వెలగని వీధి దీపాలు
ABN , Publish Date - Jul 14 , 2026 | 01:19 AM
జీవీఎంసీ పరిధిలో వీధిదీపాల నిర్వహణ పనులుచేస్తున్న సిబ్బంది ఈనెల 9 నుంచి సమ్మె బాటపట్టారు.
మూడు రోజులుగా నిర్వహణ సిబ్బంది సమ్మె
కాంట్రాక్ట్ సంస్థ జీతాలు పెంచాలని డిమాండ్
సింహగిరి ప్రదక్షిణ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం
చర్చలు ఫలించడంతో విధుల్లో చేరిన సిబ్బంది
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ పరిధిలో వీధిదీపాల నిర్వహణ పనులుచేస్తున్న సిబ్బంది ఈనెల 9 నుంచి సమ్మె బాటపట్టారు. కాంట్రాక్ట్ సంస్థ జీతాలు సక్రమంగా చెల్లించడంలేదని, పెంచాలనే డిమాండ్‌తో సిబ్బంది విధులను బహిష్కరించారు. దీంతో నగరంలో వీధిదీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సింహ గిరిప్రదక్షిణ సమీపిస్తుండడంతో జీవీఎంసీ అధికారులు అప్రమత్తమై ఇరువర్గాలతో చర్చలు జరపడంతో సోమవారం విధుల్లో చేరారు.
జీవీఎంసీ పరిధిలోని 1.18 లక్షలు ఎల్‌ఈడీ వీధిదీపాలను నిర్వహించేందుకు రెండేళ్ల కిందట హైదరాబాద్‌కు చెందిన బ్రిడ్జ్ అండ్ రూఫ్ (బీఅండ్‌ఆర్) సంస్థతో జీవీఎంసీ ఒప్పందం చేసుకుంది. ఒక్కో వార్డు పరిధిలో ఒక ఎలక్ర్టీషియన్, హెల్పర్‌తోపాటు ఒక్కోజోన్‌కు ఇంజనీర్, రాత్రిపూట వెలగనిలైట్లు గుర్తించేందుకు పెట్రోలింగ్‌సిబ్బంది, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత ప్రాంత సిబ్బందికి తెలియపరిచేందుకు వీలుగా కంట్రోల్‌రూమ్ వంటివి కాంట్రాక్టర్ ఏర్పాటు చేసుకోవాలి. దీనికోసం జీవీఎంసీ ప్రతి నెలా రూ.1.16 కోట్లు చొప్పున చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఎక్కడైనా వీధిదీపం వెలగడం లేదని ఫిర్యాదు అందితే 48 గంటల్లోగా పరిష్కరించాలి. లేదంటే జీవీఎంసీ అధికారులు కాంట్రాక్టర్‌కు జరిమానా విధిస్తారు.
కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థనుంచి స్థానికుడు సబ్‌కాంట్రాక్ట్ తీసుకుని అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. సౌత్‌జోన్ పరిధిలో 12 వార్డులకు 24 మంది సిబ్బందికి గాను పది మంది మాత్రమే పనిచేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని జీవీఎంసీ ఎలక్ర్టికల్ విభాగం సిబ్బందే ఆరోపిస్తున్నారు. తగినంతమంది సిబ్బంది ఉన్నారని కాంట్రాక్టర్ బుకాయిస్తున్నప్పటికీ, వారందరికీ పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లిస్తున్న వివరాలను బయటపెట్టడం లేదు. కాగా బీఎన్‌ఆర్‌లో పనిచేస్తున్న సిబ్బంది తమకు సక్రమంగా జీతాలు చెల్లించడం లేదని, జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తూ ఈనెల తొమ్మిది నుంచి సమ్మెబాట పట్టారు. దీంతో నగరంలో వీధిదీపాలపై ప్రభావం పడింది. జీవీఎంసీ నాన్ ఆప్కోస్ సిబ్బందితోనే వీధిదీపాల నిర్వహణ పనులు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈనెల 28న సింహాచలం గిరిప్రదక్షిణ ఉండడంతో అధికారులు అప్రమత్తమమయ్యారు. సంస్థ ప్రతినిధిగా చెప్పుకుంటున్న సబ్‌కాంట్రాక్టర్, సిబ్బందితో జీవీఎంసీ ఎలక్ర్టికల్ విభాగం అధికారులు చర్చలు జరిపారు. దీంతో వారంతా సమ్మెను విరమించి సోమవారం నుంచి విధుల్లో చేరారు.
హెచ్‌పీసీఎల్‌లో మంటలు
షట్‌డౌన్ చేస్తుండగా సాంకేతిక లోపం
చిమ్నీ నుంచి ఎగసిపడిన అగ్ని కీలలు
ఆందోళనకు గురైన ప్రజలు
మల్కాపురం, జూలై 13 (ఆంధ్రజ్యోతి): హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)లో సోమవారం రాత్రి మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ప్రమాదం సంభవించిందనే ఆందోళనతో స్థానికులు భయాందోళన చెందారు.
హెచ్‌పీసీఎల్‌లోని ఎఫ్‌సీహెచ్‌సీ యూనిట్ షట్‌డౌన్ పనులు ప్రారంభించారు. సాధారణంగా చమురు ఉత్పత్తుల తయారీ పనులను నిలుపుదల చేసిన సందర్భంలో వ్యర్థాలను బయటకు పంపే ప్రక్రియను చేపడతారు. అయితే సోమవారం ఈ పనులు చేస్తుండగా సాంకేతిక సమస్యల కారణంగా చిమ్నీ నుంచి మంటలు రేగాయి. ఇది చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు సాధరణంగా ఏదైనా యూనిట్ షట్‌డౌన్ చేసే సందర్భంగా అన్ని పైప్‌లను క్లీన్‌చేస్తూ చిమ్నీ ద్వారా వ్యర్థాలను బయటకు పంపుతుంటారు. ఈ ప్రక్రియలో భాగంగానే పైపులైన్ ద్వారా వ్యర్థాలను బయటకు పంపుతుండగా సాంతికేక సమస్యతో వ్యర్థాలు మండిపోయి చిమ్నీ నుంచి నింగిని తాకేంత ఎత్తులో మంటలు ఎగసిపడ్డాయి. దీంతో హెచ్‌పీసీఎల్‌లో భారీ ప్రమాదం జరిగిందని భావించిన జనం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. షట్‌డౌన్ పనుల్లో భాగంగా రేగాయని తెలుసుకుని శాంతించారు. మంటల కారణంగా ఎలాంటి నష్టం సంభవించలేదని కంపెనీ పేర్కొంది. కాగా మంటల కారణంగా ఎలాంటి ప్రమాదం లేదని, మల్కాపురం సీఐ నరసింహారావు, ఎస్‌ఐ శ్రీనివాసరావులు మైక్‌లతో ప్రచారం చేశారు.
నేటి నుంచి డైట్ కౌన్సెలింగ్
విశాఖపట్నం, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రైవేటు డైట్ కళాశాలల్లో ప్రవేశాలకు మంగళవారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని డీఈవో ఎన్.ప్రేమకుమార్, భీమిలి డైట్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ జీజీఎస్ నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం నుంచి 18 వరకు ఆన్‌లైన్‌లో వెబ్‌ఆప్షన్లకు అవకాశం ఉందన్నారు. ర్యాంకు ఆధారంగా ఈనెల 20 నుంచి 23 వరకు సీట్లు కేటాయిస్తారని, 24 నుంచి 29 వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించి ధ్రువీకరణపత్రం పొందాలన్నారు. 30 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. భీమిలి డైట్ కళాశాలలో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలకు 50 చొప్పున సీట్లున్నాయన్నారు.
’సర్’లో 97.53 శాతం డిజిటలైజేషన్
ఫారాలు అందజేతకు నేడు ఆఖరిరోజు
విశాఖపట్నం, జూలై 13 (ఆంధ్రజ్యోతి)
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (సర్)లో 97.53 శాతం డిజిటలైజేషన్ పూర్తిచేశారు. జిల్లాలో 20,23,009 మంది ఓటర్లలో సోమవారం సాయంత్రానికి 19,72,971మంది ఎన్యుమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ చేశామని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. ఇంకా 78,990 ఫారాలు డిజిటలైజేషన్ చేయాల్సి ఉందన్నారు. డిజిటలైజేషన్‌లో పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ముందంజలో ఉందన్నారు. మంగళవారం సాయంత్రంతో గడువు ముగియనుండడంతో ఎన్యుమరేషన్ ఫారాలను తమ ప్రాంతంలోని బీఎల్‌వోలకు అందజేయాలన్నారు.