Share News

సాగని ఏకీకృత కుటుంబ సర్వే

ABN , Publish Date - Jan 23 , 2026 | 10:28 PM

అర్హులకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధికి కార్యక్రమాలు మరింత పకడ్బందీగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఏకీకృత కుటుంబ సర్వేకు ఉమ్మడి అల్లూరి జిల్లాలో ఇంటర్నెట్‌ సమస్యగా మారింది.

సాగని ఏకీకృత కుటుంబ సర్వే
పల్లెల్లో ఏకీకృత కుటుంబ సర్వే చేపడుతున్న సచివాలయ సిబ్బంది

నెట్‌వర్క్‌ లేక ఇక్కట్లు

జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి

సర్వే ప్రారంభించి 45 రోజులు కావస్తున్నా ఐదు శాతం మాత్రమే పూర్తి

ప్రత్యేక యాప్‌తో ఆర్థిక, సామాజిక, విద్యా సంబంధ వివరాల నమోదుకు ఇంటర్నెట్‌ సమస్య

గిరిజన ప్రాంతంలో ఆఫ్‌లైన్‌లో సర్వేకు అనుమతివ్వాలని సిబ్బంది వేడుకోలు

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

అర్హులకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధికి కార్యక్రమాలు మరింత పకడ్బందీగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఏకీకృత కుటుంబ సర్వేకు ఉమ్మడి అల్లూరి జిల్లాలో ఇంటర్నెట్‌ సమస్యగా మారింది. సర్వే ప్రారంభించిన నెలన్నర కావస్తున్నప్పటికీ కేవలం ఐదు శాతం మాత్రమే అయ్యింది. జిల్లాలో నేటికీ అనేక ప్రాంతాలకు ఇంటర్నెట్‌ సదుపాయం లేకపోవడం ఈ పరిస్థితి కారణమైంది. సర్వేను కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే చేయాలనే నిబంధనతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు.

సంపూర్ణంగా లేని ఇంటర్నెంట్‌ సదుపాయాలు

ఉమ్మడి అల్లూరి జిల్లాలో నేటికీ అధిక సంఖ్యలో గ్రామ పంచాయతీలకు సెల్‌, ఇంటర్నెట్‌ సదుపాయం లేదు. జిల్లాలోని 430 పంచాయతీల్లో సగానికిపైగా పంచాయతీలకు ఎటువంటి సాంకేతిక సౌకర్యం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏకీకృత కుటుంబ సర్వే నిర్వహణ పూర్తిగా ఆన్‌లైన్‌లో మాత్రమే చేపట్టేందుకు వీలుగా యాప్‌ను రూపొందించారు. దీంతో సర్వే చేపట్టేందుకు సచివాలయ సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. వాస్తవానికి గతం నుంచి వివిధ సర్వేలతో పాటు ఆఖరుకు రేషన్‌ సరుకుల పంపిణీని సైతం ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంటే ఆన్‌లైన్‌లో, లేకుంటే ఆఫ్‌లైన్‌లో చేసుకునే వెసులుబాటు ఉంది. కాని ఏకీకృత కుటుంబ సర్వే అందుకు భిన్నంగా కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే నమోదుకు అవకాశం ఇవ్వడంతో సర్వే మందకొడిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతంలో కుటుంబ సర్వేను చేపట్టేందుకు ఆఫ్‌లైన్‌ సదుపాయాన్ని కల్పించాలని సిబ్బంది కోరుతున్నారు.

ఆధార్‌ ఆధారంగా వివరాలు సేకరణ

ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎంపిక చేసేందుకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తించాలనే లక్ష్యంతోనే ఏకీకృత కుటుంబ సర్వేను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన మండల, సచివాలయ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించింది. గతేడాది డిసెంబరు 16 నుంచి గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కుటుంబలోని వ్యక్తుల ఆర్థిక, సామాజిక, విద్యా సంబంధ వివరాల సేకరించి, అందుకు రూపొందించిన ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. ప్రతి కుటుంబంలోని వ్యక్తి ఆధార్‌ నంబర్‌ ఆధారంగానే వారికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. పేరు, పుట్టిన తేదీ, మొబైల్‌ నంబర్‌, ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు. విద్యార్హత, వివాహస్థితి, తండ్రి/భర్త పేరు, కులం, మతం వంటి సామాజిక వివరాలను సేకరిస్తున్నారు. విద్యావంతులైతే ఎంత వరకు చదువుకున్నారు? నైపుణ్య శిక్షణలు ఏమైనా పొందారా/పొందుతారా?, స్వయం ఉపాధి, నెలవారీ ఆదాయం, సీజనల్‌గా వలస వెళతారా, ఇంటి స్థితిగతులు, ఇంట్లో టీవీ, ఫ్రిజ్‌, ఇతర ఎలక్ర్టానిక్‌ వస్తువులు, వాహనాలు, గ్యాస్‌ కనెక్షన్‌ తదితర 38 రకాల వివరాలను నమోదు చేసి, వ్యక్తుల ఈకేవైసీ చేయిస్తారు. ఏకీకృత కుటుంబ సర్వేతో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అసలైన అర్హులను గుర్తించేందుకు కీలకంగా దోహదపడుతుందని అధికారులు అంటున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఏకీకృత కుటుంబ సర్వే నమోదు వివరాలు....

వ.సం డివిజన్‌ పేరు మండలాలు సచివాలయాలు మొత్తం కుటుంబాలు సర్వే చేసినవి పెండింగ్‌

1. పాడేరు 11 212 1,92,327 9,734 1,82,593

2. రంపచోడవరం 7 94 75,643 5,409 70,234

3. చింతూరు 4 46 46,648 2,390 44,258

--------------------------------------------------------------------------------------------------------------------------

మొత్తం 22 352 3,14,618 17,533 2,97,085

--------------------------------------------------------------------------------------------------------------------------

Updated Date - Jan 23 , 2026 | 10:29 PM