జోగంపేటలో ఏర్పాటుకాని పాఠశాల
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:19 AM
మండలంలోని రాజేంద్రపాలెం పంచాయతీ జోగంపేట గ్రామంలో పాఠశాల లేకపోవడంతో సుమారు 30 మంది బడిఈడు పిల్లలు అక్షరజ్ఞానికి దూరమయ్యారు.
అగమ్యగోచరంగా 30 మంది పిల్లల భవిష్యత్తు
కొయ్యూరు, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రాజేంద్రపాలెం పంచాయతీ జోగంపేట గ్రామంలో పాఠశాల లేకపోవడంతో సుమారు 30 మంది బడిఈడు పిల్లలు అక్షరజ్ఞానికి దూరమయ్యారు. మండల కేంద్రానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ గ్రామంలో సుమారు 50 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ కుటుంబాల్లో దాదాపు 30 మంది బడిఈడు పిల్లలు వున్నారు. గ్రామంలో కనీసం ప్రత్యామ్నాయ పాఠశాల కూడా లేకపోవడంతో మూడు కిలోమీటర్ల దూరంలో వున్న సోలాబు గ్రామంలోని పాఠశాలకు వెళ్లి రావాలి. రోజూ ఆరు కిలోమీటర్లు నడవలేక చదువుకు దూరమయ్యారు. తల్లిదండ్రులు కూడా పాఠశాలకు వెళ్లాలని ఒత్తిడి చేయలేకపోతున్నారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం కనీసం ప్రత్యామ్నాయ పాఠశాల అయినా ఏర్పాటు చేయాలని పలుమార్లు విద్యా శాఖ అధికారులకు విజ్ఞప్తి చేసినా.. ఫలితం లేకపోయిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. కాగా జోగంపేటలో పాఠశాల లేకపోవడంపై ఎంఈవో రాంబాబును వివరణ కోరగా.. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రత్యామ్నాయ పాఠశాలను ఏర్పాటు చేసి వలంటీరును నియమించామని, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రత్యామ్నాయ పాఠశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపలేదని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రత్యామ్నాయ పాఠశాల ఏర్పాటుకు చర్యలు తీసుకొంటామని తెలిపారు.