అకాల వర్షం
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:57 AM
జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీక్షణంగా కాయగా, తరువాత వాతావరణం మారిపోయింది. తొలుత ఏజెన్సీని ఆనుకొని వున్న మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి మండలాల్లో ఉరుములు, పిడుగులు, ఈదురు గాలులతో వర్షం మొదలైంది. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో చోడవరం, రావికమతం, బుచ్చెయ్యపేట, అనకాపల్లి, కశింకోట, సబ్బవరం, మునగపాక, అచ్యుతాపురం, పరవాడ, ఎలమంచిలి మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత
ఆ తరువాత మారిన వాతావరణం
పలుప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం
దేవరాపల్లి మండలంలో వడగళ్ల వాన
విద్యుత్ సరఫరాకు అంతరాయం
మామిడి, జీడిమామిడి తోటలకు నష్టం
అనకాపల్లి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్): జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీక్షణంగా కాయగా, తరువాత వాతావరణం మారిపోయింది. తొలుత ఏజెన్సీని ఆనుకొని వున్న మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి మండలాల్లో ఉరుములు, పిడుగులు, ఈదురు గాలులతో వర్షం మొదలైంది. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో చోడవరం, రావికమతం, బుచ్చెయ్యపేట, అనకాపల్లి, కశింకోట, సబ్బవరం, మునగపాక, అచ్యుతాపురం, పరవాడ, ఎలమంచిలి మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఈపీడీసీఎల్ అధికారులు ముందుజాగ్రత్తచర్యగా ఆయా మండలాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. గాలుల ఉధృతి తగ్గిన తరువాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఈ వర్షం పూత, కాయదశల్లో వున్న నువ్వు, వేరుశనగ పంటలకు మేలు చేస్తుందని జిల్లా వ్యవసాయాధికారి ఆశాదేవి తెలిపారు. అయితే మామిడి, జీడిమామిడి పంటలకు నష్టం చేకూరుస్తుందని పేర్కొన్నారు.
అనకాపల్లి పట్టణంతోపాటు చట్టుపక్కల గ్రామాల్లో సాయంత్రం ఏడు గంటల తొమ్మిది గంటల వరకు దఫదఫాలుగా ఈదురు గాలులు, ఉరుములతో భారీ వర్షం కురిసింది. రహదారులపై వర్షం నీరు ప్రవహించడంతో పలుచోట్ల ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఇబ్బందిపడ్డారు. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చోడవరం మండలంలో సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పలుమార్లు భారీ వర్షం కురిసింది. పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మాడుగుల మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు కుండపోతగా వర్షం కురిసింది. వీరవల్లి అగ్రహారం, ఎం.కోడూరు, సాగరం గ్రామాల్లో వడగండ్లు పడ్డాయి. ఈదురు గాలులు వీచడంతో ఘాట్‌రోడ్డు జంక్షన్- కోడూరు మధ్య భారీ చింతచెట్టునేలకొరిగింది. చెట్ల కొమ్మలు విరిగిపడడంతో విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయి కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సులను వేరే మార్గంలోకి మళ్లించారు. రాత్రి పది గంటల వరకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు. కోటవురట్ల మండలంలోని పలు గ్రామాల్లో సాయంత్రం ఐదు గంటలకు మొదలైన వర్షం దాదాపు అర్ధగంటపాటు కురిసింది. దేవరాపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసంది. తిమిరాంలో పెద్ద పరిమాణంలో వడగళ్లు పడ్డాయి. దీంతో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. ఈదురుగాలుల కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు పునరుద్ధరించారు.