ఉత్సవ్‌కు కొరవడిన ప్రచారం
ABN , Publish Date - Jan 22 , 2026 | 01:16 AM
విశాఖ ఉత్సవ్‌కు ప్రచారం కొరవడింది. చాలా కాలంగా ఆగిపోయిన విశాఖ ఉత్సవ్‌ను మళ్లీ నిర్వహిస్తున్నందుకు నగర ప్రజలు సంతోషపడుతున్నా వాటికి సంబంధించిన సమాచారం అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఇంకో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలకు ఇప్పటివరకూ కనీసం కరపత్రాలు కూడా ముద్రించలేదు.
కనీసం కరపత్రాలు కూడా ముద్రించని వైనం
ఏ సమాచారం అడిగినా వెబ్‌సైట్ చూసుకోవాలని సమాధానం
ఆదరాబాదరాగా ఏర్పాట్లు
ఇప్పటివరకూ ఫ్లవర్ షోపై
పెదవి విప్పని అధికారులు
జిల్లాలో ఎనిమిది వేదికలు
ఆర్కే బీచ్‌లో ప్రతి రోజూ డ్రోన్ షో, సంగీత విభావరి
రుషికొండలో స్కూబా డైవింగ్, హెలికాప్టర్ రైడ్లు
భీమిలిలో హాట్ ఎయిర్ బెలూన్లు
విశాఖపట్నం, జనవరి 21 (ఆంధ్రజ్యోతి):
విశాఖ ఉత్సవ్‌కు ప్రచారం కొరవడింది. చాలా కాలంగా ఆగిపోయిన విశాఖ ఉత్సవ్‌ను మళ్లీ నిర్వహిస్తున్నందుకు నగర ప్రజలు సంతోషపడుతున్నా వాటికి సంబంధించిన సమాచారం అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఇంకో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలకు ఇప్పటివరకూ కనీసం కరపత్రాలు కూడా ముద్రించలేదు.
విశాఖ ప్రజలను ఆహ్వానించకపోయినా సాయంత్రం కాగానే బీచ్‌లకు వెళతారు. కానీ ఉత్సవ్ ఉద్దేశం అది కాదు. ఇతర ప్రాంతాలకు చెందిన పర్యాటకులను రప్పించాలి. దీనికోసం ముందుగా ఆయా రాష్ట్రాల్లో ప్రచారం చేయాల్సి ఉంది. కానీ అలాంటిదేమీ చేయలేదు. ప్రభుత్వం చాలాకాలంగా విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తామని చెబుతున్నా అవసరమైన నిధులు అందుబాటులో లేకపోవడంతో ముందుకు వెళ్లలేకపోయినట్టు ప్రచారం జరుగుతోంది. ఆకస్మికంగా ఉత్సవాల తేదీలు ఖరారు చేసి, నిర్వహించాలని చెప్పడం, అవి కూడా భారీగా ఉండాలని, మూడు జిల్లాలకు కలిపి నిర్వహించాలని సూచించడంతో పర్యాటక శాఖ అధికారులు పరుగులు తీస్తున్నారు.
పోటీలు అంటున్నారు..ఎలా తెలుస్తుంది?
విశాఖ ఉత్సవ్ సందర్భంగా మిస్ వైజాగ్, మిస్టర్ వైజాగ్, విశాఖ ఐడల్ వంటి అనేక పోటీలు నిర్వహిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కానీ వాటికి ఎవరిని సంప్రతించాలనేది చెప్పలేదు. అన్ని వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయని ప్రకటించారు. నగరంలో ఎక్కడా ఇంతవరకూ ఒక్క హోర్డింగ్ కూడా పెట్టలేదు. ఈ ఉత్సవ్‌లో ఫ్లవర్ షో ఉంటుందని అధికారులు ముందుగా పేర్కొన్నారు. అది ఎక్కడ?...అనేది వెబ్‌సైట్‌లో లేదు.
- అనకాపల్లి జిల్లాలో 29, 30 తేదీల్లో ఉత్సవ్ ఉంటుంది. ఏడు వేదికలు ఏర్పాటుచేస్తారు. అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో ఫుడ్ కోర్టులు, ఎన్‌టీఆర్ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు, బొజ్జన్నకొండ, ఉపమాకలో శ్రీనివాస కల్యాణం, జానపద నృత్యాలు, అనకాపల్లి నూకాంబికా ఆలయంలో చండీ హోమం, కొండకర్ల ఆవలో బోట్ల పోటీ, ముత్యాలమ్మపాలెం, రేవుపోలవరం బీచ్‌లో పారామోటర్ రైడ్లు ఉంటాయి.
- అరకులోయలో జనవరి 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో పది వేదికలపై ఉత్సవాలు నిర్వహిస్తారు. లోతేరులో ఎఓ సైక్లింగ్, అనంతగిరి, గాలికొండల్లో ట్రెక్కింగ్, పద్మాపురం గార్డెన్స్, గిరిజన మ్యూజియం, అరకు డిగ్రీ కాలేజీల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, మాడగడ వ్యూ పాయింట్ వద్ద హాట్‌ఎయిర్ బెలూన్ల ప్రదర్శన ఏర్పాటుచేస్తారు.
ఇవీ కార్యక్రమాలు
విశాఖ ఉత్సవ్‌కు సంబంధించిన కార్యక్రమాలు ఏమీ అధికారులు వెల్లడించలేదు. వెబ్‌సైట్‌లో ఉన్నాయని చెబుతున్నారు. అవి కూడా ఇంకా ఖరారు కావలసి ఉందని అంటున్నారు. ఆ వెబ్‌సైట్ ప్రకారం...విశాఖ ఉత్సవ్‌ను ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహిస్తారు. జిల్లాలో ఎనిమిది వేదికలు ఏర్పాటుచేశారు. రామకృష్ణా బీచ్, ఎంజీఎం మైదానం, రుషికొండ బీచ్, సాగర్‌నగర్ బీచ్, భీమిలి బీచ్, ప్రేమసమాజం మైదానం, సన్ ఇంటర్నేషనల్ కాలేజీ, ఏయూ కాలేజీ మైదానం (ఏ కాలేజీ అనేది లేదు)...అని పేర్కొన్నారు. వీటిలో కొన్నిచోట్ల 29వ తేదీ వరకు, మిగిలిన వాటిల్లో ఫిబ్రవరి 1 వరకు కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. సన్ కాలేజీలో ఒకరోజే వంటల పోటీ నిర్వహిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం ఆరు నుంచి పది గంటల వరకు కార్యక్రమాలు ఉంటాయి. మిస్ విశాఖ, మిస్టర్ విశాఖ, విశాఖ ఐడల్, స్పోర్ట్స్ పోటీలు ఉంటాయి. ప్రతిరోజు ఆర్‌కే బీచ్‌లో డ్రోన్ షో, సంగీత విభావరి ఉంటాయి. ఏ రోజు ఏ సింగర్ వస్తారో ఇంకా ఖరారు కాలేదు. రామ్ మిరియాల, గీతామాధురి, సునీతల పేర్లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నుంచి జావెద్ అలీ, మోనాలీ ఠాకూర్, శ్వేతా మోహన్, అభిజిత్ నాయర్ వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రుషికొండ బీచ్‌లో స్కూబా డైవింగ్, హెలికాప్టర్ రైడ్లు, పారామోటారింగ్ ఉంటాయి.
భీమిలిలో ఈసారి హాట్ ఎయిర్ బెలూన్లు ఎగురవేస్తారు. ఇది గతంలో అరకులో నిర్వహించారు. బోట్ల పోటీలు నిర్వహిస్తారు. ఏయూ కాలేజీలో రోజంతా రంగోలి పోటీలు ఉంటాయి.