Share News

సమస్యల ఏకరువు

ABN , Publish Date - Mar 13 , 2026 | 01:01 AM

‘మా అక్షరం... మీ ఆయుధం’ అంటూ ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలపై కథనాలను ప్రచురిస్తూ, వాటి పరిష్కారానికి ‘ఆంధ్రజ్యోతి’ ఎప్పటి నుంచో కృషి చేస్తున్నది. అయితే ప్రజలు తమ సమస్యలను స్వయంగా ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ‘అక్షరం అండగా, పరిష్కారమే అజెండాగా...’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.

సమస్యల ఏకరువు
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌. వేదికపై (ఎడమ నుంచి )సెజ్‌

పునరావాస కాలనీ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ బైలపూడి శ్రీరామదాసు, ఏపీఐఐసీ డీజడ్‌ఎం సూర్యనారాయణ, ఆంధ్రజ్యోతి బ్రాంచి మేనేజర్‌ కె.రామకృష్ణారావు, ఎంపీడీవో చిన్నారావు.

అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం సెజ్‌ పునరావాస కాలనీలో ‘అక్షరం అండగా... సమస్యల పరిష్కారమే అజెండా...’ కార్యక్రమం

ప్రజల వద్దకు ప్రజా ప్రతినిధులు, అధికారులు

ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌

పలు సమస్యలను ప్రస్తావించిన స్థానికులు

ఎమ్మెల్యేతోపాటు అధికారుల వివరణలు, సమాధానాలు

పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ

అచ్యుతాపురం, అచ్యుతాపురం రూరల్‌, మార్చి 12, (ఆంధ్రజ్యోతి):

‘మా అక్షరం... మీ ఆయుధం’ అంటూ ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలపై కథనాలను ప్రచురిస్తూ, వాటి పరిష్కారానికి ‘ఆంధ్రజ్యోతి’ ఎప్పటి నుంచో కృషి చేస్తున్నది. అయితే ప్రజలు తమ సమస్యలను స్వయంగా ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ‘అక్షరం అండగా, పరిష్కారమే అజెండాగా...’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా గురువారం ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం ఎస్‌ఈజడ్‌ పునరావాస కాలనీ పంచాయతీ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ‘ఆంధ్రజ్యోతి’ విశాఖపట్నం బ్రాంచి మేనేజరు కె.రామకృష్ణారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌.. కాలనీవాసులు లేవనెత్తిన పలు సమస్యలకు సానుకూలంగా స్పందించారు. కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కారమార్గం చూపారు. మిగిలిన వాటిని వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

కాలుష్య సమస్య..

దిబ్బపాలెం పునరావాస కాలనీకి అతి చేరువలో ఫార్మా, ఇతర కంపెనీలు వుండడంతో కాలుష్య సమస్య పెరిగిందని నక్కపాలేనికి చెందిన వియ్యపు కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యం వల్ల రోగాలబారిన పడుతున్నామని, ఈ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాలనీలో పది శాతం భూమిని గ్రీన్‌బెల్ట్‌కు కేటాయించి మొక్కలు పెంచాలని, కానీ ఉన్న చెట్లనే తొలగిస్తున్నారని చెప్పారు. 458.71 ఎకరాల్లో విస్తరించి ఉన్న కాలనీలో సుమారు 46 ఎకరాల్లో గ్రీన్‌బెల్ట్‌ ఏర్పాటు చేయాలని కోరారు. కాలనీ మొత్తానికి ఒకే ఒక్క కల్యాణమండపం వుందని, దీనిని బాగు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ స్పందిస్తూ.. అధికారులతో మాట్లాడి, గ్రీన్‌బెల్ట్‌ ఏర్పాటుకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు.

డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు

లాలం రాజు మాట్లాడుతూ, పునరావాస కాలనీలో డ్రైనేజీ కాలువలు సరిగా లేవని, ఎక్కడికక్కడ మురుగు నిలిచిపోతున్నదని చెప్పారు. కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోయిందని అన్నారు. ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ స్పందిస్తూ.. దిబ్బపాలెం పునరావాస కాలనీ రూర్బన్‌ పంచాయతీగా మారిందని త్వరలో మురుగు సమస్యను పరిష్కారం అవుతుందన్నారు.

పాఠశాల సమస్యలు తీర్చాలి

ఉన్నత పాఠశాల పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ పంచదార్ల రాజశేఖర్‌, ఉపాధ్యాయురాలు స్వర్ణలతలు మాట్లాడుతూ, పాఠశాలలో విద్యార్థులకు సరిపడ మరుగుదొడ్లు నిర్మించాలని, తరగతి గదుల్లో పూర్తిస్థాయిలో బెంచీలు సమకూర్చాలని, విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేయడానికి డైనింగ్‌ హాలు నిర్మించాలని కోరారు. ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ, కంపెనీల సీఎస్‌ఆర్‌ నిధులతో వీటిని సమకూరుస్తామని హామీ ఇచ్చారు.

లైబ్రరీ, జిమ్‌ ఏర్పాటు చేయాలి

పునరావాస కాలనీలో స్మార్ట్‌ డిజిటల్‌ లైబ్రరీ, స్మార్ట్‌ హెల్త్‌ జిమ్‌లు ఏర్టాటు చేయాలని విద్యావేత్త రుత్తల శ్రీను కోరారు. వీటిని త్వరలో ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ సూర్యనారాయణ, ఎంపీడీఓ చిన్నారావు, డిప్యూటీ తహశీల్దారు శ్యామ్‌, ఏఈ శ్రీనివాస్‌, సీఐ ఆర్‌వీవీఎస్‌ఎస్‌ చంద్రశేఖర్‌, సెజ్‌ పునరావాస కాలనీ అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ బైలపూడి శ్రీరామదాసు, స్థానిక ప్రజాప్రతినిధులు లాలం శ్రీను, నీరుకొండ నరసింగరావు, ‘ఆంధ్రజ్యోతి’ విశాఖ ఎడిషన్‌ ఇన్‌చార్జి ఎల్‌వీ రామాంజనేయులు, సర్క్యులేషన్‌ ఇన్‌చార్జి సత్యనారాయణ, ప్రకటనల విభాగం ఇన్‌చార్జి చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2026 | 01:01 AM