పోలీస్‌స్టేషన్ల అప్‌గ్రెడేషన్!
ABN , Publish Date - Jan 05 , 2026 | 01:22 AM
నగరంలో కొన్ని పోలీస్‌స్టేషన్ల హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) స్థాయిని అప్‌గ్రేడ్ చేయాలనే ప్రతిపాదన తెరపైకివచ్చింది.
నగరంలో కీలక క్రైమ్, ట్రాఫిక్ స్టేషన్లకు ఎస్‌హెచ్‌ఓలుగా సీఐలను నియమించాలి
రుషికొండ, ఎండాడ, వేపగుంట, షీలానగర్‌లో కొత్తగా పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలి
సీపీకి పలువురు పోలీసుల ప్రతిపాదన
డీజీపీతో రేపు జరిగే సమావేశంలో ప్రస్తావించే అవకాశం
(విశాఖపట్నం,ఆంధ్రజ్యోతి)
నగరంలో కొన్ని పోలీస్‌స్టేషన్ల హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) స్థాయిని అప్‌గ్రేడ్ చేయాలనే ప్రతిపాదన తెరపైకివచ్చింది. శాంతిభద్రతల పోలీస్‌స్టేషన్లకు సీఐలు, క్రైమ్, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లకు ఎస్‌ఐలు ఎస్‌హెచ్‌వోలుగా వ్యవహరిస్తున్నారు. వాటిలో కీలక పోలీస్‌స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓల స్థాయిని సీఐలుగా అప్‌గ్రేడ్ చేయడంతోపాటు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొత్త పోలీస్‌స్టేషన్లు ఏర్పాటుచేయాలని పోలీస్‌శాఖలో కొందరు సీపీకి వినతిపత్రం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈనెల 6న విజయవాడలో డీజీపీతో జరిగే సమావేశంలో దీనిపై సీపీ ప్రస్తావిస్తారని చెబుతున్నారు.
నగరంలో ఆరు సబ్‌డివిజన్లలో 23 శాంతిభద్రతల పోలీస్‌స్టేషన్లున్నాయి. వీటికి సీఐలు ఎస్‌హెచ్‌ఓలుగా వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ విభాగానికి 21 స్టేషన్లుండగా ఎస్‌ఐలే ఎస్‌హెచ్‌ఓలు. తొమ్మిది మంది సీఐలు పర్యవేక్షణ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. క్రైమ్ విభాగానికి 23 పోలీస్‌స్టేషన్లుండగా ఆరుగురు సీఐల పర్యవేక్షణలో ఎస్‌ఐలే ఎస్‌హెచ్‌ఓలుగా వ్యవహరిస్తున్నారు. నగరంలో గాజువాక, దువ్వాడ, హర్బర్, మల్కాపురం, పీఎంపాలెం తదితర పోలీస్‌స్టేషన్ల పరిధిలో చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆయా కేసులను సీఐ, ఏసీపీలు పర్యవేక్షిస్తుండగా ఎస్‌ఐలే దర్యాప్తు చేయాల్సి వస్తోంది. దీనివల్ల మరో కేసు నమోదైతే అప్పటికే దర్యాప్తుచేస్తున్న కేసులను ఏఎస్‌ఐ లేదా హెడ్‌కానిస్టేబుల్‌కు అప్పగిస్తున్నారు. ఫలితంగా జాప్యంతో పాటు నిందితులు తప్పించుకునేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. సీఐ ఎస్‌హెచ్‌ఓగా ఉంటే చోరీలను స్వయంగా లేదంటే ఎస్‌ఐల సాయంతో దర్యాప్తు చేసే వీలుంటుందని పోలీస్ అధికారుల వాదన.
నగరం రోజురోజుకీ అభివృద్ధి చెందుతుండడంతో ట్రాఫిక్ భారీగా పెరుగుతోంది. కొమ్మాది, మధురవాడ, హనుమంతవాక వంటి కూడళ్లతోపాటు జగదాంబ జంక్షన్, బీచ్‌రోడ్డు, ద్వారకానగర్ మార్గాల్లో నిత్యం ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ లేని శివారుప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్లను మినహాయించి మిగిలిన వాటికి ఎస్‌హెచ్‌ఓలుగా సీఐ స్థాయికి అప్‌గ్రేడ్‌చేస్తే సత్ఫలితాలు వస్తాయంటున్నారు. నగర విస్తరణ నేపథ్యంలో వేపగుంట, షీలానగర్, ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పోలీస్‌స్టేషన్లను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ఈ అంశంలో ఉన్నతాఽధికారులపై ఒత్తిడి తేవాలని సీపీకి వినతిపత్రాలు అందజేస్తున్నారు. రాయలసీమ జోన్‌లో ఇదే విధానం అవలంభించడంతో క్రైమ్‌రేట్ తగ్గిందని, ఎస్‌ఐలకు సకాలంలో పదోన్నతులు లభిస్తున్నాయని, విశాఖ రేంజ్‌లో 15 ఏళ్లు సర్వీసు గడిచినా పదోన్నతి రావడం లేదని వాపోతున్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న సీపీ శంఖబ్రతబాగ్చి డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తాతో జరిగే సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు.