Share News

జలాశయాలకు తగ్గని ఇన్‌ఫ్లో

ABN , Publish Date - Oct 31 , 2026 | 11:07 PM

ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి నీరందించే డుడుమ, జోలాపుట్టు జలాశయాలలో నీటి ఉధృతి కొనసాగుతోంది.

జలాశయాలకు తగ్గని ఇన్‌ఫ్లో
జోలాపుట్టు ప్రధాన జలాశయం, స్పిల్‌వే డ్యాంల నుంచి నీటిని విడుదల చేస్తున్న దృశ్యం

డుడుమ, జోలాపుట్టులకు కొనసాగుతున్న నీటి ఉధృతి

గరిష్ఠ స్థాయిలో నీటిమట్టం నమోదు

ఐదు రోజులుగా నీటి విడుదల

ముంచంగిపుట్టు, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి నీరందించే డుడుమ, జోలాపుట్టు జలాశయాలలో నీటి ఉధృతి కొనసాగుతోంది. రెండు జలాశయాల్లో వరద నీరు ఇన్‌ఫ్లో ఎక్కువగా వస్తోంది. దీంతో గత ఐదు రోజులుగా భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. జోలాపుట్టు జలాశయంలో 2,750 అడుగుల గరిష్ఠ నీటి సామర్థ్యం కాగా శనివారం 2,747.40 అడుగులు నీటిమట్టం నమోదైంది. ప్రస్తుతం ఈ జలాశయానికి 10వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జోలాపుట్టు ప్రధాన జలాశయం, స్పిల్‌వే డ్యాంల నుంచి దిగువ ప్రాంతంలో గల డుడుమకు 18 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే డుడుమ జలాశయంలో 2,590 అడుగుల గరిష్ఠ నీటి సామర్థ్యం కాగా ప్రస్తుతం 2,584.20 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఇక్కడ నుంచి దిగువ ప్రాంతంలో ఉన్న బలిమెలకు 18వేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నది. విద్యుత్‌ ఉత్పాదనకు అవసరమైన నీటిని డుడుమ డ్యాం నుంచి సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో మూడు జనరేటర్ల సహాయంతో 51 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన జరుగుతున్నది. మరో మూడు జనరేటర్లను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ అధికారులు, సిబ్బంది శ్రమిస్తున్నారు. ఆరు జనరేటర్లతో 120 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన చేసే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ఉంది.

Updated Date - Oct 31 , 2026 | 11:07 PM