Share News

పాడేరు ఘాట్‌లో వ్యాన్‌ బోల్తా

ABN , Publish Date - Jul 20 , 2026 | 12:02 AM

పాడేరు ఘాట్‌ రోడ్డులోని ఇప్పమాను జంక్షన్‌ వద్ద ఆదివారం సాయంత్రం వ్యాన్‌ బోల్తా పడి ఇద్దరు మృతి చెందగా, 14 మందికి గాయాలయ్యాయని స్థానిక సీఐ ఎస్‌.రామారావు తెలిపారు.

పాడేరు ఘాట్‌లో వ్యాన్‌ బోల్తా
సంఘటన స్థలంలో చలపతిరావు మృతదేహం

ఇద్దరి మృతి

14 మందికి గాయాలు

పాడేరురూరల్‌/మాడుగుల రూరల్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): పాడేరు ఘాట్‌ రోడ్డులోని ఇప్పమాను జంక్షన్‌ వద్ద ఆదివారం సాయంత్రం వ్యాన్‌ బోల్తా పడి ఇద్దరు మృతి చెందగా, 14 మందికి గాయాలయ్యాయని స్థానిక సీఐ ఎస్‌.రామారావు తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.

రోలుగుంట మండలం గుర్రాలపాలెం గ్రామానికి చెందిన కొంత మంది, బుచ్చెయ్యపేట గ్రామానికి చెందిన ఇద్దరు కలిసి రెండు వ్యాన్లలో ఆదివారం ఉదయం పాడేరు మోదకొండమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఆయా వాహనాల్లో తిరిగి ఇళ్లకు బయల్దేరారు. ఈ క్రమంలో ఘాట్‌ మార్గంలో సాయంత్రం 5.30 గంటల సమయంలో వంట్లమామిడి- గరికబంద మధ్య ఇప్పమాను జంక్షన్‌ వద్ద ఒక వ్యాన్‌ అదుపు తప్పి బోల్తా పడింది. ఆ వ్యాన్‌లో ఉన్న రోలుగుంట మండలం గుర్రాలపాలెం గ్రామానికి చెందిన బీవీ చలపతిరావు(50) సంఘటనా స్థలంలో మృతి చెందగా, 14 మందికి గాయాలయ్యాయి. చలపతిరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాడేరు ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. క్షతగాత్రులను వెనుక వస్తున్న మరో వ్యాన్‌లో మాడుగుల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుచ్చెయ్యపేట గ్రామానికి చెందిన సూరిశెట్టి అప్పారావు (58) మృతి చెందారు. బుచ్చెయ్యపేటకు చెందిన జయంత్‌ తలభాగంలో గాయమైంది. మిగిలిన వారిలో గుర్రాలపాలేనికి చెందిన కొండలరావు, రాజారావు, బాలయోగి, లోవరాజు, దుర్గాప్రసాద్‌, భానుప్రసాద్‌, నూకరాజు, రావులమ్మ, అప్పలనరస, రాజు, రమణమ్మ, ఎం.రమణమ్మ, జి.అప్పారావులకు గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రి అంబులెన్స్‌తో పాటు మరో రెండు ప్రైవేటు అంబులెన్సుల్లో అనకాపల్లి ఎన్‌టీఆర్‌ ఆస్పత్రికి, మరి కొంతమందిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. క్షతగ్రాతులకు ప్రస్తుతానికి ప్రాణాపాయ పరిస్థితి లేదని మాడుగుల ప్రభుత్వాస్పత్రి వైద్యులు రాజ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Jul 20 , 2026 | 12:02 AM