ఆగి ఉన్న లారీని ఢీకొన్న వ్యాన్
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:59 PM
అనకాపల్లి పూడిమడక వెళ్లే రహదారిలోని ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని వ్యాన్ ఢీకొనడంతో ఒక బాలిక మృతి చెందింది. ఈ ప్రమాదం శనివారం తెల్లవారుజామున 3.45 గంటలకు జరిగింది.
బాలిక మృతి
అనకాపల్లి జాతీయ రహదారిపై ఘటన
అనకాపల్లిటౌన్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి పూడిమడక వెళ్లే రహదారిలోని ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని వ్యాన్ ఢీకొనడంతో ఒక బాలిక మృతి చెందింది. ఈ ప్రమాదం శనివారం తెల్లవారుజామున 3.45 గంటలకు జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి ట్రాఫిక్ ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలివి. తూర్పు గోదావరి జిల్లా అనపర్తికి చెందిన రుద్ర ధనుష్ వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తన అత్తవారి ఊరైన బొబ్బిలికి శుక్రవారం రాత్రి 9 గంటలకు భార్య గీత, కుమార్తెలు నాగ తనూజ, చైతన్యలతో వ్యాన్‌లో బయలుదేరారు. మార్గమధ్యంలో అందజేసేందుకు అరటిగెలల లోడ్‌తో బయలుదేరారు. శనివారం వేకువజామున అనకాపల్లి పూడిమడక వెళ్లే రహదారి వద్ద ఉన్న ఫ్లైఓవర్‌పైకి వచ్చేసరికి ఆగి ఉన్న లారీని వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్ క్యాబిన్‌లో ఉన్న పెద్ద కుమార్తె నాగ తనూజ(9) అక్కడికక్కడే మృతి చెందగా, ధనుష్‌తో పాటు అతని భార్య గీత, మరో కుమార్తె చైతన్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తనూజ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.