పట్టపగ్గాలు లేని ట్యాంకర్ల డ్రైవర్లు
ABN , Publish Date - Aug 05 , 2026 | 12:36 AM
నగరంలో నెలకొన్న నీటి ఎద్దడిని వాటర్ ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లు సొమ్ము చేసుకుంటున్నారు.
కిలోలీటర్ జీవీఎంసీ వద్ద రూ.40కు కొని బయట రూ.500కు అమ్మకం
ఇష్టారాజ్యంగా వ్యవహారం
ఆరిలోవ, విశాలాక్షి నగర్, పెదవాల్తేరు వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు నో
తమ కుటుంబ సభ్యులతోనే చలాన్‌లు తీయించి హోటళ్లకు విక్రయం
నీటి కోసం టీఎస్‌ఆర్ రిజర్వాయర్ వద్ద జనం పడిగాపులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో నెలకొన్న నీటి ఎద్దడిని వాటర్ ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లు సొమ్ము చేసుకుంటున్నారు. రేట్లు భారీగా పెంచేయడంతోపాటు దూరప్రాంతాలకైతే నీటిని తీసుకురాలేమని చెబుతున్నారు.
నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమై రెండు నెలలైనా ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సరైన వర్షాలు కురవలేదు. రిజర్వాయర్లలో నిల్వలు తగ్గడంతో నగరంలో మంచినీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. కొన్ని ప్రాంతాలకు రెండు, మూడు రోజులకొకసారి కొళాయిలు ఇస్తుంటే, మరికొన్ని ప్రాంతాలకు నీరు ఇచ్చే సమయం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. మరోవైపు బోర్లు కూడా ఎండిపోవడంతో ప్రజలు నిత్యావసరాలకు అవసరమైన నీటి కోసం జీవీఎంసీ సరఫరా చేసే కొళాయిలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో నీరు సరఫరా చేసే ప్రైవేటు ట్యాంకర్‌లకు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా వాటి యజమానులు, డ్రైవర్లు ధరలను అమాంతంగా పెంచేశారు. జీవీఎంసీకి కిలోలీటర్‌కు రూ.40 చొప్పున చెల్లించి, బయట రూ.500 నుంచి రూ.700 చొప్పున విక్రయిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వారు చెప్పినంత ఇచ్చేందుకు సిద్ధమైనా...టీఎస్‌ఆర్ కాంప్లెక్స్‌కు కాస్త దూరంగా ఉండే ఆరిలోవ, విశాలాక్షి నగర్, అప్పుఘర్, పెదవాల్తేరు వంటి ప్రాంతాలకు నీటిని సరఫరా చేసేందుకు డ్రైవర్లు ముందుకురావడంలేదు. రిజర్వాయర్‌కు ఆనుకుని ఉన్న రామ్‌నగర్, అల్లిపురం, ద్వారకానగర్, రేసపువానిపాలెం ప్రాంతాలకే ఎక్కువగా వెళుతున్నారు.
ట్యాంకర్ల డ్రైవర్లు, యజమానుల బంధువుల పేరుతో హోటళ్లకు విక్రయం
ట్యాంకర్ల ద్వారా నీటిని కేవలం ప్రజల తాగునీటి అవసరాలకు మాత్రమే తరలించాలని అధికారులు నిబంధన విధించారు. ఆ విధంగా అయితే తక్కువ వస్తుండడం, హోటళ్లకు తరలిస్తే ఎక్కువ మొత్తం ఇస్తుండడంతో ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లు కొత్త వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. తమ కుటుంబ సభ్యులు, హోటళ్లలో పనిచేసే సిబ్బందిని టీఎస్‌ఆర్ రిజర్వాయర్ వద్ద ఉన్న కౌంటర్‌కు పంపించి తమ ఇళ్లకు నీరు కావాలని చెప్పి స్లిప్ రాయించుకుంటున్నారు. ఆ స్లిప్‌లను ట్యాంకర్ యజమానులు, డ్రైవర్లు తీసుకుని తాము వారి ఇళ్లకు నీటిని తీసుకువెళతామని చెప్పి, తాము ఒప్పందం కుదుర్చుకున్న హోటళ్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
డయల్ యువర్ ట్యాంకర్‌ను అందుబాటులోకి తెస్తాం
పల్లంరాజు, ఎస్‌ఈ, జీవీఎంసీ నీటి సరఫరా విభాగం
నగరంలో నీటి ఎద్దడి పరిస్థితిని కొందరు ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లు సొమ్ము చేసుకునేందుకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించాం. దూరప్రాంతాలకు ట్యాంకర్ తీసుకురాలేమని చెబుతున్నట్టు, డబ్బులు అధికంగా డిమాండ్ చేస్తున్నట్టు పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. వీటన్నింటికీ అడ్డుకట్ట వేసేందుకు గతంలో మాదిరిగా డయల్ యువర్ ట్యాంకర్ విధానాన్ని తిరిగి అందుబాటులోకి తేవాలని భావిస్తున్నాం. విదేశీ పర్యటనలో ఉన్న కమిషనర్ తిరిగిరాగానే ఆయనతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఆ సదుపాయం అందుబాటులోకి వస్తే ట్యాంకర్ కోసం ప్రజలు నేరుగా జీవీఎంసీ సిబ్బందికే ఫోన్ చేయవచ్చు. వారి వివరాలను నమోదుచేసుకుని ప్రాధాన్యం వారీగా ట్యాంకర్‌ను పంపిస్తాం. అలాగే దూరం బట్టి నామమాత్రపు చార్జీలు వసూలుచేసేలా చార్ట్‌ను తయారుచేసి అందుబాటులో ఉంచుతాం. దీనివల్ల ట్యాంకర్ల డ్రైవర్ల ఆగడాలకు అడ్డుకట్టపడుతుంది.
స్ర్కాప్ దుకాణాల్లో పోలీసులు తనిఖీలు
62 కిలోల అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబుల్, కొళాయి హెడ్‌లు వంద, ఎలక్ర్టిక్ వైర్ కాయిల్స్ 14, అల్యూమినియం హైఓల్టేజీ వైర్లు 68 కిలోలు సీజ్
విశాఖపట్నం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి):
నగరంలోని స్ర్కాప్ దుకాణదారుల్లో కొందరు చోరీ వస్తువులు కొనుగోలు చేయడంతోపాటు ప్రమాదకరమైన వస్తువులను నిల్వ ఉంచుతున్నారనే అనుమానంతో పోలీసులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సీపీ శంఖబ్రతబాగ్చి ఆదేశాల మేరకు క్రైమ్ విభాగానికి చెందిన 200 మంది సిబ్బంది 65 బృందాలుగా ఏర్పడి 288 దుకాణాల్లో సోదాలు నిర్వహించారు. దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారా?, లేదా?, ఒకవేళ ఉంటే వాటి పనితీరు ఎలా ఉంది?, ఫుటేజీ స్టోరీ సామర్థ్యం ఎంత అనేది పరిశీలించారు. అలాగే దుకాణాల్లో బాల కార్మికులు ఎవరైనా ఉన్నారా?, దుకాణం ఏ కేటగిరీలో ఉంది?, రిజిస్ర్టేషన్, లైసెన్స్ కాలపరిమితి, కొనుగోలు, విక్రయాలకు సంబంధించిన రికార్డులు, దుకాణంలో ఉన్న సామగ్రి దేనికి సంబంధించినది?, వాటిని ఎవరు తీసుకొచ్చి విక్రయిస్తున్నారనే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా 62 కిలోల అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబుల్, కొళాయి హెడ్‌లు వంద, ఎలక్ర్టిక్ వైర్ కాయిల్స్ 14, అల్యూమినియం హైఓల్టేజీ వైర్లు 68 కిలోలు, రాగి వైర్లు 30 కిలోలు సీజ్ చేశారు.