తేలని సీట్ల పంచాయితీ
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:21 AM
జిల్లాలో కూటమి పార్టీలకు సంబంధించి జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల సీట్ల పంపకం నేటికీ తేలలేదు. దీంతో పార్టీలు, అధిష్ఠానాల నిర్ణయాలతో సంబంధం లేకుండా ఎవరికి వారు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు.
కూటమిలో ఎవరికి వారు నామినేషన్ల దాఖలు
జడ్పీ చైర్మన్ పదవిపై సైతం రాని స్పష్టత
అయోమయంలో అభ్యర్థులు, పార్టీ క్యాడర్
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో కూటమి పార్టీలకు సంబంధించి జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల సీట్ల పంపకం నేటికీ తేలలేదు. దీంతో పార్టీలు, అధిష్ఠానాల నిర్ణయాలతో సంబంధం లేకుండా ఎవరికి వారు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. జిల్లాలోని పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో మొత్తం 11 జడ్పీటీసీ 172 ఎంపీటీసీ స్థానాలున్నాయి. అరకులోయ అసెంబ్లీ స్థానంలో 6 జడ్పీటీసీ, 106 ఎంపీటీసీ స్థానాలు, పాడేరు నియోజకవర్గంలో 5 జడ్పీటీసీ, 66 ఎంపీటీసీ స్థానాలున్నాయి.
తేలని కూటమి సీట్ల పెంపకం
జిల్లాలోని మొత్తం 11 జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీకి 8, జనసేనకు 2, బీజేపీకి 1 సీటు ఇస్తారని అందరూ భావిస్తున్నప్పటికీ లెక్కలు తేలలేదు. మొత్తం 172 ఎంపీటీసీ స్థానాలకు వంద వరకు స్థానాలు టీడీపీకి, 50 స్థానాలు జనసేనకు, 22 స్థానాలు బీజేపీకి ఇవ్వాలని భావిస్తున్నారు. కాని జిల్లాలో ఏ మండలంలో ఏఏ పార్టీకి ఎక్కడెక్కడ స్థానాలు కేటాయిస్తారనేది నిర్ణయించలేదు. దీంతో జడ్పీటీసీ స్థానాలతోపాటు ఎంపీటీసీ స్థానాలకు సైతం తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు చెందిన నాయకులు నామినేషన్లను దాఖలు చేశారు. దీంతో ఎవరు పోటీలో ఉంటారో? ఎవరు ఉపసంహరించుకుంటారో? అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు పాడేరు జడ్పీటీసీ స్థానానికి అడపా ప్రీతి మధుమిత(టీడీపీ), సీదరి రామ్మూర్తి(జనసేన), బొంకుల దివ్యలత(జనసేన), నందోలి ఉమామహేశ్వరరావు(బీజేపీ) నామినేషన్లు వేశారు. ఇదే పరిస్థితి పలు మండలాల్లో ఉంది. ఈ కారణంగా రెబల్స్ బెడద అధికమై విపక్ష పార్టీకి మేలు జరిగే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
జడ్పీ చైర్మన్ పదవిపైనా అదే అస్పష్టత
జిల్లాలోని జడ్పీ చైర్మన్ పదవిని సైతం కూటమి పార్టీల్లో ఎవరి కేటాయిస్తారనే దానిపైనా స్పష్టత రాలేదు. అయితే రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాలను కూటమిలోని మూడు పార్టీలకు కేటాయిస్తారని భావిస్తున్నప్పటికీ, ఏ జిల్లా ఏ పార్టీకి కేటాయిస్తారనేది ఇప్పటికీ ప్రకటించలేదు. దీంతో కూటమి పార్టీల నేతలందరూ నామినేషన్లు వేస్తున్నారు. కూటమి పార్టీలకు జిల్లాలు కేటాయిస్తే సమస్య కొలిక్కి వస్తుంది.