Share News

అప్రకటిత కోతలు

ABN , Publish Date - Sep 11 , 2026 | 12:40 AM

వర్షాకాలంలో వేసవిని తలపించేలా ఎండలు కాస్తుండడంతో ఈపీడీసీఎల్‌ అధికారులు గ్రామాల్లో అనధికార విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. ప్రధానంగా రాత్రి సమయాల్లో వేళాపాళా లేకుండా కరెంటు తీసేస్తుండడంతో ఉక్కపోత, దోమల మోతతో జనం నిద్రలేకుండా జాగారం చేయాల్సి వస్తున్నది. సాధారణంగా వేసవిలో విద్యుత్‌ కోతలను అమలు చేస్తుంటారు.

అప్రకటిత కోతలు
వెంకన్నపాలెంలో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌

గ్రామాల్లో అనధికారికంగా విద్యుత్‌ సరఫరా నిలిపివేత

రాత్రిపూట మూడు గంటలకు పైగా పవర్‌కట్‌

ఉక్కపోత, దోమలతో జనం జాగారం

డిమాండ్‌కు తగిన సరఫరా లేదంటున్న అధికారులు

చోడవరం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలంలో వేసవిని తలపించేలా ఎండలు కాస్తుండడంతో ఈపీడీసీఎల్‌ అధికారులు గ్రామాల్లో అనధికార విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. ప్రధానంగా రాత్రి సమయాల్లో వేళాపాళా లేకుండా కరెంటు తీసేస్తుండడంతో ఉక్కపోత, దోమల మోతతో జనం నిద్రలేకుండా జాగారం చేయాల్సి వస్తున్నది. సాధారణంగా వేసవిలో విద్యుత్‌ కోతలను అమలు చేస్తుంటారు. కానీ ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం వేడిగాలులు వీస్తున్నాయి. చీకటి పడిన తరువాత వాతావరణం చల్లబడడం లేదు. దీంతో ఇళ్లల్లో ఫ్యాన్‌ తిరిగితే తప్ప ఉండలేని పరిస్థితి. ఏసీ ఉన్న ఇళ్లల్లో వాటిని వినియోగిస్తున్నారు. దీంతో అధికారులు అంచనా వేసినదానికన్నా ఎక్కువ విద్యుత్‌ వినియోగం జరుగుతున్నది. ఫలితంగా ఈపీడీసీఎల్‌ అధికారులు అనధికారికంగా విద్యుత్‌ కోతలు అమలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా రాత్రి ఎనిమిది గంటల నుంచి 11.30 గంటల వరకు విద్యుత్‌ సరఫరా వుండడంలేదు. భోజనాలు చేసి, నిద్రకు ఉపక్రమించే సమయంలో ఏకధాటిగా మూడున్నర గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేవరాపల్లి మండలంలో బుధవారం రాత్రి ఏడు గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు విద్యుత్‌ సరఫరా లేదు. ఉక్కపోత, దోమలు బెడదతో చిన్నపిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బంది పడ్డారు. గత వారం రోజుల నుంచి నిత్యం రాత్రి ఏడు గంటలకు పోతున్న కరెంటు పది గంటల లోపు రావడం లేదని పలు గ్రామాల ప్రజలు చెబుతున్నారు.

మండల కేంద్రాల్లో విద్యుత్‌ కోతలు అర గంట నుంచి గంట వరకే విధిస్తుండగా... ఇతర గ్రామాల్లో మాత్రం మూడు గంటలకుపైగా కరెంటు తీసేస్తున్నారు. వర్షాలు సాధారణ స్థాయిలో కురిసి వుంటే వాతావరణం చల్లగా వుండేదని, కానీ ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులకుతోడు వేసవిని తలపించేలా ఎండలు కాస్తుండడంతో కొద్దిసేపు కరెంటు లేకపోయినా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఫ్యాన్‌ తిరగడం ఆగితేచాలు.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

గ్రామాల్లో విద్యుత్‌ కోతలపై ఈపీడీసీఎల్‌ సిబ్బందిని ప్రశ్నిస్తే.. సరైన సమాధానం ఇవ్వడం లేదని వెంకన్నపాలెం గ్రామానికి చెందిన సియ్యాద్రి జగదీశ్‌ ఆరోపిస్తున్నారు. అయితే ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది కనీసస్థాయిలో కూడా వర్షాలు కురవకపోగా, వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకుపైబడి నమోదు అవుతుండడంతో విద్యుత్‌ వాడకం పెరిగిందని, డిమాండ్‌ మేరకు విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో లోడ్‌ రిలీఫ్‌ పేరుతో కరెంటు కోతలు విధించాల్సి వస్తున్నదని ఈపీడీసీఎల్‌ అధికారులు వివరణ ఇస్తున్నారు.

Updated Date - Sep 11 , 2026 | 12:40 AM