Share News

నత్తనడకన యూనిటీ మాల్‌

ABN , Publish Date - Mar 19 , 2026 | 01:47 AM

చేతివృత్తుల వారి ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టిన యూనిటీ మాల్‌ నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. కేంద్రం నిధులు ఇచ్చినా పనుల విషయంలో స్థానిక అధికారులు విఫలమయ్యారు.

నత్తనడకన యూనిటీ మాల్‌

నిర్మాణంలో తీవ్ర జాప్యం

నెలాఖరులోగా యూసీలు

సమర్పించాలని సీఎం ఆదేశం

లేనిపక్షంలో నిధులు మురిగిపోయే ప్రమాదం

పనులు చేయకుండా ఎలా..?

అధికారుల మల్లగుల్లాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

చేతివృత్తుల వారి ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టిన యూనిటీ మాల్‌ నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. కేంద్రం నిధులు ఇచ్చినా పనుల విషయంలో స్థానిక అధికారులు విఫలమయ్యారు.

భీమిలి బీచ్‌ రోడ్డులో రామానాయుడు స్టూడియో సమీపాన సర్వే నంబరు 426/2లో ఐదు ఎకరాలు దీనికి కేటాయించారు. నిర్మాణ వ్యయం రూ.172 కోట్లు. టెండర్లు పిలవగా కేపీసీ ప్రాజెక్ట్స్‌ సంస్థ రూ.113.93 కోట్లకే భవన నిర్మాణం పూర్తి చేస్తామని టెండర్‌ దక్కించుకుంది. దీనికి జీఎస్‌టీ అదనం. 2025 ఏప్రిల్‌ 30న దీనికి సంబంధించిన ఒప్పందం జరిగింది. పన్నెండు నెలల కాలంలో నిర్మాణం పూర్తిచేసి ఇవ్వాలనేది నిబంధన. కళాకారుల ఉత్పత్తులు విక్రయించుకోవడానికి 36 షాపులు, ఫుడ్‌ కోర్టులు, వస్తువుల ప్రదర్శనకు ఎగ్జిబిషన్‌ హాళ్లు నిర్మించేలా డిజైన్‌ చేశారు. ఐదు ఎకరాల విస్తీర్ణంలో 3.5 లక్షల చ.అ. విస్తీర్ణంలో గ్రౌండ్‌+నాలుగు అంతస్థులు నిర్మించడానికి ప్లాన్‌ ఆమోదించారు. అయితే దీనికి కేటాయించిన ప్రాంతం కొండ. దానిని తవ్వి పనులు చేపట్టాలి. వీటిని పర్యవేక్షించే బాధ్యత ఏపీఐఐసీకి అప్పగించారు. కేంద్రం తొలి విడత రూ.86 కోట్లు మంజూరు చేసింది. కాంట్రాక్ట్‌ అగ్రిమెంట్‌ ప్రకారం ఇంకో 40 రోజుల్లో భవనం పూర్తిచేసి ఇవ్వాలి. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే పునాదుల నిర్మాణం కూడా పూర్తికాలేదు. దీనిపై పార్లమెంటులో ఎంపీలు ప్రశ్నలు వేస్తుంటే నిర్మాణం చురుగ్గా జరుగుతోందని సమాధానం చెబుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత మూడు నెలల కాలంలో రెండుసార్లు సమీక్షించారు. తాజాగా వారం రోజుల క్రితం విజయవాడలో కలెక్లర్లతో నిర్వహించిన సమావేశంలో కూడా దీనిపై ప్రశ్నించారు. యూనిటీ మాల్‌కు తొలి విడత విధులైన నిధులకు సంబంధించిన యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు (యూసీ) ఈ మార్చి నెలాఖరులోగా సమర్పించాలని, లేదంటే ఆ నిధులు మురిగిపోతాయని హెచ్చరించారు. అయితే అక్కడ పనులు జరగకుండా యూసీలు ఎలా ఇస్తారనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నిర్మాణంపై ప్రజా ప్రతినిధులు ఎవరూ సమీక్షించడం లేదు. పట్టుబట్టి అధికారులతో పనిచేయిస్తే త్వరగానే పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ ఎవరూ అక్కడికి వెళ్లి పనులు పరిశీలించడం లేదు. ఇప్పటికైనా ఒక నిర్దేశిత గడువు పెట్టుకొని పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.

Updated Date - Mar 19 , 2026 | 01:47 AM