వందేభారత్ దూకుడు
ABN , Publish Date - Apr 22 , 2026 | 01:07 AM
వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు రైల్వేకు అత్యధిక ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి.
గడచిన ఆర్థిక సంవత్సరంలో విశాఖ-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌కు అత్యధిక ఆదాయం
ఇటుఅటు కలిపి రూ.130.16 కోట్లు రాక
ఆక్యుపెన్సీ 128 శాతంగా నమోదు
తూర్పు కోస్తా జోన్‌లో గల వందేభారత్ రైళ్లలో ఈ రూటులోనే అధిక ఆదాయం
సికింద్రాబాద్ నుంచి నడుపుతున్న వందేభారత్‌కు రూ.120 కోట్లు ఆదాయం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు రైల్వేకు అత్యధిక ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. భువనేశ్వర్ కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు కోస్తా రైల్వే జోన్‌లో 13 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తుండగా...వాటిలో వాల్తేరు డివిజన్‌లో విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు నడుపుతున్న రైలే అన్నింటి కంటే అధికంగా సముపార్జించింది. గత ఏడాది అంటే 2025-26 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం ఇక్కడి నుంచి 20833 నంబరుతో నడిపిన విశాఖ-సికింద్రాబాద్ రైలు 124.51శాతం ఆక్యుపెన్సీతో నడిచింది. ఇదే రైలు అటు సికింద్రాబాద్ నుంచి విశాఖకు (20834) నంబరుతో నడపగా దాని ఆక్యుపెన్సీ 128 శాతంగా నమోదైంది. ఈ జోన్‌లో ఇదే అత్యధిక ఆక్యుపెన్సీ. ఇదే మార్గంలో దక్షిణ మధ్య రైల్వే (సికింద్రాబాద్) కూడా మరో వందేభారత్ రైలు నడుపుతోంది. సికింద్రాబాద్-విశాఖ (20707) రైలు ఆక్యుపెన్సీ 122.75 శాతం కాగా విశాఖ-సికింద్రాబాద్ (20708) ఆక్యుపెన్సీ 124.49గా నమోదైంది.
ఆ ఏడాదిలో ఒక్కొక్కటి 312 ట్రిప్పులు నడవగా విశాఖ కేంద్రంగా తిరిగిన వందేభారత్‌లో ఇటు నుంచి 5.59 లక్షల మంది, అటు నుంచి 5.75 లక్షల మంది కలిపి మొత్తం 11.34 లక్షల మంది ప్రయాణం చేశారు. వీరి ద్వారా రూ.130.16 కోట్ల ఆదాయం సమకూరింది. సికింద్రాబాద్ కేంద్రంగా విశాఖకు నడిపిన వందేభారత్ రైలులో అటు నుంచి 5.28 లక్షల మంది, ఇటు నుంచి 5.2 లక్షల మంది కలిసి 10.48 లక్షల మంది ప్రయాణం చేశారు. వీరి ద్వారా సుమారు రూ.120 కోట్ల ఆదాయం లభించింది. తూర్పు కోస్తా జోన్ కేంద్రంగా నడిపిన 13 రైళ్లలో దుర్గ్ నుంచి విశాఖకు నడిపిన వందేభారత్ రైలుకు అతి తక్కువ ఆక్యుపెన్సీ (57.97శాతం) నమోదైంది. తూర్పు కోస్తా జోన్‌లో గత ఆర్థిక సంవత్సరం వచ్చిన ఆదాయం రూ.29,251 కోట్లు కాగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా రూ.2,495.5 కోట్లు సమకూరిందని రైల్వే వర్గాలు ‘ఎక్స్’లో పేర్కొన్నాయి.
- విశాఖపట్నం-భువనేశ్వర్ మధ్య నడిపిన వందేభారత్ రైలు 88.57 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. దీని ద్వారా రూ.14 కోట్ల ఆదాయం వచ్చింది. భువనేశ్వర్ నుంచి విశాఖకు నడిపిన రైలు 67.23 శాతం ఆక్యుపెన్సీతో నడిచి రూ.10.22 కోట్ల ఆదాయం తెచ్చిపెట్టింది.