Share News

అంధకారంలో వలసపల్లి

ABN , Publish Date - Jul 16 , 2026 | 12:06 AM

జీకే వీధి మండలం దుప్పులవాడ పంచాయతీలో పోలవరం జిల్లా సరిహద్దులో ఉన్న వలసపల్లి గ్రామానికి ఐదు రోజులుగా విద్యుత్‌ సరఫరా లేక గిరిజనులు అంధకారంలో అలమటిస్తున్నారు.

అంధకారంలో వలసపల్లి
విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన వలసపల్లి గ్రామం

ఐదు రోజులుగా విద్యుత్‌ సరఫరా లేక గ్రామస్థుల ఇబ్బందులు

ఫిర్యాదు చేసినా పట్టించుకోని సిబ్బంది

సీలేరు, జూలై 15 (ఆంధ్రజ్యోతి): జీకే వీధి మండలం దుప్పులవాడ పంచాయతీలో పోలవరం జిల్లా సరిహద్దులో ఉన్న వలసపల్లి గ్రామానికి ఐదు రోజులుగా విద్యుత్‌ సరఫరా లేక గిరిజనులు అంధకారంలో అలమటిస్తున్నారు. వలసపల్లి గ్రామానికి దుప్పులవాడ సబ్‌స్టేషన్‌ నుంచి బంధవీధి, కొమ్ములవాడ, గొర్లోవ, చింతగొప్పు, పులిగొప్పు గ్రామాల మీదుగా దట్టమైన అటవీ ప్రాంతం నుంచి విద్యుత్‌ లైన్‌ ఉండడంతో ఈ మార్గంలో చిన్నపాటి గాలి వీచినా చెట్ల కొమ్మలు విద్యుత్‌ తీగలపై పడి రోజుల తరబడి వలసపల్లి గ్రామానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుంది. ఇదే క్రమంలో ఐదు రోజుల క్రితం విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినా ఇప్పటికీ సిబ్బంది పునరుద్ధరించలేదు. లైన్‌మన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తరచూ ఇబ్బందులు

విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినప్పుడల్లా విద్యుత్‌ తీగలపై ఎక్కడ చెట్లకొమ్మలు పడి అంతరాయం ఏర్పడిందో?, ఎక్కడ తీగలు తెగిపడ్డాయో చూసి సబ్‌స్టేషన్‌ సిబ్బందికి వెళ్లి చెబితే వారు ఎప్పుడో ఖాళీ చూసుకుని విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిస్తుంటారని గ్రామస్థులు వాపోతున్నారు. అటవీ ప్రాంతంలో తమ గ్రామం ఉండడంతో విద్యుత్‌ సరఫరా లేకపోతే రాత్రి వేళల్లో విష కీటకాలు ఇళ్లల్లోకి ప్రవేశిస్తాయని వారు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమలాంటి మారుమూల గ్రామాల ప్రజలకు కనీసం కిరోసిన్‌ అయినా సరఫరా చేస్తే విద్యుత్‌ సరఫరా లేని సమయాల్లో కిరోసిన్‌ దీపాలు వెలిగించుకుంటామని వారు తెలిపారు. తమ గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న వలసగెడ్డకొత్తూరు నుంచి విద్యుత్‌ సరఫరా చేస్తే తమకు ఇబ్బందులు తొలగుతాయని, విద్యుత్‌ శాఖ అధికారులు అక్కడ నుంచి సరఫరా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Updated Date - Jul 16 , 2026 | 12:06 AM