Share News

తగ్గని చలి తీవ్రత

ABN , Publish Date - Feb 06 , 2026 | 10:59 PM

మన్యంలోని వాతావరణంలో మార్పుల కారణంగా శుక్రవారం ఉదయం పొగమంచు మోస్తరుగా కురిసింది. కాని చలి తీవ్రత మాత్రం తగ్గలేదు.

తగ్గని చలి తీవ్రత
పాడేరులో శుక్రవారం ఉదయం మంచుతో ఏర్పడిన వాతావరణం

హుకుంపేటలో 7.3 డిగ్రీలు

వణికిస్తున్న చలి

పాడే రు, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని వాతావరణంలో మార్పుల కారణంగా శుక్రవారం ఉదయం పొగమంచు మోస్తరుగా కురిసింది. కాని చలి తీవ్రత మాత్రం తగ్గలేదు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని ఏజెన్సీ వ్యాప్తంగా శుక్రవారం ఉదయం ఒక మోస్తరుగా మాత్రమే పొగమంచు నెలకొంది. వాస్తవానికి గత కొన్నాళ్లుగా ఉదయం పది గంటల వరకు పొగమంచు కమ్ముకునేది. కానీ శుక్రవారం భిన్నమైన పరిస్థితి నెలకొంది. అయితే చలి తీవ్రత అధికంగా ఉండడంతో జనం వణుకుతున్నారు. దీంతో శుక్రవారం హుకుంపేటలో 7.3 డిగ్రీల సెల్సియస్‌ నమోదుకాగా అరకులోయలో 7.4, పెదబయలులో 8.9, చింతపల్లి, ముంచంగిపుట్టులో 9.0, జి.మాడుగులలో 10.7, కొయ్యూరులో 11.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

గజగజలాడిస్తున్న చలి

ముంచంగిపుట్టు:

గత కొద్ది రోజులుగా దోబూచులాడుతున్న చలి ఒక్కసారిగా పంజా విసిరింది. మండల పరిధిలో శుక్రవారం ఉదయం చలి తీవ్రత అధికంగా కావడంతో ప్రజలు గజగజ వణికిపోయారు. తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగమంచు కురుస్తుండడంతో గ్రామాలు మంచు దుప్పటి కప్పుకున్నట్టు ఉన్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా ఉదయం 9 గంటలు దాటినా వాహనదారులు లైట్ల వెలుగులో రాకపోకలు సాగించాల్సి వచ్చింది. రోడ్లుపై ఎదురుగా వచ్చే వాహనాలు దగ్గరకు వస్తే గానీ కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం అయితే చలి మొదలవుతుంది. చలికి పిల్లలు, వయసుపై బడిన వారు ఆపసోపాలు పడుతున్నారు.

Updated Date - Feb 06 , 2026 | 10:59 PM