Share News

జడ్పీపై సందిగ్ధం

ABN , Publish Date - Aug 13 , 2026 | 01:12 AM

ప్రతి జిల్లాలో జడ్పీ కార్యాలయం ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది.

జడ్పీపై సందిగ్ధం

విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతంలో కేవలం నాలుగు మండలాలే...

వాటితోనే జిల్లా పరిషత్‌ కొనసాగించవచ్చునంటున్న అధికారులు

రెండు సెక్షన్లు, పది నుంచి 15 మంది సిబ్బంది...

మరోవైపు ఆ నాలుగు మండలాలను జీవీఎంసీలో విలీనం చేయాలని ప్రతిపాదన

సీఈవోల సమావేశంలో స్పష్టత

విశాఖపట్నం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి):

ప్రతి జిల్లాలో జడ్పీ కార్యాలయం ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఇదే విషయమై రెండు రోజుల క్రితం విజయవాడలో జరగాల్సిన సీఈవోల సమావేశం అనివార్య కారణాలతో వాయిదా పడింది. అయితే కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు జిల్లాల నుంచి తెప్పించుకున్న ఉన్నతాధికారులు, వాటి ప్రకారం కార్యాచరణకు ఉపక్రమించారు. దీనిలో భాగంగా ఎక్కువ జనాభా ఉన్న మండలాలను గుర్తించి కొత్తగా మండలం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. అందుకు గురువారం వరకూ గడువు ఇచ్చారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలో కొత్త మండలాల ఏర్పాటు ప్రతిపాదన ఏదీ లేదని తెలిసింది. కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటుకు అవసరమైన ప్రాథమిక సమాచారం జిల్లాల నుంచి తెప్పించుకున్న ఉన్నతాధికారులు కసరత్తు పూర్తిచేసేలోగా సీఈవోల సమావేశం నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు కొత్త జడ్పీల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం జడ్పీలో ఎనిమిది సెక్షన్లు ఉండగా సుమారు 70 మంది పనిచేస్తున్నారు. జడ్పీ ప్రాంగణంలో గల ఈఈ, ఎస్‌ఈ కార్యాలయాల్లో మరికొంతమంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటివరకూ ఉన్న ఎనిమిది సెక్షన్లలో నాలుగింటిని అనకాపల్లిలో, మూడింటిని అల్లూరి జిల్లాకు తరలించనున్నారు. మిగిలిన ఒక సెక్షన్‌కు అదనంగా మరో సెక్షన్‌తో కలిసి రెండు సెక్షన్లు విశాఖ జిల్లాలో ఏర్పాటుచేయనున్నారు. విశాఖ జడ్పీలో పది నుంచి 15మంది వరకు (తాత్కాలిక సిబ్బందితో కలిపి) ఉండే అవకాశం ఉంది.

అయితే విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతంలో కేవలం నాలుగు మండలాలే ఉన్నాయి. అందులో రెండు (పెందుర్తి, భీమిలి) మండలాల్లో సగం వరకు జీవీఎంసీ పరిధిలో ఉన్నాయి. ఇటువంటి తరుణంలో నాలుగు మండలాలకు ఒక జడ్పీ కార్యాలయం ఏర్పాటు సాధ్యమేనా?...అంటే అధికారులు అవుననే సమాధానం ఇస్తున్నారు. బ్రిటిష్‌ పాలనలో విశాఖ జిల్లా కేంద్రంగా జిల్లా బోర్డులు ఉండేవి. స్వాతంత్య్రం తరువాత బల్వంతరాయ్‌ కమిటీ సిఫారసుల మేరకు జిల్లా పరిషత్‌లు ఏర్పాటుచేశారు. అంటే సుమారు ఆరున్నర దశాబ్దాల నుంచి కొనసాగుతున్న విశాఖ జిల్లా పరిషత్‌ను కాలగర్భంలో కలిపే కంటే నాలుగు మండలాలతో కొనసాగించడంలో తప్పు లేదని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న జడ్పీ కార్యాలయంలో వసతికి ఇబ్బంది లేదు. కొంతవరకు జడ్పీ సిబ్బంది వినియోగించుకుని, మిగిలిన భాగం పంచాయతీరాజ్‌ శాఖలోని ఇతర అనుబంధ కార్యాలయాలను కేటాయించే అవకాశం ఉంది. ఇదిలావుండగా ఆ నాలుగు గ్రామీణ మండలాలను పూర్తిగా జీవీఎంసీలో విలీనం చేయాలని మునిసిపల్‌ పరిపాలన శాఖ నుంచి ఒత్తిడి వస్తున్నా...పద్మనాభం, భీమిలి మండలాల్లోని శివారు ప్రాంత ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందనే వాదన ఉంది. ఒకవేళ కొత్త జిల్లా పరిషత్‌ ఏర్పాటైనట్టయితే జీవీఎంసీలో విలీన ప్రక్రియ నిలిచిపోయే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న సీఈవోల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని జడ్పీ ఉద్యోగులు చెబుతున్నారు.

Updated Date - Aug 13 , 2026 | 01:12 AM