నగరానికి కేంద్ర రక్షణ మంత్రి
ABN , Publish Date - Feb 20 , 2026 | 01:27 AM
అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడానికి నగరానికి విచ్చేసిన కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఘన స్వాగతం లభించింది.
గోపాలపట్నం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి):
అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడానికి నగరానికి విచ్చేసిన కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఘన స్వాగతం లభించింది. గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో విశాఖ ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకున్న ఆయనకు జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ, నావికాదళ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో నగరానికి బయలుదేరి వెళ్లారు.
సంకల్ప కళా గ్రామానికి నేవీ ప్రతినిధులు
నేడు సందర్శన
టైఅండ్‌డై వర్క్‌షాపులో పాల్గొననున్న డెలిగేట్స్
పెందుర్తి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి):
అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి విచ్చేసిన నౌకాదళ ప్రతినిధులు శుక్రవారం పెందుర్తి మండలం పెదగాడిలోని సంకల్ప కళా గ్రామాన్ని సందర్శించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇక్కడ జరగనున్న వర్క్‌షాప్‌లో నేవీ కమాండెంట్లు పాల్గొంటారు. ఈ మేరకు ఆర్ట్ విలేజ్‌ను సుందరీకరించామని నిర్వాహకుడు ఆకుల చలపతిరావు తెలిపారు. ఇక్కడి చేనేత ప్రక్రియను పరిశీలిస్తారు. ఎద్దు గానుగ (చెక్క గానుగ)తో నూనె తయారీ, సహజసిద్ధ రంగులతో రూపొందించిన కొయ్యబొమ్మలు, సేంద్రియ (ఆర్గానిక్) కూరగాయల సాగు, ప్రకృతి సిద్థమైన ఉత్పత్తులు పరిశీలిస్తారు. సహజసిద్ధ రంగుల తయారీ ప్రక్రియ, రంగుల అద్దకం విధానాన్ని తెలుసుకుంటారు. భారతీయ సంస్కతి, సంప్రదాయాలు విదేశీయులకు అవగతమయ్యేలా కార్యక్రమాలు రూపొందించామని చలపతిరావు వివరించారు. టైఅండ్‌డై వర్క్‌షాప్‌లో భాగంగా నేవీ ప్రతినిధులు స్వహస్తాలతో వస్త్రాలు నేసి, సహజ సిద్ధ రంగులు అద్దుతారు.
ఏమిటీ సంకల్ప గామం
చేనేత, పర్యావరణానికి మేలు చేయాలనే సంకల్పంతో ప్రకృతి ప్రేమికుడు ఆకుల చలపతిరావు 2013లో పెదగాడిలో సంకల్ప కళా గ్రామాన్ని ఏర్పాటుచేశారు. గ్రామీణులకు ఉపాధి కల్పించడం, హస్తకళలు, ప్రకృతి కారకాలతో చేనేత వస్త్రాల తయారీ, సహజసిద్ధ రంగుల ఉత్పత్తి, ప్రకృతి సేద్యం, నర్సరీ, కొయ్యబొమ్మల రూపకల్పన వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ గ్రామాన్ని నేవీ ప్రతినిధులు సందర్శించనున్నారు. ఈ సందర్భంగా సీఐ కేవీ సతీశ్‌కుమార్ ప్రత్యేక భద్రత ఏర్పాట్లుచేశారు.