ఉత్సవ్ జోష్
ABN , Publish Date - Feb 01 , 2026 | 01:15 AM
అనకాపల్లి ఉత్సవ్ శనివారం ఘనంగా ముగిసింది. రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఉత్సవ్‌కు జనం పోటెత్తారు. అనకాపల్లి పట్టణంలోని బెల్లం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండో రోజు కూడా పుష్ప ప్రదర్శనను వీక్షించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో శనివారంతో అనకాపల్లి ఉత్సవ్ ముగిసినప్పటికీ ఆదివారం కూడా పుష్పప్రదర్శన కొనసాగించాలని నిర్వాహకులు నిర్ణయించారు.
- ఘనంగా ముగిసిన అనకాపల్లి ఉత్సవాలు
- ఆకట్టుకున్న పుష్ప ప్రదర్శన
- నేడూ కొనసాగింపు
- వినోదం పంచిన సాంస్కృతిక కార్యక్రమాలు
- ఎన్టీఆర్ స్టేడియంలో గీతాలతో ఉర్రూతలూగించిన రామ్ మిరియాల
అనకాపల్లి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి ఉత్సవ్ శనివారం ఘనంగా ముగిసింది. రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఉత్సవ్‌కు జనం పోటెత్తారు. అనకాపల్లి పట్టణంలోని బెల్లం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండో రోజు కూడా పుష్ప ప్రదర్శనను వీక్షించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో శనివారంతో అనకాపల్లి ఉత్సవ్ ముగిసినప్పటికీ ఆదివారం కూడా పుష్పప్రదర్శన కొనసాగించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఎన్టీఆర్ స్టేడియంలో ప్రముఖ సినీ గాయకుడు రామ్ మిరియాల ఆలపించిన గేయాలు యువతను ఉర్రూతలూగించింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్‌కుమార్, కలెక్టర్ విజయకృష్ణన్ హాజరయ్యారు. కొండకర్ల ఆవలో రెండో రోజు కూడా ఉత్సవ శోభ సంతరించుకుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఆవలో ఏర్పాటు చేసిన బోటు షికారులో విహరించి కొండకర్ల ఆవ సరస్సు ప్రకృతి అందాలను వీక్షించారు. ఏటికొప్పాక బొమ్మల ప్రదర్శనను పలువురు తిలకించారు. ముత్యాలమ్మ తీరంలో బీచ్ ఫెస్టివల్ ఘనంగా ముగిసింది. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఉల్లాసభరితంగా సంగీత విభావరి
తుమ్మపాల/కొత్తూరు: అనకాపల్లి ఉత్సవ్‌లో భాగంగా శనివారం రాత్రి స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన సంగీత విభావరి ఆద్యంతం ఉల్లాసభరితంగా సాగింది. ముందుగా నాట్యకళ విద్యార్థినులు పలు భక్తి గీతాలకు భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు చేసి ప్రేక్షకులను అలరించారు. ప్రధానంగా పలు దేవతామూర్తుల అవతారాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భక్తిగీతాలకు నృత్యాలు చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న ప్రేక్షకులంతా కొద్దిసేపు భక్తి పారవశ్యంలో మునిగి తేలి ఆడారు. దేశ భక్తి గీతాలకు నృత్యాలు ప్రదర్శిస్తున్న సమయంలో స్టేడియంలో ఉన్న వారంతా లేచి నిలబడి జాతీయ పతాకానికి గౌరవ వందనం చేశారు. అనంతరం వేదిక మీద ప్రముఖ సినీ గాయకుడు రామ్ మిరియాల ప్రత్యక్షం కావడంతో స్టేడియంలో ఉన్న వారంతా ఈలలు, చప్పట్లతో హోరెత్తించారు. రామ్ మిరియాల పలు సినీ గీతాలను ఆలపించి అందరినీ అలరించారు. ఒక దశలో రామ్ మిరియాల ఆలపిస్తున్న గీతాలకు యువత డ్యాన్స్‌లు చేస్తూ ఆనంద డోలికలో మునిగి తేలి ఆడారు. ప్రముఖ సినీ హీరో పవన్‌కల్యాణ్ నటించిన సినీ గీతాలను ఆలపిస్తున్న వేళ స్టేడియంలో ఉన్న పెద్దలు, పిల్లలు, యువకులు అంతా డ్యాన్స్‌లు చేశారు. స్టేడియం ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తును నిర్వహించారు. అనకాపల్లి ఉత్సవ్‌లో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పలు ఫుడ్‌స్టాల్స్ కిటకిటలాడాయి. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు తినుబండారాలను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, రాష్ట్ర అర్బన్ అండ్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, వివిధ కార్పొరేషన్లు చైర్మన్లు మళ్ల సురేంద్ర, కోట్ని బాలాజీ, కలెక్టర్ విజయకృష్ణన్, తదితరులు పాల్గొన్నారు.