విలువలు, సంస్కారం ఎంతో ప్రధానం
ABN , Publish Date - Apr 24 , 2026 | 01:01 AM
విద్యతో పాటు జీవితంలో విలువలు, సంస్కారం ఎంతో ప్రధానమని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.
మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
నా ఎదుగుదలకు ఏయూలోనే తొలి అడుగు
యువ న్యాయవాదులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
సిరిపురం, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి):
విద్యతో పాటు జీవితంలో విలువలు, సంస్కారం ఎంతో ప్రధానమని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం న్యాయ కళాశాల ఆధ్వర్యంలో బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సాంకేతికత అభివృద్ధి చెందినా, మానవీయ స్పర్శ మరువరాదన్నారు. పేదల పక్షాన నిలిచే ప్రయత్నం యువ న్యాయవాదులు చేయాలన్నారు. సైబర్ నేరాలు, మహిళలపై దాడులు పెరుగుతున్నాయని, వాటిని నిరోధించాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు బాసటగా నిలవాలన్నారు. యువ న్యాయవాదులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, అంతర్జాతీయ న్యాయ పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలన చేసి, వాటిపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఏయూ న్యాయ కళాశాల తన జీవిత గమ్యాన్ని మార్చిందన్నారు. తన ఎదుగుదలకు మొదటి మెట్టు న్యాయ కళాశాలలోనే పడిందన్నారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏయూ న్యాయ కళాశాల ఆధ్వర్యంలో ముద్రించిన ప్రత్యేక సంచికను ఈ సందర్భంగా అతిథులతో కలిసి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసఫ్, ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య రాజశేఖర్, ఐఐయూఎల్‌ఇఆర్ (గోవా) వైస్ ఛాన్సలర్ ఆచార్య ఆర్.వెంకటరావు, న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.సీతామాణిక్యం, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్సిటీ తరపున మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఘనంగా సత్కరించి, జ్ఞాపిక అందజేశారు.