Share News

తగ్గని జలాశయాల ఉధృతి

ABN , Publish Date - Nov 02 , 2026 | 01:12 AM

మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి నీరందించే డుడుమ, జోలాపుట్టు జలాశయాల్లో నీటి ఉధృతి తగ్గుముఖం పట్టడం లేదు. ఆయా జలాశయాలకు వరదనీరు ఇన్‌ఫ్లో ఎక్కువగా రావడంతో బలిమెలకు నీటి విడుదలను కొనసాగిస్తున్నారు.

తగ్గని జలాశయాల ఉధృతి
డొంకరాయి జలాశయం నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్న దృశ్యం

- కొనసాగుతున్న నీటి విడుదల

ముంచంగిపుట్టు/సీలేరు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి నీరందించే డుడుమ, జోలాపుట్టు జలాశయాల్లో నీటి ఉధృతి తగ్గుముఖం పట్టడం లేదు. ఆయా జలాశయాలకు వరదనీరు ఇన్‌ఫ్లో ఎక్కువగా రావడంతో బలిమెలకు నీటి విడుదలను కొనసాగిస్తున్నారు.

జోలాపుట్టు జలాశయంలో 2,750 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా, ఆదివారం 2,745.85 అడుగులకు చేరింది. ప్రస్తుతం ఈ జలాశయానికి ఆరు వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తుందని, 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతంలో గల డుడుమకు విడుదల చేస్తున్నామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. డుడుమ జలాశయంలో 2,590 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం 2,583.5 అడుగుల కు చేరింది. ఇక్కడ నుంచి దిగువ ప్రాంతంలో ఉన్న బలిమెలకు 15 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో మూడు జనరేటర్ల సహాయంతో 51 మెగావాట్ల విద్యుదుత్పాదన జరుగుతున్నది.

సీలేరు కాంప్లెక్సు పరిధిలో...

సీలేరు కాంప్లెక్సు పరిధిలోని జలవిద్యుత్‌ కేంద్రాలకు ప్రధాన జలాశయమైన బలిమెల జలాశయం నుంచి ఆదివారం సాయంత్రం నుంచి ఆరు వేల క్యూసెక్కుల నీటిని గుంటవాడ జలాశయంలోకి ఒడిశా అధికారులు విడుదల చేస్తున్నట్టు సీలేరు కాంప్లెక్సు ఏపీ జెన్‌కో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ జాకీర్‌ హుస్సేన్‌ తెలిపారు. బలిమెల జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 1,516 అడుగులు కాగా, ఆదివారం సాయంత్రానికి 1,510.5 అడుగులకు చేరుకోవడంతో రెండు గేట్లు ఎత్తి ఆరు వేల క్యూసెక్కులు గుంటవాడ జలాశయానికి విడుదల చేస్తున్నారు. గుంటవాడ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,360 అడుగుల కాగా, 1,340 అడుగుల నీటిమట్టం కొనసాగేలా జెన్‌కో అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం గుంటవాడలో 1,338.2 అడుగుల నీటిమట్టం ఉంది. 1,340 అడుగుల నీటిమట్టానికి చేరితే గుంటవాడ జలాశయం నుంచి కూడా ఆరు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి ఇంజనీర్లను, సిబ్బందిని అప్రమత్తం చేశామని ఎస్‌ఈ తెలిపారు. గుంటవాడ జలాశయం నుంచి డొంకరాయికి నీటిని విడుదల చేస్తే దాని నీటిమట్టం కూడా పెరగనున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగం డొంకరాయి నుంచి కూడా పది వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డొంకరాయి జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,037 అడుగులు కాగా, ప్రస్తుతం 1,030.6 అడుగులకు చేరింది. ముందస్తు చర్యల్లో భాగం డొంకరాయి నుంచి కూడా 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు ఎస్‌ఈ తెలిపారు.

సీలేరు కాంప్లెక్సులోని జలాశయాలు, ప్రస్తుత నీటిమట్టాలు (అడుగుల్లో..)

క్రమ జలాశయం పేరు పూర్తిస్థాయి ప్రస్తుత నీటి

సంఖ్య నీటిమట్టం మట్టం

--------------------------------------------------------------------------

1 జోలాపుట్టు 2,750 2,745.85

2 బలిమెల 1,516 1,510.5

3 గుంటవాడ 1,360 1,338.2

4 డొంకరాయి 1,037 1,030.6

-----------------------------------------------------------------------

Updated Date - Nov 02 , 2026 | 01:12 AM