మారని ఏయూ దూర విద్య తీరు
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:52 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం అధికారుల తీరు మారడం లేదు.
మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్న కళాశాలల్లో మళ్లీ పరీక్షల నిర్వహణ
ప్రైవేటు కళాశాలల స్థానే ప్రభుత్వ కళాశాలల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించాలని గతంలో నిర్ణయం
అమలులో వైఫల్యం
విశాఖపట్నం, జూలై 2 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం అధికారుల తీరు మారడం లేదు. అనేక పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరిగినట్టు గతంలో ఆరోపణలు వచ్చాయి. దాంతో కొన్ని కేంద్రాలను రద్దు చేశారు. అదే సమయంలో పరీక్షా కేంద్రాల సంఖ్యను తగ్గించాలని, ప్రైవేటు కాలేజీలను తప్పించి ప్రభుత్వ కాలేజీల్లో నిర్వహించాలనే ఆలోచన చేశారు. అయితే, ఆ నిర్ణయాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేశారు.
దూర విద్యా కేంద్రం ఆధ్వర్యంలో గత నెల 29 నుంచి డిగ్రీ, పీజీ కోర్సులకు సంబంధించిన పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు ఇటు శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం జిల్లా వరకు 85 కేంద్రాలను అధికారులు ఎంపిక చేశారు. వాటిలో అనేకచోట్ల మాస్ కాపీయింగ్ జరుగుతోందన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. అయినప్పటికీ అధికారులు ఆయా కేంద్రాల్లో మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం కల్పించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటిల్లో కొన్ని కాలేజీల్లో విద్యార్థులకు పుస్తకాలు ఇచ్చి రాయిస్తుంటారని చెబుతుంటారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించుకోరు. అలాగే, ఒకే ప్రాంతంలో రెండేసి కాలేజీలను కేంద్రాలుగా ఎంపిక చేశారు. విజయనగరంలో మహారాజా కాలేజీతో పాటు మరో ప్రైవేటు కాలేజీకి సెంటర్ ఇచ్చారు. గజపతినగరంలోనూ రెండు కాలేజీలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు. శ్రీకాకుళం, తాడేపల్లితోపాటు మరికొన్ని ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలపై ఆరోపణలు ఉన్నాయి. డిగ్రీ, పీజీ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 76 వేల మంది హాజరవుతున్నారు. పరీక్షల నిర్వహణ గురించి దూర విద్యా కేంద్రం డైరెక్టర్ అప్పలనాయుడు మాట్లాడుతూ ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా చూస్తున్నామని, ఎనిమిది ప్రత్యేక బృందాలతో కూడిన స్పెషల్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు.