Share News

పక్కా కన్నింగ్‌... ప్లానింగ్‌!

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:45 AM

నేవీ వైమానిక స్థావరం ఐఎన్‌ఎస్‌ డేగాలో పనిచేస్తున్న రవీంద్ర మామూలోడు కాదని తెలుస్తోంది.

పక్కా కన్నింగ్‌... ప్లానింగ్‌!

రవీంద్ర మామూలోడుకాదు

మరి కొంతమంది మహిళలతో సంబంధాలు

మౌనిక హత్య కేసులో వీడని చిక్కుముడులు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి):

నేవీ వైమానిక స్థావరం ఐఎన్‌ఎస్‌ డేగాలో పనిచేస్తున్న రవీంద్ర మామూలోడు కాదని తెలుస్తోంది. తాటిచెట్లపాలేనికి చెందిన యువతి మౌనికను గాజువాకలో ఇంటికి తీసుకెళ్లి అత్యంతక్రూరంగా హత్య చేసిన రవీంద్ర పక్కా ప్లానింగ్‌తోనే వ్యవహరించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. నేవీ తనకు ఇచ్చిన ఐడీ కార్డును తీసుకుని, డబ్యు కోసం వేధిస్తున్నందునే ఆమెను చంపేశానని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన నిందితుడి మాటలను పోలీసులతో పాటు అంతా నమ్మేశారు. రిమాండుకు పంపిన తరువాత ఆధారాల కోసం ప్రయత్నించినపుడు ఆమెను రవీంద్ర తన ఫ్లాట్‌కు తీసుకెళ్లలేదని తేలింది.

ఈ నేపథ్యంలో పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించడంతో అనేక విషయాలు బయటపెట్టాడు. సీన్‌ రీకనస్ట్రక్షన్‌లో... తన స్నేహితుడి ఇంట్లో మౌనికను చంపిన తరువాత మృతదేహాన్ని సూట్‌కేస్‌లో తన ఫ్లాట్‌కు తీసుకెళ్లానని పేర్కొన్నాడు. ఆతరువాత మరిన్ని విషయాలు పోలీసులు గుర్తించారు. నిందితుడి మొబైల్‌ఫోన్‌, మృతురాలి ఫోన్‌ డేటాను రికవరీచేసి, అందులో అంశాలను విశ్లేషించారు.

చాలా సంబంధాలు

రవీంద్ర డేటింగ్‌ యాప్‌ మింగిల్‌ ద్వారా ఒక్క మౌనికతోనే కాకుండా మరింతమందితో సంబంధాలు పెట్టుకొని వ్యవహారాలు నడపుతున్నట్టు తేలింది. దాంతో అతడు కన్నింగ్‌ అని, అమ్మాయిలకు వల వేయడం, వాడుకోవడం హాబీగా పెట్టుకున్నాడని తేలింది. పోలీసులు ఆయా యువతులను విచారించారు. వారితో రవీంద్ర ఎలా మెలిగేవాడో తెలుసుకున్నారు. ఆ తరువాత నిందితుడిని మళ్లీ జైలుకు పంపించేశారు.

పోలీసులు రవీంద్ర మాటల ఆధారంగానే విచారణ చేస్తున్నారని మౌనిక కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిందితుడికి తెరవెనుక రాజకీయ సహకారం అందుతున్నదనే ఆరోపణలున్నాయి. పోలీసులు మాత్రం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, వాస్తవాలు కోర్టుకు నివేదిస్తామంటున్నారు. దర్యాప్తు అంశాలన్నీ బయటకు చెప్పలేని పరిస్థితులున్నాయన్నారు.

బయటపడాల్సిన అంశాలివి

మౌనిక కుటుంబసభ్యులు తమ అమ్మాయి మంచిదని, క్రూరంగా చంపాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దానికి రవీంద్ర ఏమి చెప్పాడో ప్రపంచానికి వెల్లడించాల్సి ఉంది.

- నిజంగానే మౌనిక డబ్బుల కోసం రవీంద్రను వేధించిందా? గతంలో ఆమెకు ఏమైనా డబ్బులిచ్చాడా? ఎంత ఇచ్చాడు? ఎన్నాళ్ల నుంచి ఇస్తున్నాడు? అనేది తెలియాల్సి ఉంది.

- నేవీ ఐడీ కార్డు మౌనిక తీసుకుందని, హత్య చేయడానికి అది కూడా ఒక కారణమని నిందితుడు పేర్కొన్నాడు. ఈ హత్య తరువాత ఆ ఐడీ కార్డు రవీంద్రకు దొరికిందా? లేదా? అది ఎవరి దగ్గర ఉంది? నిజంగా మౌనిక ఆ కార్డు తీసుకుందా? అనే అంశాలు బయట పడాల్సి ఉంది.

- రవీంద్ర ఫ్లాట్‌ ఖాళీగా ఉండగా మౌనికను స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి అక్కడ ఎందుకు హత్య చేశాడు? దీనికి కారణమేమిటి? అనే దానిపై అనుమానాలున్నాయి.

- స్నేహితులు చెప్పిన తరువాతే రవీంద్ర పోలీసులకు లొంగిపోయాడని ప్రచారం జరిగింది. అందులో వాస్తవం ఎంత? మౌనికను చంపిన తరువాతి పరిణామాలను ఎదుర్కొనడానికి రవీంద్ర ప్లానింగ్‌ ఏమిటి? ఎందుకు లొంగిపోయాడో వివరించాల్సి ఉంది.

Updated Date - Apr 12 , 2026 | 12:45 AM