Share News

అక్కరకురాని అతిథి గృహం

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:38 AM

ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి వచ్చే పర్యాటకులకు ఆతిథ్యం ఇవ్వాల్సిన ఐటీడీఏ అతిథి గృహం ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. రెండున్నరేళ్లుగా దాని నిర్వహణను ఐటీడీఏ అధికారులు పట్టించుకోకపోవడంతో పాడుబడిన బంగ్లాలా దర్శనమిస్తోంది. పర్యాటక సీజన్‌లో లంబసింగికి వచ్చే సందర్శకులను వసతి సమస్య వేధిస్తోంది. ఐటీడీఏ అతిథి గృహాన్ని అందుబాటులోకి తెస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కానీ అధికారులు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.

అక్కరకురాని అతిథి గృహం
నిరుపయోగంగా ఉన్న అతిథి గృహం

- రెండున్నరేళ్లుగా నిర్వహణను పట్టించుకోని ఐటీడీఏ

- రూ.30 లక్షలతో ఆధునికీకరించి వదిలేసిన వైనం

- పర్యాటక సీజన్‌లో సందర్శకులను వేధిస్తున్న వసతి సమస్య

చింతపల్లి, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి వచ్చే పర్యాటకులకు ఆతిథ్యం ఇవ్వాల్సిన ఐటీడీఏ అతిథి గృహం ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. రెండున్నరేళ్లుగా దాని నిర్వహణను ఐటీడీఏ అధికారులు పట్టించుకోకపోవడంతో పాడుబడిన బంగ్లాలా దర్శనమిస్తోంది. పర్యాటక సీజన్‌లో లంబసింగికి వచ్చే సందర్శకులను వసతి సమస్య వేధిస్తోంది. ఐటీడీఏ అతిథి గృహాన్ని అందుబాటులోకి తెస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కానీ అధికారులు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.

లంబసింగి అటవీశాఖ చెక్‌పోస్టుకు ఎదురుగా ఎకరం విస్తీర్ణంలో సుమారు 20 ఏళ్ల క్రితం ఐటీడీఏ భవనం ఉండేది. అప్పట్లో ఈ భవనాన్ని ఏపీఎస్పీ బెటాలియన్‌ జవాన్లు అవుట్‌ పోస్టుగా ఉపయోగించారు. ఏపీఎస్పీ అవుట్‌ పోస్టును ఎత్తివేయడంతో ఐదేళ్లపాటు ఈ భవనాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వినియోగించారు. పీహెచ్‌సీకి నూతన భవనం అందుబాటులోకి రావడం వల్ల ఈ భవనాన్ని దుకాణ సముదాయంగా ప్రైవేటు వ్యక్తులకు ఐటీడీఏ లీజుకు ఇచ్చింది. ఈ భవనం మరమ్మతులకు గురికావడంతో నిరుపయోగంగా ఉండేది. గత ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలకృష్ణ ఈ భవనాన్ని రూ.30 లక్షలతో అతిథి గృహంగా ఆధునికీకరించారు. అత్యాధునిక సదుపాయాలతో ఆరు గదులు అందుబాటులోకి తీసుకొచ్చారు. అతిథి గృహం ప్రాంగణంలోనే రెస్టారెంట్‌ను నిర్మించారు.

ఆరు నెలలు మాత్రమే వినియోగం

ఈ అతిథి గృహాన్ని 2023 డిసెంబరు 28న అప్పటి గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే ప్రాంభించారు. ఈ అతిథి గృహం నిర్వహణ బాధ్యతను స్థానిక గిరిజన యువతకు అధికారులు అప్పగించారు. ఏడాదికి రూ.5 లక్షలు ఐటీడీఏకి చెల్లించాలనే నిబంధన పెట్టారు. ఆరు నెలల పాటు దీనిని నిర్వహించిన గిరిజన యువత ఏడాదికి రూ.5 లక్షలు చెల్లించడం సాధ్యంకాదని గుర్తించి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి ఐటీడీఏ అధికారులు ఇతర వ్యక్తులకు దీనిని లీజుకు ఇవ్వలేదు. ఈ ఏడాది అతిథి గృహం నిర్వహణకు అధికారులు దరఖాస్తులు ఆహ్వానించినప్పటికీ ఎవరూ ముందుకురాలేదు. అతిథి గృహాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఐటీడీఏ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు.

పిచ్చిమొక్కలతో అధ్వానంగా...

రెండున్నరేళ్లుగా నిరుపయోగంగా ఉండడంతో అతిథి గృహం ప్రాంగణమంతా పిచ్చిమొక్కలతో పాడుబడిన భవనం మాదిరిగా తయారైంది. లంబసింగికి సీజన్‌లో అత్యధిక సంఖ్యలో పర్యాటకులు వస్తారు. వేసవిలోనూ ఓ మాదిరిగా పర్యాటకులు వస్తుంటారు. ఐటీడీఏ అతిథి గృహం లంబసింగి ముఖద్వారంలో ఉండడంతో ఇక్కడ బస చేసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. హరిత రిసార్ట్స్‌లో వేసవిలోనూ పర్యాటకులు బస చేస్తున్నారు. ఐటీడీఏ అతిథి గృహాన్ని వినియోగంలోకి తీసుకొస్తే పర్యాటకులకు సౌకర్యవంతంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Apr 01 , 2026 | 12:38 AM