Share News

యూజీడీ నిర్వహణ అధ్వానం

ABN , Publish Date - Jun 25 , 2026 | 01:18 AM

నగరంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ (యూజీడీ) నిర్వహణ అధ్వానంగా తయారైంది. యూజీడీ నిర్వహణకు జీవీఎంసీ ఏటా రూ.6.14 కోట్లు వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట యూజీడీ మ్యాన్‌ హోల్స్‌ నుంచి మురుగునీరు పొంగి రోడ్లపై ప్రవహిస్తోంది. దీనివల్ల పారిశుధ్య సమస్య తలెత్తడంతోపాటు ఆ రోడ్డులో రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

యూజీడీ నిర్వహణ అధ్వానం

ఎక్కడికక్కడ పొంగుతున్న మ్యాన్‌హోల్స్‌

రోడ్లపై ప్రవహిస్తున్న మురుగునీరు

పారిశుధ్య సమస్య తలెత్తడంతోపాటు

రాకపోకలకు వాహన చోదకుల అవస్థలు

ఫిర్యాదులు అందినా పట్టని కాంట్రాక్టర్లు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ (యూజీడీ) నిర్వహణ అధ్వానంగా తయారైంది. యూజీడీ నిర్వహణకు జీవీఎంసీ ఏటా రూ.6.14 కోట్లు వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట యూజీడీ మ్యాన్‌ హోల్స్‌ నుంచి మురుగునీరు పొంగి రోడ్లపై ప్రవహిస్తోంది. దీనివల్ల పారిశుధ్య సమస్య తలెత్తడంతోపాటు ఆ రోడ్డులో రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

జీవీఎంసీ పరిధిలో దాదాపు 800 కిలోమీటర్లు పొడవున యూజీడీ నెట్‌వర్క్‌ విస్తరించి ఉంది. పైప్‌లైన్‌లు ఎక్కడైనా పూడిక, ఇతర వ్యర్థాలు కారణంగా బ్లాక్‌ అయిపోతే సమస్య పరిష్కరించేందుకు వీలుగా ప్రతి 30 మీటర్లకు ఒక మ్యాన్‌హోల్‌ను ఏర్పాటుచేస్తారు. ఇలా నగర పరిధిలో సుమారు 30 వేల మ్యాన్‌హోల్స్‌ ఉన్నాయి. మరుగుదొడ్ల నుంచి మలమూత్రాలు డ్రైనేజీల్లో కలవకుండా ప్రత్యేకంగా భూగర్భంలో ఏర్పాటుచేసిన యూజీడీ పైప్‌లైన్‌కు కనెక్షన్‌ ఇస్తారు. యూజీడీ పైప్‌లైన్‌లోకి చేరిన మురుగునీరు సమీపంలోని పంప్‌హౌస్‌లకు చేరి అక్కడి నుంచి ఆయా జోన్‌ల పరిధిలోని సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల (ఎస్‌టీపీ)కు చేరుతుంది. అక్కడ శుద్ధి చేసిన తర్వాత పర్యావరణహితంగా మార్చి సముద్రంలోకి విడిచిపెట్టడం, మొక్కల పెంపకానికి ఉపయోగించడం చేస్తుంటారు. యూజీడీ నిర్వహణ కోసం జీవీఎంసీ ఇంజనీరింగ్‌ విభాగంలో ఒక సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ ఆధ్వర్యంలో నలుగురు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. ఇక పైప్‌లైన్‌ ఎక్కడైనా బ్లాక్‌ అయినా, మ్యాన్‌హోల్స్‌ పొంగినా సమస్యను పరిష్కరించేందుకు రెండు టాటాఏస్‌ వాహనాలు, బ్లాక్‌లను క్లియర్‌ చేసేందుకు టూ ఇన్‌ వన్‌ వాటర్‌ జెట్టింగ్‌, సక్షన్‌ వాహనాలు (మురుగునీరు, వ్యర్థాలను పీల్చుకోవడానికి వ్యాక్యూమ్‌ అమర్చిన ప్రత్యేక వాహనం) రెండు, వాటర్‌ జెట్టింగ్‌, సక్షన్‌, పూడికతీసే త్రీన్‌ ఇన్‌ వన్‌ వాహనాలు రెండు, వాటర్‌ జెట్టింగ్‌ వాహనాలు ఐదు, సక్షన్‌ వాహనాలు రెండు ఉన్నాయి. వీటి ద్వారా పనులు చేయడంతోపాటు యూజీడీ బ్లాక్‌లు తొలగించేందుకు అవసరమైన పరికరాలు, సిబ్బందికి గ్లౌజ్‌లు, పారలు, గునపాలు, స్టీల్‌రాడ్‌లను సరఫరా చేసేందుకు జీవీఎంసీ కాంట్రాక్టర్లకు టెండర్ల ద్వారా పనులు అప్పగిస్తుంది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు తమ పరిధిలో సిబ్బందికి పరికరాలను అందజేయడం, జెట్టింగ్‌ వాహనాల నిర్వహణ, మరమ్మతులు చూసుకోవడంతో పాటు ఎక్కడైనా ఫిర్యాదు అందితే వెంటనే అక్కడకు చేరుకుని సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. కానీ కొందరు కాంట్రాక్టర్లు అధికారులను గుప్పిట్లో పెట్టుకుని యంత్రాలను వాడకుండా కేవలం మనుషులతోనే పనులను చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడైనా యూజీడీ పొంగిపోయిందని ఫిర్యాదు అందితే నాలుగైదు రోజులకు గానీ సమస్యను పరిష్కరించడం లేదు. సీతంపేటలో వినాయకుడి గుడి నుంచి కృష్ణుడు గుడి వైపు వెళ్లే రోడ్డులో యూజీడీ మ్యాన్‌హోల్‌ గత నాలుగు రోజుల నుంచి పొంగుతుందని స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదు. అలాగే వన్‌టౌన్‌లోని ఇందిరా ప్రియదర్శిని మునిసిపల్‌ స్టేడియం ఎదురుగా మ్యాన్‌హోల్‌ నుంచి మూడు రోజులుగా మురుగునీరు పొంగి రోడ్డుపై ప్రవహిస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇలాంటివి నగరంలో ఎక్కడికక్కడ కనిపిస్తున్నా సమస్య పరిష్కారానికి కాంట్రాక్టర్లు చొరవ చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ వారికి బిల్లులు మాత్రం చెల్లిం చేస్తుండడంతో అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Jun 25 , 2026 | 01:18 AM