భూగర్భ విద్యుత్‌తో నిరంతర సరఫరా
ABN , Publish Date - Oct 31 , 2026 | 01:08 AM
హుద్‌హుద్ తుఫాన్ తరువాత నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
రూ.772 కోట్లతో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పనులు పూర్తి
అక్కడ ఆర్నబ్ సమయంలో ఇక్కట్లు లేవు
రూ.973.44 కోట్లతో రెండో దశ పనులు
అవి కూడా పూర్తయితే తుఫాన్లు వచ్చినా సరఫరాకు ఎటువంటి అంతరాయం ఉండదంటున్న అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
హుద్‌హుద్ తుఫాన్ తరువాత నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దానివల్ల ఆర్నబ్ వంటి తుఫాన్లు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా జరిగింది.
హుద్‌హుద్ (2014) తుఫాన్ వచ్చినప్పుడు విశాఖపట్నం అల్లాడిపోయింది. ఎక్కడికక్కడే చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయి నాలుగు రోజులు సరఫరా లేక నగర ప్రజలు నరకం చూశారు. అప్పుడు ఇక్కడకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మళ్లీ తుఫాన్లు వస్తే విశాఖలో విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా ఉండేలా భూగర్భంలో విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటును ప్రతిపాదించారు. స్తంభాలు, వాటికి వేలాడే తీగలు లేకుండా కేబుళ్లన్నీ భూగర్భంలోనే వేస్తే ఎంత తీవ్ర పెనుగాలులు వీచినా ఇబ్బంది ఉండదని అధికారులకు సూచించారు. అయితే నగరం అంతా ఒకేసారి పనులు చేయాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని దశల వారీగా పనులు చేపట్టాలని సూచించారు. తొలిదశలో సముద్ర తీరానికి దగ్గరగా 29 ప్రాంతాల్లో 675 కి.మీ. పొడవున భూగర్భ కేబుల్ వేయడానికి ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రూ.772 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టింది. వన్‌టౌన్, ఆర్‌కే బీచ్, సిరిపురం, పాండురంగాపురం, ఈస్ట్‌పాయింట్ కాలనీ, ఎంవీపీ కాలనీల్లోని కొన్ని ప్రాంతాల్లో పనులు పూర్తి చేశారు.
రూ.973.44 కోట్లతో రెండో దశ పనులు
రెండో విడతలో నగరం మొత్తం భూగర్భంలో విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకు రూ.973.44 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా 876 కి.మీ. పొడవున కేబుళ్లు వేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం ప్రారంభమైన పనులకు వివిధ శాఖల నుంచి అనుమతులు రావడంలో కొంత జాప్యం జరిగింది. ఇప్పటివరకూ 750 కి.మీ. పొడవున విద్యుత్ లైన్లు వేశారు. హెచ్‌బీ కాలనీ, పోర్టు ఆస్పత్రి, పోర్టు స్డేడియం వెనుక రహదారి, హనుమంతవాక నుంచి వెంకోజీపాలెం, ఎంవీపీ కాలనీలోని కొన్ని ప్రాంతాలు, తెన్నేటి నగర్ నుంచి మాధవధార, షీలానగర్, చినగంట్యాడ నుంచి జగ్గు సెంటర్, బీసీ రోడ్డు నుంచి భానోజీతోట, శ్రీహరిపురం-ములగాడ, ఆటోనగర్ పారిశ్రామిక ప్రాంతం, వీఎస్‌ఈజెడ్, కూర్మన్నపాలెం, వడ్లపూడి, పెదగంట్యాడ, గంగవరం పోర్టు ప్రాంతాల్లో ఈ పనులు చేపట్టారు. అలాగే సింహాచలం బీఆర్‌టీఎస్ మార్గం, ఎండాడ-హనుమంతవాక, భీమిలి బీచ్‌రోడ్డు, అడివివరం-గుర్రంపాలెం, పెందుర్తి, సుజాతనగర్, రాంపురం, మధురవాడ, పీఎం పాలెం, ఎండాడ, డెయిరీ ఫారం, ఆరిలోవ, పైనాపిల్ కాలనీ, పులగలపాలెం ప్రాంతాల్లో పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇంకొద్ది రోజుల్లో ఇవి పూర్తికానున్నాయి.
ఆ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం లేదు
సింహాచలం నాయుడు, ఎస్‌ఈ, విశాఖ సర్కిల్
ఇప్పటివరకూ ఎక్కడైతే భూగర్భ విద్యుత్ కేబుళ్లు వేశామో ఆయా ప్రాంతాల్లో మూడు రోజుల క్రితం ఆర్నబ్ తుఫాన్ వల్ల వీచిన గాలులకు ఎటువంటి అంతరాయం ఏర్పడలేదు. అక్కడ పడిపోవడానికి విద్యుత్ స్తంభాలు, తెగిపోవడానికి విద్యుత్ వైర్లు లేకపోవడం కలిసి వచ్చింది. గంటకు 100 కి.మీ. వేగంతో గాలులు వీచినా విద్యుత్ సరఫరా ఇచ్చాం. మిగిలిన ప్రాంతాల్లోను పనులు పూర్తయితే తుఫాన్లు వస్తే ఇక ఇబ్బందే ఉండదు.