Share News

రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:51 AM

మండలంలోని పీఎల్‌ పురం వద్ద గురువారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. దీనికి సంబంధించి తుని ప్రభుత్వ రైల్వే పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ సత్తిబాబు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.

రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

పాయకరావుపేట, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పీఎల్‌ పురం వద్ద గురువారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. దీనికి సంబంధించి తుని ప్రభుత్వ రైల్వే పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ సత్తిబాబు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. గురువారం ఉదయం తుని ప్రభుత్వ రైల్వే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తుని, గుల్లిపాడు రైల్వే స్టేషన్ల మధ్య పాయకరావుపేట మండలంలోని పీఎల్‌ పురం వద్ద విశాఖ నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఒక రైలు నుంచి సుమారు 55 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తూ జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని వద్ద ఎటువంటి ఆధారాలు లేవని, సుమారు 5.5 అడుగుల ఎత్తుఉన్న అతని ఒంటిపై బ్లూ కలర్‌ జీన్‌ ఫ్యాంటు, డార్క్‌ బ్లూ గడుల ఫుల్‌ హ్యాండ్స్‌ షర్టు ఉన్నాయన్నారు. అతని కుడిచేతిపై జి.రాణి అనే పేరు ఇంగ్లీషు అక్షరాలు కలిగి ఉండి పైన ఓం అని పచ్చబొట్టు ఉందని ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రిలోని మార్చురీరూమ్‌లో భద్రపరిచామని, జరిగిన సంఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మృతుడి వివరాలు తెలిసినవారు తుని రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో సంప్రతించాలని ఆయన తెలిపారు.

అప్పుల బాధతో ఆత్మహత్య

సబ్బవరం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): అప్పులు అధికంగా చేసి దానిని తీర్చలేక మానసిక ఒత్తిడికి గురైన ఒక వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని అసకపల్లి శివారు ఎరుకునాయుడుపాలెం గ్రామా నికి చెందిన గవర నీలకంఠేశ్వరరావు(30) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం పైడివాడకు చెందిన జ్యోతితో అతనికి వివాహమైంది. వారికి కుమార్తె ఉంది. కాగా పైడివాడ బీసీ కాలనీలో అనారోగ్యంతో ఉన్న అమ్మమ్మను చూసుకోవడానికి జ్యోతి వారం రోజుల క్రితం వెళ్లింది. ఆమెతో పాటు నీలకంఠేశ్వరరావు కూడా వెళ్లాడు. అయితే ఈ నెల 19న రాత్రి ఇంటికి రాలేదు. దీంతో జ్యోతి తన ఆడపడుచుకు ఫోన్‌ చేసి వాకబు చేయగా తమ వద్దకు రాలేదని చెప్పింది. గురువారం ఉదయం బీసీ కాలనీకి సమీపంలోని మామిడి తోటలో నీలకంఠేశ్వరరావు ఉరేసుకొని మృతి చెందినట్టు స్థానికుల ద్వారా తెలిసి వెళ్లింది. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వివరాలు సేకరించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. తన భర్త అధికంగా అప్పులు చేశాడని, ఆ అప్పులు తీర్చేలేక కొంత కాలంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో జ్యోతి పేర్కొంది. కేసు నమోదు చేసి సీఐ జి.రామచంద్రరావు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 21 , 2026 | 12:51 AM