షార్ట్ సర్క్యూట్‌తో వ్యాన్ దగ్ధం
ABN , Publish Date - Jul 06 , 2026 | 01:03 AM
ఐషర్ వ్యాన్ క్యాబిన్‌లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై వెంటనే వాహనాన్ని ఆపి, కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
కశింకోట, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ఐషర్ వ్యాన్ క్యాబిన్‌లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై వెంటనే వాహనాన్ని ఆపి, కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి. విజయవాడ నుంచి విజయనగరంలోని స్మార్ట్ బజార్‌కు సరుకులు తీసుకెళ్లిన ఐషర్ వ్యాన్.. అక్కడ అన్‌లోడ్ చేసి తిరిగి వెళుతున్నది. కశింకోట కనకదుర్గమ్మ ఆలయ సమీపానికి వచ్చేసరికి వ్యాన్ క్యాబిన్‌లో కాలుతున్న వాసన రావడంతో డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని రోడ్డు పక్కన ఆపివేశాడు. అతను కిందకు దిగి పరిశీలిస్తుండగా క్షణాల్లో క్యాబిన్‌లో నుంచి దట్టమైన పొగ, ఆ వెంటనే మంటలు ఎగసిపడ్డాయి. స్థానికుల సహాయంతో బకెట్లతో నీళ్లు చల్లి మంటలను ఆర్పడానికి విఫలయత్నం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. వ్యాన్ చాలా వరకు కాలిపోవడంతో సుమారు రూ.6 లక్షల నష్టం వాటిల్లిందని డ్రైవర్ చెబుతున్నారు.