ట్రాఫిక్ నిర్వహణకు ఏఐ వినియోగం
ABN , Publish Date - Apr 22 , 2026 | 01:03 AM
నగరంలో ట్రాఫిక్ సమస్యతోపాటు రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ యోచిస్తున్నారు.
ట్రాఫిక్‌కు అనుగుణంగా జంక్షన్‌లలో సిగ్నల్స్
వాహనచోదకులు కూడళ్లలో ఎక్కువసేపు ఆగకుండా వెళ్లేలా సింక్రనైజేషన్
ఫేసియల్ రికగ్నైజేషన్ కెమెరాలు కూడా ఏర్పాటు
పోలీస్ శాఖ విజ్ఞప్తి మేరకు జీవీఎంసీ కసరత్తు
గతంలో ఒకసారి ట్రయల్ రన్
ఇప్పుడు మరోసారి ప్రతిపాదన
ట్రాఫిక్ నియంత్రణతోపాటు నేరాల తగ్గుదలకు దోహదపడుతుందని అభిప్రాయం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో ట్రాఫిక్ సమస్యతోపాటు రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ యోచిస్తున్నారు. గతంలో దీనిపై జీవీఎంసీకి నగర పోలీసులు ప్రతిపాదన పంపించగా ఆర్‌ఎఫ్‌పీ పిలవడంతోపాటు ఐదుచోట్ల ప్రయోగాత్మకంగా ట్రయల్ రన్ నిర్వహించారు. తర్వాత అనివార్య కారణాలతో ప్రాజెక్టు అటకెక్కింది. తాజాగా మళ్లీ ఏఐ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ప్రాజెక్టును పరిశీలిస్తున్నట్టు జీవీఎంసీ కమిషనర్ వెల్లడించారు.
నగరంలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలతోపాటు అనేక ఐటీ కంపెనీలు, పరిశ్రమలు ఉన్నాయి. రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణంలో ఉంది. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం త్వరంలో అందుబాటులోకి రాబోతోంది. మరోవైపు ప్రతిష్టాత్మకమైన గూగుల్‌డేటా సెంటర్‌కు శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ అందుబాటులోకి వస్తే నగరంలో ట్రాఫిక్ రెండింతలు అయ్యే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నగరంలో వాహనాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడంతో నిత్యం ఎక్కడికక్కడ ట్రాఫిక్‌జామ్ అవుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో అయితే సమస్య మరింత తీవ్రంగా ఉంటోంది. ఇలాంటి సమయంలో కొందరు వాహన చోదకులు అంతసేపు సిగ్నల్స్ దగ్గర నిరీక్షించలేక జంపింగ్‌లకు పాల్పడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడుపుతున్నారు. ఇది రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోంది. ఏటా ప్రమాదాల సంఖ్యతోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. వీటన్నింటి నేపథ్యంలో నగరంలో ఇప్పుడున్న ట్రాఫిక్ వ్యవస్థను సమూలంగా మార్చేసి, అత్యాధునికమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేసే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి భావించారు. జంక్షన్లలో ఏఐ సాంకేతిక కలిగిన సీసీ కెమెరాలను ఏర్పాటుచేయడం ద్వారా ట్రాఫిక్‌కు అనుగుణంగా సిగ్నల్ పడేలా చేసి, వాహనచోదకులు కూడళ్లలో ఎక్కువసేపు ఆగకుండా సింక్రనైజేషన్ చేయవచ్చునని గుర్తించారు. అంతేకాకుండా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారికి ఆటోమేటిక్‌గా ఈ-చలాన్ జారీచేయడం, ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాలను ఏర్పాటుచేయడం ద్వారా పాత నేరస్తులు ఎక్కడైనా కనిపిస్తే తక్షణం పోలీసులకు సమాచారం అందించేలా వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని అంచనా వేశారు. దీనికోసం సుమారు రూ.150 కోట్లు వరకు ఖర్చవుతుందని అంచనా వేయడంతో నిధుల కోసం జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్‌కు ప్రతిపాదన పంపించగా, ఆయన సుముఖత వ్యక్తంచేశారు. ఏఐ ఆధారిత ట్రాఫిక్ సిగ్నల్ పనితీరుని పరిశీలించేందుకు పైలట్ ప్రాజెక్టుగా దేశంలోని వివిధ పేరున్న సంస్థల ద్వారా నగర పరిధిలోని ఐదు చోట్ల కెమెరాలను ఏర్పాటుచేసి నెలరోజులపాటు ట్రయల్ రన్ నిర్వహించారు. కానీ తర్వాత ఏమైందోగానీ ఆ ప్రతిపాదన అటకెక్కిపోయింది. దీనికి బదులుగా నగరంలో వివిధ కంపెనీలు, జీవీఎంసీ సీఎస్‌ఆర్ నిధులతో సమకూర్చిన లేజర్‌గన్స్‌ను సమకూర్చుకోవాలని నిర్ణయించినట్టు సీపీ ప్రటిటించారు. దీంతో ఆ ప్రాజెక్టు అటకెక్కిపోయిందని అంతా భావించారు. అయితే నగర ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో నగరంలో ట్రాఫిక్ సమస్య మరింతజఠిలంగా మారే అవకాశం ఉన్నందున ఏఐ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం అమలును పరిశీలిస్తున్నట్టు జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ ఇటీవల వెల్లడించారు. దీనికోసం నగర పోలీస్ కమిషనర్‌తో కలిసి కార్యాచరణ రూపొందించి త్వరలోనే అమలుచేయాలని భావిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఈ ప్రతిపాదన తిరిగి తెరపైకి వచ్చిందనే చర్చ జరుగుతోంది.