ్యంలో తెరపైకి!

- వైస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా సీదరి రాంబాబు ఎంపిక

పాడేరు/పెదబయలు, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పెదబయలు జడ్పీటీసీ సభ్యురాలు వంతాల శాంతి పేరును వైసీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. అలాగే వైస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా పాడేరు జడ్పీటీసీ సభ్యుడు సీదరి రాంబాబు పేరుగా ఖరారు చేసినట్టు ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి.

జిల్లాలోని మొత్తం 11 జడ్పీటీసీ స్థానాలకు వైసీపీ 7, టీడీపీ 3, సీపీఎం 1 స్థానాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో అధిక స్థానాలు పొందిన వైసీపీకే జడ్పీ పీఠం దక్కుతుందనే ఆలోచనతో పలువురు జడ్పీటీసీ సభ్యులు తీవ్రంగా పైరవీలు చేశారు.

అనూహ్యంగా వంతాల శాంతి పేరు ఖరారు

జడ్పీ చైర్మన్‌ పదవిని దక్కించుకునేందుకు జిల్లాలో తీవ్రమైన పోటీ ఏర్పడింది. స్థానిక జడ్పీటీసీ సభ్యుడు సీదరి రాంబాబు, హుకుంపేట జడ్పీటీసీ సభ్యురాలు ఒంటూబు ప్రియాంక, చింతపల్లి జడ్పీటీసీ సభ్యురాలు కోరాబు అనుషా, అనంతగిరి జడ్పీటీసీ సభ్యురాలు దూరు జయవర్థిని ఎవరికి వాళ్లు తీవ్ర ప్రయత్నాలు సాగించారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వద్ద గురువారం జరిగిన సమావేశంలో జిల్లాలోని వైసీపీకి చెందిన జడ్పీటీసీ సభ్యులంతా ఏకతాటిపైకి వచ్చి చైర్మన్‌ అభ్యర్థిగా పాడేరు జడ్పీటీసీ సభ్యుడు సీదరి రాంబాబు పేరును ప్రతిపాదించి, మద్దతు తెలిపారు. అయితే అందరి అభిప్రాయాలను తెలుసుకున్న వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అనూహ్యంగా పెదబయలు జడ్పీటీసీ సభ్యురాలు వంతాల శాంతిని చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా, పాడేరు జడ్పీటీసీ సభ్యుడు సీదరి రాంబాబును వైస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా ఖరారు చేశారు. అప్పటి వరకు చైర్మన్‌ రేసులో లేని వంతాల శాంతి పేరు ఖరారు కావడంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే జడ్పీ చైర్మన్‌ పదవి కోసం గిరిజనుల్లో కొండదొర, వాల్మీకి, భగత తెగలకు చెందిన జడ్పీటీసీ సభ్యులు పోటీ పడుతున్న తరుణంలో పీవీటీజీ తెగకు చెందిన వంతాల శాంతిని చైర్‌పర్సన్‌గా ఎంపిక చేయడం విశేషం. కాగా గతంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జడ్పీ చైర్‌పర్సన్‌గా పని చేసిన జల్లిపల్లి సుభద్ర సైతం పీవీటీజీ తెగకు చెందిన నేత కావడం విశేషం.

Updated Date - Nov 13 , 2026 | 01:07 AM