Share News

అలరించిన ఉత్సవ్‌

ABN , Publish Date - Feb 01 , 2026 | 01:45 AM

Utsav was entertaining.

అలరించిన ఉత్సవ్‌

  • చివరిరోజు ఆకట్టుకున్న కార్యక్రమాలు

  • ఉర్రూతలూగించిన సంగీత దర్శకుడు

  • ఆర్పీ పట్నాయక్‌ బృందం

  • వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి

  • ముగింపు వేడుకల్లో బహుమతులు ప్రదానం

విశాఖపట్నం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి):

విశాఖ ఉత్సవ్‌లో చివరిరోజు శనివారం సాయంత్రం ఆర్కే బీచ్‌లో ఏర్పాటుచేసిన ప్రధాన వేదికపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు నగరవాసులను ఎంతగానో అలరించాయి. ముగింపు వేడుకలను తిలకించేందుకు నగరవాసులే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భారీసంఖ్యలో సందర్శకులు తరలిరావడంతో సాగరతీరం కిక్కిరిసింది. వేలాది మంది ఆర్కే బీచ్‌లో ఇసుక తిన్నెలపై కూర్చుని సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఫుడ్‌ కోర్టులు, గేమింగ్‌ జోన్ల వద్ద సందర్శకులు బారులు తీరి కనిపించారు.

ప్రధాన వేదికపై ఆరు గంటలకు ప్రారంభమైన సాంసృతిక కార్యక్రమాలు 10.30 గంటల వరకూ కొనసాగాయి. ప్రముఖ కూచిపూడి నృత్యకళాకారిణి బాలకొండలరావు బృందం (బాలక్క) ప్రదర్శించిన ప్రత్యేక కూచిపూడి, ఇతర నృత్య గీతికలు ప్రేక్షకులను అలరించాయి. ఆ తరువాత స్థానిక కళాకారులు సూరజ్‌ హాట్‌ స్టెప్‌ బృందం ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌, రాష్ట్ర సమాచార కమిషనర్‌ పీఎస్‌ నాయుడు, కొప్పుల వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ పీవీజీ కుమార్‌లు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. విశాఖ ఉత్సవ్‌ను విజయంతంగా నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించిన అధికారులకు కలెక్టర్‌ అవార్డులను ప్రదానం చేశారు.

అనంతరం సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ సంగీత కచేరీ ప్రారంభమైంది. సుమారు రెండు గంటలపాటు ఆర్పీ పట్నాయక్‌ బృందం క్లాస్‌, మాస్‌, మెలోడీ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఆర్పీతోపాటు బృందంలోని సింగర్స్‌ పడిన మాస్‌, క్లాస్‌ బీట్‌లకు సాగర తీరం హోరెత్తింది. ఆర్పీ పట్నాయక్‌ ‘నీ స్నేహం...ఇక రాను అని’ అనే పాటతో ప్రారంభించారు. ఆ తరువాత తన బృందంలోని మాళివికతో కలిసి ఆర్పీ పాడిన ‘నీకు నేను..నాకు నువ్వు...ఒకరికొరరం నువ్వూ, నేను’ పాట పాడారు ఆర్పీ బృందంలోని అరుణ్‌తోపాటు ఇతర సభ్యులు ఆలపించిన పాటలు అలరించాయి. ఆర్పీ బృందం పాడడంతోపాటు సందర్శకులతోనూ ఆడి, పాడించి చివరి రోజు వేడుకలను మరోస్థాయికి తీసుకువెళ్లింది. గ్యాలరీల్లో కూర్చున్న పలువురు లేచి డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్‌ చేశారు.


పుష్ప ప్రదర్శనకు పోటెత్తిన సందర్శకులు

నేడు కూడా కొనసాగింపు

విశాఖపట్నం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి):

విశాఖ ఉత్సవ్‌లో భాగంగా సిటీ సెంట్రల్‌ పార్కులో ఏర్పాటుచేసిన పుష్ప ప్రదర్శనకు సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే పిల్లలతో కలిసి చూడడానికి వస్తున్నారు. యువతీ యువకులు వివిధ రకాల ఆకృతుల వద్ద ఫొటోలు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. పార్కు మొత్తం సందర్శకులతో కిటకిటలాడుతోంది. సాధారణ సమయంలో ఈ పార్కులోకి వెళ్లాలంటే రూ.20 ప్రవేశ రుసుము చెల్లించాలి. ఇప్పుడు ఉచితంగా అనుమతిస్తున్నారు. శనివారంతో దీనిని ముగించాల్సి ఉంది. అయితే లభిస్తున్న ప్రజాదరణ చూసి సెలవు రోజైన ఆదివారం కూడా కొనసాగించాలని నిర్ణయించామని వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ తెలిపారు. ఆదివారం రాత్రి 8 గంటల వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది.

Updated Date - Feb 01 , 2026 | 01:46 AM