Share News

పల్లెలకు నిరంతర విద్యుత్‌ వెలుగులు!

ABN , Publish Date - Apr 19 , 2026 | 01:13 AM

పల్లె ప్రాంతాల్లో కరెంట్‌ కష్టాలు తీరనున్నాయి. గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా ఎప్పుడు ఉంటుందో?... ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి ఉండగా, త్వరలో ఆ కష్టాలు తీరి గ్రామీణ ప్రాంతాలకు మంచి రోజులు రానున్నాయి.

పల్లెలకు నిరంతర విద్యుత్‌ వెలుగులు!
పెదబొడ్డేపల్లి కూడలిలో ధర్మసాగరం గ్రామానికి 24 గంటల విద్యుత్‌ కోసం టవర్‌ లైన్‌ వేస్తున్న దృశ్యం

- 24 గంటల సరఫరాకు టవర్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు

- ఆర్‌డీఎస్‌ఎస్‌ పథకం కింద రెండేళ్ల క్రితం రూ.129 కోట్లు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం

- నర్సీపట్నం డివిజన్‌లో 65 శాతం పనులు పూర్తి

- వచ్చే ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యం

నర్సీపట్నం, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): పల్లె ప్రాంతాల్లో కరెంట్‌ కష్టాలు తీరనున్నాయి. గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా ఎప్పుడు ఉంటుందో?... ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి ఉండగా, త్వరలో ఆ కష్టాలు తీరి గ్రామీణ ప్రాంతాలకు మంచి రోజులు రానున్నాయి. ఏపీఈపీడీసీఎల్‌ నర్సీపట్నం డివిజన్‌ పరిధిలో నర్సీపట్నం, మాడుగుల, చోడవరం నియోజకవర్గాల్లోని 12 మండలాలు, పాయకరావుపేట నియోజకవర్గంలో కోటవురట్ల మండలం ఉన్నాయి. ఈ 13 మండలాల్లోని పంచాయతీల్లో గల మారుమూల గ్రామాల్లో సైతం నిరంతర విద్యుత్‌ సరఫరా చేసే దిశగా వేగంగా పనులు జరుగుతున్నాయి.

ఏపీఈపీడీసీఎల్‌ నర్సీపట్నం డివిజన్‌ పరిధిలోని 13 మండలాల్లో కేంద్ర ప్రభుత్వం రూ.129 కోట్లతో 2024 ఏప్రిల్‌లో రివాంపెడ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీమ్‌ (ఆర్‌డీఎస్‌ఎస్‌) పథకం కింద విద్యుత్‌ పనులు ప్రారంభించింది. ఇప్పటికి 65 శాతం పనులు పూర్తయ్యాయి, వచ్చే ఏడాదిలోగా పనులు పూర్తి చేసి గ్రామాలకు నిరంతరం విద్యుత్‌ సరఫరా చేయనున్నారు. ఈ మేరకు విద్యుత్‌ శాఖాధికారులు పనులను వేగవంతం చేశారు. డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు(డీటీఆర్‌), సబ్‌ స్టేషన్‌ వాక్యూమ్‌ సర్క్యూట్‌ బ్రేకర్లు (వీసీపీ), 24 గంటల విద్యుత్‌ సరఫరా టవర్‌ లైన్‌ పనులు చేపడుతున్నారు. నర్సీపట్నం డివిజన్‌లో 529 ట్రాన్స్‌ఫార్మర్లు అమర్చవలసి ఉండగా ఇప్పటికి 300 ఏర్పాటు చేశారు. గ్రామాల్లో 33,184 విద్యుత్‌ స్తంభాలు, 16 టవర్‌ లైన్లు వేశారు. 3,215 కిలోమీటర్ల్ల మేర విద్యుత్‌ సరఫరా లైన్‌ వేశారు. ఇంకా 600 కిలోమీటర్లు పూర్తి చేయాల్సి ఉందని అధికారులు చెప్పారు. గ్రామాల్లో గృహ వినియోగం, వ్యవసాయ విద్యుత్‌ సరఫరా లైన్లు వేరు చేస్తారు. ఇప్పటి వరకు ఒకే లైన్‌ మీద వ్యవసాయానికి, గృహ వినియోగానికి విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. ఆర్‌డీఎస్‌ఎస్‌ పనులు పూర్తి చేసిన తర్వాత వ్యవసాయానికి 9 గంటలు, గృహ వినియోగానికి 24 గంటలు చొప్పున రెండు లైన్లు ద్వారా వేర్వేరుగా విద్యుత్‌ సరఫరా చేస్తారు. నాణ్యమైన విద్యుత్‌ సరఫరా ఉండడం వలన పల్లె ప్రాంతాల్లో పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యువత ఉపాధి కోసం పట్టణాలకు వలస పోకుండా సొంతూరిలోనే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.

Updated Date - Apr 19 , 2026 | 01:13 AM