చోడ వరంపై సందిగ్ధం
ABN , Publish Date - Oct 26 , 2026 | 01:10 AM
స్థానిక జడ్పీటీసీకి కూటమి నుంచి ఎవరు బరిలో వుంటారన్న దానిపై నెలకొన్న ఉత్కంఠ అంతకంతకూ పెరిగిపోతున్నది. టీడీపీకి ఖాయంగా దక్కుతుందనుకున్న ఈ సీటును కూటమిలో మిత్రపక్షమైన బీజేపీ, జనసేన కూడా పట్టుబట్టాయి. ఒక దశలో బీజేపీకి కేటాయించినట్టు ప్రచారం సాగగా, తాజాగా జనసేనకు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్నది.
జడ్పీటీసీ టికెట్‌పై కూటమిలో కొనసాగుతున్న ఉత్కంఠ
తొలుత టీడీపీకి కేటాయింపు
తాజాగా తెరపైకి బీజేపీ, జనసేన
అమోమయానికి గురవుతున్న కేడర్
చోడవరం, అక్టోబరు 25 (ఆంఽధ్రజ్యోతి): స్థానిక జడ్పీటీసీకి కూటమి నుంచి ఎవరు బరిలో వుంటారన్న దానిపై నెలకొన్న ఉత్కంఠ అంతకంతకూ పెరిగిపోతున్నది. టీడీపీకి ఖాయంగా దక్కుతుందనుకున్న ఈ సీటును కూటమిలో మిత్రపక్షమైన బీజేపీ, జనసేన కూడా పట్టుబట్టాయి. ఒక దశలో బీజేపీకి కేటాయించినట్టు ప్రచారం సాగగా, తాజాగా జనసేనకు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్నది. దీంతో ఈ స్థానం ఏ పార్టీకి ఖరారవుతుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. టీడీపీ నుంచి జడ్పీటీసీ మాజీ సభ్యుడు కనిశెట్టి మత్స్యరాజు, పల్లా అర్జున్, వేగి శ్రీనివాసరావ నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో పల్లా అర్జున్, కనిశెట్టి మత్య్సరాజులపై ఐవీఆర్‌ఎస్ సర్వే కూడా నిర్వహించారు. అయితే బీజేపీ నుంచి కచ్చితంగా చోడవరం సీటు కావాలంటూ ఆ పార్టీ నేతల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ఆ పార్టీకి ఖరారైపోయిందంటూ శనివారం ప్రచారం సాగింది. బీజేపీ నుంచి బుచ్చెయ్యపేట మండలానికి చెందిన ఈర్లె శ్రీరామమూర్తి నామినేషన్ దాఖలు చేయగా, చోడవరం అభ్యర్థి ఆయనే అని భావించారు. ఒక దశలో టీడీపీ నుంచి నామినేషన్ వేసిన మత్యరాజు... బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తారన్న ప్రచారం కూడా సాగింది. ఈ గందరగోళం ఇలా కొనసాగుతుండగానే, జనసేన నుంచి చోడవరం స్థానం కావాలన్న డిమాండ్ పెరిగిందని, దీనికి ఆ పార్టీ అధిష్ఠానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, చోడవరం జనసేన ఖాతాలో చేరిపోతుందని అంటున్నారు. జనసేన తరపున జెర్రిపోతుల నానాజీ, పెనుపాత్రుని శ్రీనివాస్, నందారపు రమాదేవి నామినేషన్లు దాఖలు చేశారు. జనసేనకు కేటాయిస్తే జెర్రిపోతుల నానాజీ, శ్రీనివాస్‌లలో ఎవరో ఒకరు రంగంలో ఉండే అవకాశం ఉందని ఆ పార్టీవర్గాలు చెపుతున్నాయి. కాగా జడ్పీటీసీ స్థానం తనకు కేటాయించని పక్షంలో రెబల్‌గా కొనసాగేందుకు సిద్ధమంటూ పల్లా అర్జున్ అనుయాయులు తమ అసమ్మతిని పార్టీ అధినేతలకు పంపించినట్టు చెపుతున్నారు. జిల్లా స్థాయిలో నేతలు సమన్వయ చర్చల అనంతరం చోడవరం జడ్పీటీసీపై కూటమిలో నెలకొన్న సందిగ్ధానికి సోమవారం సాయంత్రం తెరపడే అవకాశాలున్నట్టు చెబతున్నారు.