Share News

యథేచ్ఛగా గోవుల అక్రమ రవాణా

ABN , Publish Date - Jul 21 , 2026 | 12:50 AM

నగరం మీదుగా గోవుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. ఒడిశా నుంచి విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి జిల్లాల్లోని సంతలకు వచ్చే ఆవులను వాహనాల్లో తమిళనాడు, కేరళలోని పశువధ శాలలకు తరలిస్తున్నారు.

యథేచ్ఛగా గోవుల అక్రమ రవాణా

విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి జిల్లాల నుంచి తమిళనాడు, కేరళకు తరలింపు

శ్రీకాకుళం నుంచి తుని వరకు మూడు పాసింగ్‌లు

ఒక్కో పాసింగ్‌లో ఆవుకు రూ.500 చొప్పున వసూలు

పోలీస్‌, రవాణా శాఖ అధికారుల సహకారం

ఉత్తరాంధ్రకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి అండదండలు

నెలకు రూ.20 లక్షల తీసుకుంటున్నట్టు ప్రచారం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరం మీదుగా గోవుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. ఒడిశా నుంచి విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి జిల్లాల్లోని సంతలకు వచ్చే ఆవులను వాహనాల్లో తమిళనాడు, కేరళలోని పశువధ శాలలకు తరలిస్తున్నారు. ఈ మాఫియాకు పోలీస్‌, రవాణా, పశు సంవర్ధక శాఖల అధికారుల సహకారంతోపాటు కొంతమంది ప్రజా ప్రతినిధుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పశువుల రవాణా మాఫియా నుంచి ఉత్తరాంధ్రలోని ఒక ప్రజా ప్రతినిధికి నెలకు రూ.20 లక్షలు మామూళ్లు అందుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.

ఉత్తరాంధ్రలో గోవుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని హిందూ సంఘాలు ఉద్యమిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ నుంచి రైతులు ఆవులను శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని సంతలకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. కొందరు వ్యాపారులు ఏకంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. అక్కడి నుంచి వాహనాల్లో నగరంలోని గోవధశాలలతోపాటు తమిళనాడు, కేరళ తరలిస్తున్నారు. గోవులను అక్రమంగా తరలించడం, వధించడం చట్ట విరుద్ధం. అయినప్పటికీ కొందరు కాసులకు కక్కుర్తిపడి దీనిని వ్యాపారంగా మార్చుకున్నారు. రైతులు ఎవరైనా సంతల్లో గోవులను కొనుగోలు చేసినట్టయితే రవాణా నిమిత్తం పశు సంవర్ధక శాఖ అనుమతితోపాటు ఆవు ఆరోగ్యంగా ఉందని పశు వైద్యుడి ధ్రువీకరణ తప్పనిసరి తీసుకోవాలి. కానీ కొందరు వ్యాపారులు పశు సంవర్ధక శాఖ అధికారులతోపాటు పశు వైద్యులకు డబ్బులు ఆశచూపించి తప్పుడు పత్రాలను సంపాదిస్తున్నారు. మరికొందరు ఎలాంటి పత్రాలు లేకుండానే తరలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా గోవులు తరలిస్తే పోలీసులు, రవాణా శాఖ అధికారులు తనిఖీ చేసి వాహన యజమాని, ఆవులను కొనుగోలు చేసిన వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్‌ చేసే అధికారం ఉంటుంది. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించవచ్చు. అయితే గోవుల అక్రమ రవాణా మాఫియా ఆయా విభాగాల అధికారులను కూడా మామూళ్లతో వశపరచుకున్నాయి. ఎవరైనా వాహనాలను పట్టుకుని అప్పగిస్తే తప్పకుండా కేసు నమోదుచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ప్రజా ప్రతినిధులతో చెప్పించుకోవాలని వ్యాపారులకు పోలీసులే సలహా ఇస్తున్నారు. దీంతో పశువుల అక్రమ రవాణాకు అడ్డులేకుండాపోయింది. చీకటిపడగానే పదుల సంఖ్యలో బొలేరో వాహనాలు, ఐషర్‌ వ్యాన్‌ల్లో ఆవులను కుక్కేసి మరీ తమిళనాడు, కేరళ తరలించేస్తున్నారు.

పాసింగ్‌ల పేరుతో దందా

పశువుల అక్రమ రవాణాకు అడ్డులేకుండా చూస్తామని ఉత్తరాంధ్రలోని కొందరు ప్రజా ప్రతినిధుల అనుచరులు ‘పాసింగ్‌’ పేరుతో దందాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇచ్ఛాపురం నుంచి భోగాపురం వరకు ఒకటి, భోగాపురం నుంచి అనకాపల్లి వరకు మరొకటి, అనకాపల్లి నుంచి తుని వరకు మరొకపాసింగ్‌ పేరుతో పరిధులు నిర్ణయించారు. ఒక్కో పాసింగ్‌ వద్ద దళారులు డబ్బులు వసూలు చేస్తున్నారు. పశువుల వాహనాలను పోలీసులు, రవాణా శాఖ అధికారులు ఆపకుండా చూస్తామని హామీ ఇచ్చి, ఒక్కో గోవుకు రూ.500 చొప్పున తీసుకుంటున్నారు. ఇలా నెలంతా వసూలుచేసిన మొత్తంలో కొంత సంబంధిత పరిధిలోని పోలీసులు, రవాణా శాఖ అధికారులకు ఇస్తున్నారు. మిగిలిన మొత్తంలో కొంత ప్రజా ప్రతినిధులకు ఇచ్చి సంతృప్తి పరుస్తున్నారు. ఎప్పుడైనా హిందూ, గో పరిరక్షణ సంఘాలు గుర్తించి పోలీసులకు అప్పగిస్తే తర్వాత విడిచిపెట్టేలా ప్రజాప్రతినిధులతో ఫోన్‌లు చేయిస్తున్నారు. పట్టించినవారికి పోలీసులు ఇదే చెబుతున్నారు.

‘కీలక’ వ్యక్తికి నెలకు రూ.20 లక్షలు

గోవుల అక్రమ రవాణాకు సహకరిస్తున్న ఉత్తరాంధ్రలోని ఒక ప్రజా ప్రతినిధికి నెలకు రూ.20 లక్షలు అందుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ ప్రజాప్రతినిధి అనుచరులే భోగాపురం నుంచి తుని వరకు పాసింగ్‌ నిర్వహిస్తున్నట్టు వాహన సిబ్బంది చెబుతున్నారు. తుని నుంచి మరో పాసింగ్‌ నెట్‌వర్క్‌ ఉంటుందని, అక్కడి వరకు దాటించే బాధ్యత వీరు చూసుకుంటారని చెబుతున్నారు.

Updated Date - Jul 21 , 2026 | 12:50 AM