బలిమెల నుంచి ఆరు వేల క్యూసెక్కుల వినియోగం
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:21 AM
గోదావరి డెల్టా ఖరీఫ్ పంటలకు అదనపు నీటి విడుదల కోసం బలిమెల జలాశయం నుంచి ఆంధ్రా వాటాగా ఆరు వేల క్యూసెక్కుల నీటిని తీసుకుంటున్నామని ఏపీ జెన్‌కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.అప్పలనాయుడు తెలిపారు.
గోదావరి డెల్టా ఖరీఫ్ పంటలకు అదనపు నీటి విడుదల కోసం తీసుకుంటున్నాం
ఏపీ జెన్‌కో ఈఈ టి.అప్పలనాయుడు
సీలేరు, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): గోదావరి డెల్టా ఖరీఫ్ పంటలకు అదనపు నీటి విడుదల కోసం బలిమెల జలాశయం నుంచి ఆంధ్రా వాటాగా ఆరు వేల క్యూసెక్కుల నీటిని తీసుకుంటున్నామని ఏపీ జెన్‌కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.అప్పలనాయుడు తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం సీలేరు కాంప్లెక్సు పరిధిలోని గుంటవాడ, డొంకరాయి జలాశయాల్లో 13.0649 టీఎంసీల నీటి నిల్వలు ఉండగా, బలిమెల జలాశయంలో ఆంధ్రా వాటాగా 22.9845 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయన్నారు. సీలేరు కాంప్లెక్సులో ప్రస్తుతం బలిమెల జలాశయంలో ఆంధ్రా వాటా నీటితో కలుపుకుని మొత్తంగా 36.0494 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని చెప్పారు. గోదావరి డెల్టా ఖరీఫ్ పంటల కోసం డొంకరాయి జలాశయం నుంచి నేరుగా విద్యుదుత్పత్తి లేకుండా మూడు వేల క్యూసెక్కులను జూలై ఒకటి వరకు విడుదల చేస్తామన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా వర్షాలు తక్కువగా పడే అవకాశాలున్నందున సీలేరు నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడేంత వరకు ఉన్న నీటినే పొదుపుగా వాడుకుంటూ సీలేరు కాంప్లెక్సు పరిధిలోని జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి నీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.