Share News

వందే భారత్‌ భవన్‌

ABN , Publish Date - Aug 27 , 2026 | 01:14 AM

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కోచ్‌ల నిర్వహణకు విశాఖపట్నంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకూ న్యూ కోచింగ్‌ కాంప్లెక్స్‌లోనే ఈ పనులు జరిగేవి.

వందే భారత్‌ భవన్‌
వందే భారత్‌ భవనాన్ని పరిశీలిస్తున్న డీఎఆర్‌ం లలిత్‌ బొహ్రా

వందే భారత్‌ రైళ్ల కోచ్‌ల

నిర్వహణకు విశాఖలో ప్రత్యేక ఏర్పాట్లు

400 మంది సిబ్బందితో పనులు

మర్రిపాలెంలో మరో భవనం నిర్మాణం

విశాఖపట్నం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి):

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కోచ్‌ల నిర్వహణకు విశాఖపట్నంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకూ న్యూ కోచింగ్‌ కాంప్లెక్స్‌లోనే ఈ పనులు జరిగేవి. వందే భారత్‌ రైళ్ల సంఖ్య సమీప భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ముందుగానే అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. న్యూకోచింగ్‌ కాంప్లెక్స్‌లో ప్రత్యేకంగా మరో అంతస్థు నిర్మించి, దానికి ‘వందే భారత్‌ భవన్‌’ అని నామకరణం చేశారు. దీనిని బుధవారం ప్రారంభించారు. ప్రస్తుతం విశాఖలో వందే భారత్‌కు సంబంధించి ఒక రేక్‌ నిర్వహణ పనులు జరుగుతున్నాయి. అధికారులు, ఇతర సిబ్బంది కలిసి సుమారు 400 మంది పనిచేస్తున్నారు. సాధారణ రైళ్లలా వందే భారత్‌కు ఇంజన్‌ ఉండదు. వెనుకా, ముందు రెండు వైపులా సెల్ఫ్‌ ప్రొపల్షన్‌ ఉంటుంది. విశాఖ వచ్చే రైళ్లను షంటింగ్‌ చేసి ఇంజన్‌ మార్చడం రివాజు. దీనికి ఆ అవసరం లేదు. వందే భారత్‌ కోచ్‌ల నిర్వహణ అంతా హై ఎండ్‌ టెక్నాలజీతో కూడుకున్నది కావడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇది కాకుండా మర్రిపాలెంలో ప్రత్యేకంగా వందే భారత్‌ రైళ్ల కోసం మరో కోచింగ్‌ కాంప్లెక్స్‌ నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఇది అందుబాటులోకి వచ్చేసరికి రెండేళ్ల సమయం పడుతుంది.

న్యూ కోచింగ్‌ కాంప్లెక్స్‌లో రోజుకు 13 ర్యాక్‌లకు నిర్వహణ

విశాఖపట్నం వచ్చే పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు న్యూ కోచింగ్‌ కాంప్లెక్స్‌లో నిర్వహణ పనులు చేపడుతున్నారు. ఎల్‌హెచ్‌బీ, ఐసీఎఫ్‌ కోచ్‌లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తిరుమల, జన్మభూమి, ఎల్‌టీటీ, సమతా ఎక్స్‌ప్రెస్‌, ఏపీ ఎక్స్‌ప్రెస్‌ వంటి 13 రైళ్లకు రోజూ ఇక్కడ నిర్వహణ పనులు జరుగుతున్నాయి. అండర్‌ గేర్‌ తనిఖీలు (భద్రతకు సంబంధించి బ్రేకులు, చక్రాలు), అప్పర్‌ గేర్‌ తనిఖీలు (ప్రయాణికుల సౌకర్యాలు) చేస్తారు. ఈ కోచింగ్‌ కాంప్లెక్స్‌ ఆధునికీకరణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.299 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నిధుల నుంచే అదనపు ప్లాట్‌ఫారాల నిర్మాణం కూడా చేపడతారు.

Updated Date - Aug 27 , 2026 | 01:14 AM