Share News

విలీనంపై సందిగ్ధం

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:43 AM

జిల్లాలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాలను జీవీఎంసీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనపై అయోమయం నెలకొంది.

 విలీనంపై సందిగ్ధం

ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, భీమిలి మండలాలను పూర్తిగా జీవీఎంసీలో కలపాలని నేతల ప్రతిపాదన

ఇప్పటికే వార్డుల విభజన ప్రక్రియ ప్రారంభం

జనగణన ప్రక్రియ పూర్తయ్యేవరకూ విలీనం సాధ్యం కాదనే వాదన

నాలుగు మండలాలకు ప్రత్యేకంగా జడ్పీ కొనసాగింపు కష్టమంటున్న అధికారులు

ఏం చేస్తారోనని సర్వత్రా అయోమయం

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాలను జీవీఎంసీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనపై అయోమయం నెలకొంది. నగర పాలక సంస్థ పరిధిలోని 98 వార్డులను 120 వార్డులకు పెంచే ప్రక్రియ ఒకవైపు శరవేగంగా సాగుతోంది. ఈ సమయంలో నాలుగు మండలాల విలీనానికి అసలు అవకాశం ఉందా?, లేదా?...అనే అంశంపై విస్తృత చర్చ నడుస్తోంది.

విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతంలో ఆనందపురం, పద్మనాఽభం, భీమిలి, పెందుర్తి మండలాలు ఉన్నాయి. భీమిలి, పెందుర్తి మండలాల్లోని కొన్ని గ్రామాలు ఇప్పటికే జీవీఎంసీ పరిధిలో ఉన్నాయి. ఆ రెండు మండలాల్లో మిగిలిన పంచాయతీలతో పాటు ఆనందపురం, పద్మనాభం మండలాలను కూడా జీవీఎంసీలో విలీనం చేయాలని ఎమ్మెల్యే గంటాశ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ నాలుగు మండలాలను జీవీఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనను పరిశీలించాలని జీవీఎంసీని ప్రభుత్వం ఆదేశించింది. ఆ విషయాన్ని అధికారులు ఇంకా పరిశీలించకముందే జీవీఎంసీలోని 98 వార్డులను 120కి పెంచుతూ, వార్డుల విభజనను ఈనెల 26వ తేదీ నాటికి పూర్తిచేయాలని ఆదేశించింది. దీంతో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు వార్డుల విభజన ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలో ఆ నాలుగు మండలాల విలీనం లేనట్టేనని అందరూ భావించారు. కానీ, కేవలం నాలుగు మండలాల కోసం ప్రత్యేకంగా జిల్లా పరిషత్‌, డీఆర్‌డీఏ, వెల్ఫేర్‌ భవన్‌లను కొనసాగించడం సాధ్యం కాదని కొందరు అధికారులు చెబుతున్నారు. వాటిని పూర్తిగా జీవీఎంసీలో విలీనం చేయడం లేదంటే పద్మనాభం మండలాన్ని విజయనగరం జిల్లాలోనూ, భీమిలి,ఆనందపురం జీవీఎంసీలోనూ, పెందుర్తి మండలాన్ని అనకాపల్లి జిల్లాలో విలీనం చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా జనగణన జరుగుతున్నందున, కేంద్ర ప్రభుత్వం నిబంధన ప్రకారం స్థానిక సంస్థల్లోకి కొత్త ప్రాంతాల విలీనానికి అవకాశం ఉండదని మరికొందరు అధికారులు స్పష్టంచేస్తున్నారు. దీంతో జిల్లాలోని నాలుగు మండలాల భవితవ్యం ఏమిటనే దానిపై సందిగ్ధం నెలకొంది.

Updated Date - Apr 12 , 2026 | 12:43 AM