తగ్గని గెడ్డల ఉధృతి
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:44 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంప్రభావంతో జిల్లాలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శుక్రవారం జిల్లాలో జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారి, జి.మాడుగుల, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లోని మత్స్యగెడ్డ పరవళ్లు తొక్కుతున్నాయి.
వరద నీటితో పొంగి ప్రవహిస్తున్న గెడ్డలు, వాగులు
ధారకొండ ఘాట్‌లో విరిగిపడిన కొండచరియలు
పాడేరు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంప్రభావంతో జిల్లాలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శుక్రవారం జిల్లాలో జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారి, జి.మాడుగుల, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లోని మత్స్యగెడ్డ పరవళ్లు తొక్కుతున్నాయి. పాడేరు, పెదబయలు మండలాలకు సరిహద్దున ఉన్న పరదానిపుట్టు గెడ్డ, అరకులోయ, జీకేవీధి, చింతపల్లి, కొయ్యూరు, డుంబ్రిగుడ మండలాల్లోని గెడ్డల ఉధృతి కొనసాగుతున్నది. దీంతో గెడ్డలకు అవతల ఉన్న గిరిజనులు ఇళ్లకే పరిమితమయ్యారు. గెడ్డలు పొంగుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గెడ్డలు దాటవద్దని అధికారులు కోరుతున్నారు. తాజా పరిస్థితుల్లో ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా గెడ్డలు, కాజ్‌వేల వద్ద ప్రభుత్వ సిబ్బందిని కాపలా పెట్టారు. గెడ్డలకు సమీపంలోని ఉన్న గిరిజనులను నిత్యం అప్రమత్తం చేస్తున్నారు. తాజా వరదల పరిస్థితులను కంట్రోల్ రూమ్‌ల ద్వారా జిల్లా కలెక్టర్ టి.నిషాంతి, జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలిస్తున్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండడం, ముందస్తు జాగ్రత్తలు చేపట్టడడంతో జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టాలు సంభవించలేదు. భారీ వర్షాలకు ఎక్కడైనా రోడ్డు, కల్వర్టులు వంటివి దెబ్బతిన్నా.. రోడ్లపై చెట్లు విరిగి పడిన తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు.
ధారకొండ ఘాట్‌లో విరిగిపడిన కొండచరియలు
సీలేరు: జీకేవీధి మండలం ధారకొండ ఘాట్ రోడ్డులో దార్లగొంది వద్ద శుక్రవారం ఉదయం కొండచరియలు విరిగి రహదారిపై పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో గత మూడు రోజులుగా ఘాట్ రోడ్డులో కండపోతగా వర్షాలు కురుస్తుండడంతో ఐదు మీటర్ల పొడవునా కొండచరియలు విరిగిపడి పడ్డాయి. సమాచారం అందుకున్న సీలేరు ఎస్‌ఐ యాసిన్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, స్థానిక యువత ఘటనా ప్రదేశానికి చేరుకుని విరిగిపడిన కొండచరియలు, చెట్లను తొలగించారు.
కొట్టుకుపోయిన డి.అగ్రహారం వంతెన
15 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
సీలేరు: జీకేవీధి మండలం దుప్పులవాడ పంచాయతీ శివారు డి .అగ్రహారం వంతెన వరద ఉధృతికి శుక్రవారం తెల్లవారుజామున కొట్టుకుపోయింది. ఎగువన కురిసిన వర్షాలకు వరదనీరు ఉధృతంగా వంతెన పైనుంచి ప్రవహిస్తోంది. గురువారం రాత్రి భారీ స్థాయిలో వరదనీరు రావడంతో వంతెన కొట్టుకుపోయింది. దుప్పలవాడకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న డి.అగ్రహారం ముందు ఉన్న వంతెన కొట్టుకుపోవడంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
సహసోపేత ప్రయాణం
ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డలు
ముంచంగిపుట్టు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):
మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మండలంలోని గెడ్డలు, వాగులు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ దొరగూడ, ఒడిశాకు చెందిన తాబేరు గ్రామాల మధ్యలో గెడ్డ వరద నీటితో ఉధృతంగా ప్రవహించడంతో శుక్రవారం తాళ్ల సాయంతో ద్విచక్ర వాహనాలను ఒడ్డుకు దాటిస్తున్నారు. గెడ్డకు రెండు వైపులా ఉన్న చెట్లకు తాడు కట్టి ద్విచక్ర వాహనాలను గెడ్డ దాటిస్తున్నారు. అలాగే బూసిపుట్టు, రంగబయలు, జోలాపుట్టు, పనసపుట్టు, సుజనకోట, పెదగూడ, కరిముఖిపుట్టు, బంగారుమెట్ట తదితర పంచాయతీల పరిధిలో పలుచోట్ల గెడ్డలు, వాగులు వరదనీటితో ఉగ్రరూపం దాల్చాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.
పాడేరు ఘాట్‌లో విరిగిపడిన వృక్షం
రెండు గంటలు ట్రాఫిక్‌జామ్
పాడేరురూరల్, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి):
పాడేరు ఘాట్ మార్గంలో శుక్రవారం రాత్రి 6.30 గంటల సమయంలో భారీ వృక్షం ప్రధాన రహదారిపై పడిపోవడంతో రెండు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పాడేరు-విశాఖ ప్రధాన రహదారిలోని పాడేరు ఘాట్‌లో 12వ మైళ్లు గ్రామం దాటిన తరువాత ఏనుగురాయి మలుపు వద్ద రోడ్డుకడ్డంగా వృక్షం పడిపోవడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక తహశీల్దార్ బత్తుల శ్రీనివాసరావు, ఆర్‌అండ్‌బీ అధికారులు సంఘటనా స్థలానికి హుటాహుటీన చేరుకొని చెట్టును తొలగించడంతో వాహనదారులు, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
బోడిదేవుళ్లు గుడి వద్ద కుంగిన రహదారి
పెదవలస-కృష్ణాదేవిపేట
ఎన్‌హెచ్‌పై రాకపోకలు బంద్
చింతపల్లి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):
పెదవలస-కృష్ణాదేవిపేట జాతీయ రహదారిపై రెవెన్యూ, పోలీసు అధికారులు రాకపోకలు నిలిపివేశారు. శుక్రవారం ఉదయం బోడిదేవుళ్లు గుడి వద్ద జాతీయ రహదారి కుంగిపోయింది. దీంతో ఈ రహదారి ప్రమాదభరితంగా మారింది. రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు జాతీయ రహదారి నిర్మాణం జరుగుతున్నది. తాజాగా పది రోజుల క్రితం పెదవలస వద్ద జాతీయ రహదారి నిర్మాణం పూర్తి చేశారు. అయితే తాజాగా కురిసిన వర్షాలకు బోడిదేవుళ్లు గుడి వద్ద పది మీటర్లు రహదారి కుంగిపోయింది. దీంతో పెదవలస వద్ద రహదారిని అధికారులు మూసివేశారు.